Business

డిస్నీ హాట్‌స్టార్ కొత్త రికార్డు- వాణిజ్య వార్తలు

డిస్నీ హాట్‌స్టార్ కొత్త రికార్డు- వాణిజ్య వార్తలు

*  జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బాండ్ల జారీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి వేరుపడిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బాండ్ల జారీకి సిద్ధమవుతోంది. ఈ మేరకు మర్చంట్‌ బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. బాండ్ల జారీ ద్వారా రూ.5 వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్ల మేర సమీకరించాలని ఆ కంపెనీ ఆశిస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే బాండ్ల జారీ చేయొచ్చని తెలుస్తోంది.ఈ ఏడాది ఆగస్టులో జియో ఫైనాన్షియల్‌ మార్కెట్లో లిస్టయిన సంగతి తెలిసిందే. దేశీయంగా బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి సంస్థలకు గట్టి పోటీనివ్వాలని ఆ సంస్థ భావిస్తోంది. హోమ్‌, పర్సనల్‌, ఆటో లోన్స్‌ ద్వారా పూర్తి స్థాయి ఫైనాన్షియల్‌ సంస్థగా అవతరించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో బాండ్లు జారీ చేసేందుకు జియో ఫైనాన్షియల్‌  సిద్ధమవుతోంది. బాండ్ల జారీకి ముందు క్రెడిట్ రేటింగ్‌తో పాటు సంబంధిత అనుమతులు పొందాల్సిన అవసరం ఉంటుంది.జియో ఫైనాన్షియల్‌కు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి పెద్ద కంపెనీ వెన్నుదన్నుగా ఉన్న నేపథ్యంలో ‘ఏఏఏ’ రేటింగ్‌ రావడం సులభమేనని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ధర, కాలవ్యవధి వంటివి జారీ సమయంలో తెలియరానున్నాయి. ఈ మధ్యే జియో ఫైనాన్షియల్‌ మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పదేళ్ల కాలవ్యవధి కలిగిన బాండ్ల ద్వారా రూ.20వేల కోట్లను సమీకరించింది. రిలయన్స్‌ జారీ చేసిన బాండ్ల కంటే జియో ఫిన్‌ జారీ చేసే బాండ్ల కూపన్‌ రేటు కాస్త అధికంగానే ఉండొచ్చని చెబుతున్నారు. బాండ్ల జారీపై జియో ఫైనాన్షియల్‌ అధికారికంగా స్పందించలేదు.

* డిస్నీ+ హాట్‌స్టార్ కొత్త రికార్డు

వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లు డిస్నీ+ హాట్‌స్టార్‌(Disney+Hotstar)లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అయిన విష‌యం తెలిసిందే. అయితే హాట్‌స్టార్ యాప్‌లో రికార్డు స్థాయిలో వ్యూవ‌ర్‌షిప్ న‌మోదు అయ్యింది. ఇండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ క్రికెట్ మ్యాచ్‌ను సుమారు 5.9 కోట్ల మంది వీక్షించిన‌ట్లు భావిస్తున్నారు. ఇదే టోర్న‌మెంట్‌లో ఇండియా, న్యూజిలాండ్ మ‌ధ్య జ‌రిగిన సెమీస్ మ్యాచ్‌ను 5.3 కోట్ల మంది వీక్షించారు. మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో అత్య‌ధిక సంఖ్య‌లో ఎంత మంది చూశార‌న్న దానిపై వ్యూవ‌ర్‌షిప్‌ను అంచ‌నా వేస్తారు. డిస్నీ హాట్‌స్టార్ లో పీక్ స‌మ‌యంలో సుమారు 5.9 కోట్ల మంది మ్యాచ్‌ను వీక్షించిన‌ట్లు ఆ కంపెనీ తెలిపింది. ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌ను అత్య‌ధికంగా 3.5 కోట్ల మంది వీక్షించారు. డిస్నీ స్టార్‌, స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేసిన ఫైన‌ల్ మ్యాచ్ గురించి పూర్తి వ్యూవ‌ర్‌షిప్ స‌మాచారాన్ని బ్రాడ్‌కాస్ట్ ఆడియ‌న్స్ రీస‌ర్చ్ కౌన్సిల్ మ‌రో వారంలో వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఆ కంపెనీ ఇండియా ఇంచార్జ్ స‌జిత్ శివానంద‌న్ తెలిపారు.

