DailyDose

ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పిన కేసీఆర్‌- తాజా వార్తలు

ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పిన కేసీఆర్‌- తాజా వార్తలు

* ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పిన కేసీఆర్‌

తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభవార్త చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటోలకు సంబంధించిన ఫిట్‌నెస్‌ ఛార్జీలు, సర్టిఫికెట్‌ జారీలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరినీ వదలకుండా ప్రతి ఒక్కరికీ సహాయం చేశాం. ట్రాఫిక్‌ పోలీసులు పొద్దాక పొగలో ఉంటరు కాబట్టి శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటరు. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క తెలంగాణలోనే 30శాతం అలవెన్స్‌ వారి వేతనంలో ఇస్తున్నాం. భారతదేశంలో హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రం తెలంగాణనే. ఎక్కడ కూడా ఇంత ఇవ్వరు’ అన్నారు.కరీంనగర్‌కు నాకు ఏదో శ్రుతి ఉన్నది..‘ఆటోరిక్షా పోరగాళ్లు ఉన్నరు. వాళ్లకు నేను ఇవాళ శుభవార్త చెబుతున్నాను. వారికి ఆదాయం వచ్చే తక్కువ. నరేంద్ర మోదీ విపరీతంగా డీజిల్‌ ధర పెంచేటట్టు చేసిండు. దేశవ్యాప్తంగా ఆటో రిక్షా కార్మికుల దగ్గర ముక్కుపిండి పన్ను వసూలు చేస్తరు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాంగనే పన్ను రద్దు చేసిన. రూపాయి పన్ను లేదు. ఇప్పుడు వాళ్లకు ఏం బాధ ఉన్నదంటే. సంవత్సరానికి కోసారి ఫిట్‌నెస్‌ చేయించుకోవాలి. ఆ ఫిట్‌నెస్‌కు వెళితే రూ.700 ఛార్జి చేస్తరు. సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు రూ.500 ఛార్జీ వేస్తున్నరు. మొత్తం కలిపి రూ.1200 అవుతుంది. ఈ సారి బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ వస్తే ఫిట్‌నెస్‌ పన్నును రద్దు చేస్తమని ప్రకటిస్తున్నా. కరీంనగర్‌కు నాకు ఏదో శ్రుతి ఉన్నది. కరీంనగర్‌ భీముడు కమలాకర్‌ మొన్న అన్నడు. మీకు కరీంనగర్‌కు ఏదో లింక్‌ ఉన్నది సార్‌ అన్నడు. లింక్‌ అయితే ఉన్నదనుకో ఇక్కడి నుంచే పెళ్లి చేసుకున్న. కరీంనగర్‌ పిల్లనే పెళ్లి చేసుకున్న. నేను కరీంనగర్‌ ఎప్పుడు వచ్చినా ఏదో స్కీమ్‌ ప్రకటిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలోని ఆటో కార్మికులకు ఫిట్‌నెస్‌ ఛార్జి, సర్టిఫికెట్‌ ఛార్జీలను రద్దు చేస్తాం. తక్కువ ఆదాయం ఉన్న ప్రజలకు అందరికీ అన్నీ చేసుకుంటూ పోతున్నాం’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

24 25 తేదీల్లో రాహుల్ ప్రియాంక తెలంగాణలో  పర్యటనలు

బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు జోరుగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ చూస్తుంటే.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ సారి ఎన్నికలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ అధినాయకత్వం పట్టుదలగా ఉంది.ఈ క్రమంలో  కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు.  స్వయంగా వారే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. కాంగ్రెస్ ను గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నారు. ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించిన రాహుల్, ప్రయాంక గాంధీలు.. మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా.. 2023, నవంబర్ 24, 25 తేదీల్లో రాహుల్, ప్రియాంక గాంధీలు తెలంగాణలో  సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. 24న పాలకుర్తి‌, హుస్నాబాద్, నిజామాబాద్ రూరల్ లో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనుండగా.. నవంబర్ 25న మెదక్, తాండూరు, ఖైరతాబాద్ లో రాహుల్ గాంధీ ప్రచారం చేయనున్నారు.

ఇదే కాంగ్రెస్‌ నిజ స్వరూపం

వారసత్వ రాజకీయాలే కాంగ్రెస్‌ (Congress)కు సర్వస్వమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆరోపించారు. రాజస్థాన్‌లో అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం అవసరమని.. కానీ, కాంగ్రెస్‌కు అవినీతి, వారసత్వ రాజకీయాలకన్నా ముఖ్యమైనదేదీ లేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం (Rajasthan Elections)లో ఇక్కడి పాలీలో నిర్వహించిన ప్రచార సభలో మోదీ పాల్గొని, ప్రసంగించారు. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు.. మహిళా వ్యతిరేక మనస్తత్వం కలిగి ఉన్నాయని ఈ సందర్భంగా మండిపడ్డారు.‘మహిళా బిల్లు ఆమోదం పొందినప్పటినుంచి.. విపక్ష కూటమికి చెందిన నేతలు మహిళలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు. బిహార్ సీఎం అసెంబ్లీలో మహిళల విషయంలో అత్యంత అవమానకర వ్యాఖ్యలు చేశారు. కానీ, కాంగ్రెస్ నాయకులెవరూ దీన్ని ఖండించలేదు. ఇదే కాంగ్రెస్‌ నిజ స్వరూపం. ప్రజలంతా దీన్ని గుర్తించారు’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ బుజ్జగింపులు తప్ప మరేమీ ఆలోచించదన్నారు. దళితులపై జరుగుతోన్న దౌర్జన్యాల విషయంలో కళ్లు మూసుకుందని ఆరోపించారు.అభివృద్ధే ధ్యేయంగా ఈ రోజు దేశం మొత్తం పని చేస్తోంది. 21వ శతాబ్దంలో భారత్‌ అందుకునే విజయాల్లో రాజస్థాన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం అవసరం’ అని ప్రధాని మోదీ అన్నారు. సనాతన ధర్మాన్ని అంతం చేయడమంటే.. రాజస్థాన్‌ సంస్కృతిని అంతం చేయడమేనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో ఈ నెల 25న ఒకే దశలో పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం 

