* బైజూస్‌కు ఈడీ నోటీసులు
ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్‌కు (Byjus) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. విదేశీ మారక నిబంధనలు ఉల్లంఘించి రూ.9000 కోట్లు విదేశాలకు తరలించినట్లు నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ వార్తలను బైజూస్ ఖండించింది. మీడియాలో వస్తున్న కథనాలను తోసిపుచ్చుతున్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘనపై ఈడీ నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని తెలిపారు.ఆంగ్ల మీడియా కథనాల ప్రకారం.. 2011 నుంచి 2023 మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో రూ.28 వేల కోట్లు బైజూస్ అందుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపినట్లు సీఎన్‌బీసీ టీవీ-18 పేర్కొంది. ఇదే కాలంలో విదేశీ పెట్టుబడుల రూపంలో ఇతర దేశాలకు రూ.9,754 కోట్లను బైజూస్ తరలించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద ఈ ఏడాది ఏప్రిల్‌లో బెంగళూరులోని బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్, బైజూస్ మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన మూడు ప్రదేశాల్లో సోదాలు జరిగాయి. దీంతో రవీంద్రన్‌కు, థింక్ అండ్ లెర్న్‌కు ఈడీ నోటీసులు జారీ కావడం గమనార్హం. థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్‌ను రవీంద్రన్, ఆయన భార్య దివ్య గోకుల్‌నాథ్ 2011లో ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి శిక్షణ ఇచ్చేందుకు ఆన్‌లైన్ లెర్నింగ్ ప్రోగ్రాములను అందించేవారు. 2015లో బైజూస్ లెర్నింగ్ యాప్‌ను ప్రారంభించారు. 2018 నాటికే 1.5 కోట్ల యూజర్లను సంపాదించుకున్న ఈ యాప్.. కొవిడ్ సమయంలో మరింత పాపులర్ అయ్యింది. డిజిటల్ ఆన్‌లైన్ క్లాసులకు అడ్డాగా మారింది. అయితే, కొవిడ్ తగ్గుముఖం పట్టిన అనంతరం ఆన్‌లైన్ విద్యకు డిమాండ్ తగ్గడం.. భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు.. ఆర్థిక కష్టాలు.. కోర్టు కేసులు వంటి ఒడుదొడుకులను బైజూస్ ఎదుర్కొంటోంది.
* ఎల్ఐసీలో మరో అద్భుత పథకం
అతి పెద్ద బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ కస్టమర్లకు ఎన్నో కొత్త పథకాలను అందిస్తుంది.. అందులో మహిళలకు కూడా మంచి ప్రయోజనాలున్న ప్లాన్స్ ను అందిస్తుంది.. అందులో ఒకటి ఆధార్ శిలా ప్లాన్ నాన్-లింక్డ్ స్కీమ్, అంటే ఇది స్టాక్ మార్కెట్ పనితీరు లేదా మరే ఇతర పెట్టుబడిపై ఆధారపడి ఉండదు. ఈ స్కీమ్ పాలసీ మెచ్యూర్ అయినప్పుడు పాలసీ హోల్డర్‌కు, లేదా పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే నామినీకి నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ పథకంలో రోజుకు కేవలం రూ.87 పెట్టుబడి పెట్టి, పాలసీదారు రూ.11 లక్షల వరకు మెచ్యూరిటీ బెనిఫిట్ అందుకోవచ్చు.. ఈ పథకం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..55 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ 15 ఏళ్ల పాలసీ కాలానికి ఈ పథకాన్ని కొనుగోలు చేశారనుకుందాం. ఆమె రోజుకు రూ.87 ప్రీమియం చెల్లిస్తుంది, ఇది సంవత్సరానికి రూ.31,755 అవుతుంది. 15 ఏళ్లలో ఆమె మొత్తం రూ. 4,76,325 ప్రీమియంగా చెల్లిస్తుంది. అయితే, పాలసీ మెచ్యూర్ అయినప్పుడు, ఆమె మెచ్యూరిటీ బెనిఫిట్‌గా రూ.11 లక్షలు అందుకుంటుంది.. ఈ పథకంలో ఇన్వెస్ట్ చెయ్యాలనుకొనేవారికి కనీసం 8 ఏళ్లు, గరిష్టంగా 55 ఏళ్లు ఉంటుంది..మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి పాలసీ వ్యవధిని 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు, అంటే పాలసీదారు రిటైర్‌మెంట్ తర్వాత కూడా స్కీమ్ బెనిఫిట్స్ పొందవచ్చు. కనీస హామీ మొత్తం రూ.75,000, గరిష్ఠ హామీ మొత్తం రూ.3 లక్షలు.. పాలసీ తీసుకున్న తర్వాత ఏదైనా కారణాల వల్ల మరణిస్తే నామీనికి మొత్తం వస్తుంది.. పాలసీదారు కనీసం రెండేళ్లపాటు ప్రీమియం చెల్లించిన తర్వాత పాలసీని సరెండర్ చేయవచ్చు.. 80 సి పన్ను మినహాయింపు కూడా ఉంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..