ఎస్‌బీఐ వియ్‌కేర్‌ గడువు పొడిగింపు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన వియ్‌- కేర్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం గడువును మరోసారి పొడిగించింది. సీనియర్‌ సిటిజన్ల కోసం తీసుకొచ్చిన ఈ పథకం వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతుందని ఎస్‌బీఐ తెలిపింది. ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధికి అత్యధిక వడ్డీ రేటు లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ ఎస్‌బీఐ ఇవ్వనుంది. కొత్తగా డిపాజిట్‌చేసే వారు, రెన్యువల్స్‌పై ఈ పథకాన్ని పొందొచ్చు. సీనియర్‌ సిటిజన్లకు సాధారణ  పౌరులతో పోలిస్తే అందించే 50 బేసిస్‌ పాయింట్లతో పాటు.. కార్డు రేటుపై 50 బేసిస్‌ పాయింట్లు కలిపి మొత్తంగా 100 బేసిస్‌ పాయింట్లు అదనంగా వియ్‌ కేర్‌ కింద అందిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. 60 ఏళ్లు దాటిన వారే ఈ పథకంలో చేరేందుకు అర్హులు. నెట్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌ ద్వారా లేదా బ్యాంకు శాఖకు వెళ్లి ఈ డిపాజిట్‌ చేయొచ్చు. కనీస వ్యవధి 5 ఏళ్లు. గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు కొనసాగించుకోవచ్చు. రూ.2 కోట్ల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు. డిపాజిట్‌ హామీగా రుణం తీసుకునే వెసులుబాటు ఉంది.ఒక్క ఎస్‌బీఐనే కాదు ఐసీఐసీఐ బ్యాంక్‌ సైతం గోల్డెన్‌ ఇయర్స్‌ ఎఫ్‌డీ పేరిట ఇదే తరహా పథకాన్ని అందిస్తోంది. సీనియర్‌ సిటిజన్‌లకు అందించే 50 బేసిస్ పాయింట్లతో పాటు 10 బేసిస్‌ పాయింట్లు అదనంగా వడ్డీ ఇస్తోంది. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల  కాలవ్యవధిపై 7.50 శాతం వడ్డీ లభిస్తోంది. 2023 ఏప్రిల్‌ 30 వరకు అందుబాటులో ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ సైతం ఇదే తరహా పథకాన్ని అందించినప్పటికీ.. దాని గడువు ఇటీవలే ముగిసింది.

గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్

ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. బ్యాంక్ ఫాస్ట్ ఫార్వర్డ్ హోమ్ లోన్స్‌ను ఆఫర్ చేస్తోంది. దీనిలో లోన్ ఈఎంఐ మాఫీని అందిస్తుంది. కొత్తగా ప్లాట్ కొనుగోలు, ఇంటి నిర్మాణం, పాత లేదా కొత్త ఇంటి కొనుగోలు వంటి వాటి కోసం బ్యాంకు ఫాస్ట్ ఫార్వర్డ్ హోమ్ లోన్స్‌‌ను ఆఫర్ చేస్తుంది. కొంతమంది కస్టమర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది దీనిలో కనీసం రూ.30 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ముఖ్యంగా దీనిలో 12 EMIల మాఫీ చేసే బెనిఫిట్ కూడా ఉంది. అలాగే, డోర్‌స్టెప్ సర్వీస్‌తో పాటు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది.10 ఏళ్ల పాటు లోన్ EMI కడితే అందులో 6 EMIలు మాఫీ బెనిఫిట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే 15 ఏళ్ల పాటు లోన్ కడితే 10 EMIల మాఫీ లభిస్తుంది. తిరిగి చెల్లింపుల ట్రాక్ సరిగ్గా ఉన్నవారికి ఈ ఫెసిలిటీ ఉంటుంది. ఈ హోమ్ లోన్ టెన్యూర్ కనీసం 20 ఏళ్లు పెట్టుకోవాలి. ముఖ్యంగా సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటు ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. 751 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి వడ్డీ రేటు 8.7 శాతం నుంచి మొదలవుతుంది. అదే స్వయం ఉపాధి గల వారికి వడ్డీ రేటు 9.1 శాతం నుంచి ఉంటుంది.