ఈ ఎన్నికలు బీఆర్ఎస్ అహంకారానికి ఇందిరమ్మ ప్రజా పాలనకు మధ్య జరుగుతున్నాయని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నార ఆయన అన్నారు.

మోడీ పై కాంగ్రెస్ సెటైర్లు

ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు సమయం దొరికింది కానీ హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌ను సందర్శించేందుకు మాత్రం నేటికి సమయం దొరకడం లేదని కాంగ్రెస్ విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. మణిపూర్‌లో మే నుంచి నేటికి ఉద్రిక్తత వాతావరణం ఉందని కానీ మోడీ మాత్రం అటువైపు చూడనే లేదని ధ్వజమెత్తారు. మణిపూర్ ను సందర్శించని మోడీ అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను మాత్రం తిలకించారని ఇక నేటి నుంచి రాజస్థాన్, తెలంగాణలో కాంగ్రెస్ పై విమర్శలు చేయడానికి వస్తారని దుయ్యబట్టారు. మోడీ ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయని సెటైర్లు వేశారు.మరో వైపు భారత దేశ ఆర్థిక వ్యవస్థ మొదటిసారి 4 ట్రిలియన్స్ డాలర్లు దాటినట్లు సోషల్ మీడియాలో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి డేటా ఆధారంగా అన్ని దేశాలకు సంబంధించిన జీడీపీ లైవ్ ట్రాకింగ్ పేరిట ఉన్న స్కీన్ షార్ట్ ఒకటి వైరల్ కాగా దీనిపై నిన్న పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్, బిలీనియర్ గౌతమ్ అదానీ వంటి వారు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. అయితే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ కానీ ధృవీకరించలేదు. దీంతో ఈ విషయంపై జైరామ్ రమేష్ విమర్శలు గుప్పించారు. ఓవైపు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను దేశం మొత్తం చూస్తుంటే మరో వైపు దేశ ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్ల మార్క్ దాటిందని కేంద్ర మంత్రులు, ప్రధానికి అత్యంత ఇష్టమైన వ్యాపారవేత్త మోడీకి డప్పు కొట్టారని సెటైరికల్ ట్వీట్ చేశారు.

*  కేసీఆర్‌ ప్రచార వాహనంలో తనిఖీలు

 తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్‌ 30వ తేదీన పోలింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్‌ పెంచాయి. అధికార బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్‌ వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు తనిఖీలు నిర్వహించాయి.  వివరాల ప్రకారం.. సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు సోమవారం తనిఖీలు నిర్వహించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు హాజరవనున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి ప్రగతి రథం బస్సు వెళ్తున్న సమయంలో కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి టోల్‌గేట్‌ వద్ద కేంద్ర బలగాలు నిర్వహించాయి. బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.అయితే, ఎన్నికల నిబంధనలను అనుసరించి బలగాలకు సిబ్బంది పూర్తిగా సహకరించారు. ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మానకొండూరు, స్టేషన్‌ఘన్‌పూర్‌, నకిరేకల్‌, నల్గొండ నియోజకవర్గాల్లో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై ప్రసంగించనున్నారు.

రైతుబంధు, రైతు రుణమాఫీలకు కూడా నో పర్మిషన్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్ర ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ విడుదలకు అనుమతివ్వడం కుదరదని తేల్చి చెప్పింది. పెండింగ్ డీఏలు ఎన్నికల కోడ్ సమయంలో ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఈసీ. దీంతో పాటు రైతుబంధు, రైతు రుణమాఫీలకు సంబంధించిన నిధుల విడుదలకు కూడా అనుమతి నిరాకరించింది.

వైన్స్ షాపుల్లో తెలంగాణ నంబర్ వన్ 

సీఎం కేసీఆర్ తెలంగాణను వైన్స్ షాపుల్లో నంబర్ వన్ చేశాడని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. కేసీఆర్ పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నాడని ప్రశ్నించారు. స్వరాష్ట్రం కోసం పార్లమెంట్‌లో కొట్లాడింది తామని.. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని అన్నారు. మరోవైపు ఆనాడు సోనియాగాంధీని పొగిడిన కేసీఆర్ నేడు ఆమెను తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్ గాంధీ తిరుగుతుంటే ఎందుకు వస్తున్నాడని అడుగుతున్నారని.. మీరెందుకు మహారాష్ట్ర పోయారని ప్రశ్నించారు. గతంలో అన్నం పెట్టే రైతన్నకు ఖమ్మంలో కేసీఆర్ సంకెళ్లు వేయించాడని గుర్తుచేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z