Politics

ఆదివాసీలను మోసం చేసిన కేసీఆర్

ఆదివాసీలను మోసం చేసిన కేసీఆర్

అదివాసీలు, గిరిజనుల అభివృద్థి కోసం కాంగ్రెస్ ఎంతో చేసిందని ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఖానాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసగించారు. ఈ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గిరిజనులు, ఆదివాసీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని.. అదే విధంగా గిరిజనుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.

ఇందిరాగాంధీ రాజకీయాలు కేవలం ప్రజల సంక్షేమం కోసమే చేశారని.. అందుకే ఎప్పుడూ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ప్రియాంక వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ 40 ఏళ్ల మరణించినా.. ఆమెను ప్రజలు ఇప్పటికీ గుర్తుకు చేసుకుంటున్నారని అన్నారు. అలాగే సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. కేసీఆర్ తెలంగాణలో నిరంకుశ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. పోడు పట్టాల ఇవ్వకుండా కేసీఆర్ ఆదివాసీలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పదేళ్లుగా కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నా.. ప్రజలు ఇంకా వెనుకబడే ఉన్నరని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల జీవితాలు మారుతాయని.. ఉద్యమకారులు ఎన్నో కలలు కన్నారు కానీ అటువంటిదేమీ జరగలేదని విమర్శించారు. తెలంగాణ యువతకు కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా… వారి జీవితాలతో ఆడుకుంటోందని ఆరోపించారు. అదే కేసీఆర్ కుటుంబంలో మాత్రం నలుగరికి ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్నికలలో గెలిస్తే.. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. టీఎస్పీఎస్సీలో వైఫల్యం వల్ల ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.జాబ్ కావాలంటే ముందు బీఆర్ఎస్ పోవాలని.. కేసీఆర్ ఫ్యామిలీ ఉద్యోగాలను పీకేయాలని ఆమె అన్నారు. ఎన్నికల్లో యువత ఆ పని చేస్తే నిరుద్యోగులకు తప్పకుండా కొలువులొస్తాయని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z