* టెక్ స్టార్ట‌ప్స్‌లో లేఆఫ్స్ క‌ల‌కలం

ప్ర‌ముఖ ఎడ్యుటెక్ స్టార్ట‌ప్ ఫిజిక్స్‌వాలా 120 మంది ఉద్యోగుల‌ను విధుల నుంచి తొల‌గించిన‌ట్టు (Layoffs) తెలిసింది. స్టార్ట‌ప్‌లు ఆర్ధిక స‌మ‌స్య‌లను ఎదుర్కొంటుండ‌టంతో లేఆఫ్స్ లేటెస్ట్ ట్రెండ్‌గా ముందుకొచ్చింది. ఉద్యోగుల సామ‌ర్ధ్యాల‌ను స‌మీక్షించే క్ర‌మంలో ప‌లువురు ఉద్యోగుల‌పై ఫిజిక్స్‌వాలా వేటు వేసింద‌ని చెబుతున్నారు. ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునేందుకే ఫిజిక్స్‌వాలా ఉద్యోగుల‌ను తొల‌గించింద‌ని జాబ్‌క‌ట్స్‌పై తొలుత స‌మాచారం అందించిన ఎన్‌ట్రాక‌ర్ పేర్కొంది.కంపెనీ లాభాల బాట‌ప‌ట్టి యూనికార్న్ హోదాను గ‌తేడాది సాధించ‌గా తాజా లేఆఫ్స్ ఆందోళ‌న రేకెత్తిస్తున్నాయి. తాము ఏటా చేప‌ట్టే మ‌ధ్యంత‌ర‌, సంవ‌త్స‌రాంత ఉద్యోగుల స‌మీక్ష‌లో భాగంగా 120 మంది ఉద్యోగుల‌ను విధుల నుంచి తొల‌గించామ‌ని ఫిజిక్స్‌వాలా సీహెచ్ఆర్వో స‌తీష్ ఖెంగ్రే పేర్కొన్నారు. భార‌త్‌లో ఆర్ధిక మంద‌గ‌మ‌న ప‌రిస్ధితుల్లో టెక్ స్టార్ట‌ప్‌ల్లో లేఆఫ్స్ పెరుగుతున్నాయి.ప్ర‌స్తుత ప‌రిస్ధితుల్లో టెక్ ప‌రిశ్ర‌మ స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌డంలో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోంది. ప్ర‌స్తుత వృద్ధి రేటును నిల‌క‌డ‌గా కొన‌సాగించ‌డంలో ఇబ్బందులు ఎదుర‌వ‌డంతో వ్య‌య నియంత్ర‌ణ చేప‌ట్టి పోటీకి దీటుగా నిల‌బ‌డేందుకు లేఆఫ్స్‌కు తెగ‌బ‌డుతున్నాయి.

*   సైబర్ సెక్యూరిటీపై ఫోకస్ పెట్టండి

ప్రభుత్వ బ్యాంకులు తమ డిజిటల్ ఆపరేషన్స్‌‌ను ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలని ఫైనాన్స్ మినిస్ట్రీ కోరింది. ఈ నెల 10–13 మధ్య  యూకో బ్యాంక్ ఐఎంపీఎస్‌‌ ద్వారా రూ.820‌‌‌‌ కోట్లను కస్టమర్ల అకౌంట్లలో వేసింది. ఇందులో రూ. 649 కోట్లు  రికవరీ చేయగలిగింది. సైబర్ సెక్యూరిటీ మెరుగుపరుచుకోవాలని బ్యాంకులకు ఫైనాన్స్ మినిస్ట్రీ సూచించింది. ఫైనాన్స్ సెక్టార్‌‌‌‌లో డిజిటైజేషన్ పెరుగుతుండడంతో సైబర్ దాడుల నుంచి రక్షించుకోవడానికి సెక్యూరిటీ మెరుగుపరుచుకోవాలని ఆర్‌‌‌‌బీఐ, ఫైనాన్స్ మినిస్ట్రీ బ్యాంకులను ఎప్పటికప్పుడు చెబుతున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z