* 15 వేలకే ల్యాప్‌టాప్
టెలికాం రంగంలో రిలయన్స్ సంస్థ సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. జియో ప్రారంభించిన నాటి నుంచి అన్నీ సంచలనాలు, రికార్డులే. 2016లో టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జియో మూడేళ్లలోనే ఎన్నో రికార్డులు సృష్టించింది. 30 కోట్లకు పైగా యూజర్లతో అరుదైన ఘనత సాధించి చరిత్ర సృష్టించింది. తాజాగా.. నిరుద్యోగులు, యువత, ఉద్యోగస్తులకు సూపర్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే జియో బుక్, జియో బుక్ 4జీ పేరు రెండు ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చిన జియో ఇప్పుడు మరో కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. గతంలో విడుదల చేసిన జియో బుక్ 4జీ ధర రూ. 16,000గా ఉండగా, ఇప్పుడు తీసుకొచ్చే జియో క్లౌడ్ పీసీని కేవలం రూ. 15,000కే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది.జియో క్లౌడ్ పీసీ పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకురానుంది. ఈ కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చేందుకు గాను ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ సంస్థలైన హెచ్‌పీ, లెనోవా, ఏసర్‌లతో చర్చలు జరుపుతోంది. ఈ విషయమై కంపెనీకి చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘ల్యాప్‌టాప్ ధరను అందులోని స్టోరేజ్, ప్రాసెసర్, చిప్‌సెట్, బ్యాటరీతోపాటు ఇతర హార్డ్‌వేర్ భాగాల ఆధారంగా నిర్ణయిస్తారు. వీటి ధర పెరిగితే దాని ప్రభావం తప్పక ల్యాప్‌టాప్ ధరపై ఉంటుంది. దీన్ని తగ్గించేందుకు జియో క్లౌడ్ పీసీని తీసుకొస్తున్నాం. ఇందులో సిస్టమ్ ప్రాసెసింగ్ మొత్తం జియో క్లౌడ్‌లో జరుగుతుంది. దీనివల్ల తక్కువ ధరకే వినియోగదారులకు ల్యాప్‌టాప్ అందుబాటులోకి వస్తుంది’ అని చెప్పుకొచ్చారు.
* అమెజాన్ ఏఐ రెడీ ప్రోగ్రాం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో లేటెస్ట్ టెక్నాలజీపై ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించాలని అమెజాన్ (Amazon) నిర్ణయించింది. ఏఐ రెడీ ప్రోగ్రాం పేరుతో 2025 నాటికి 20 లక్షల మంది టెకీలకు ఏఐ కోర్సులను అమెజాన్ ఉచితంగా బోధించనుంది. ఏఐ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డెవలప్‌మెంట్ సహా ఎనిమిది కోర్సులతో ఏఐ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను అమెజాన్ ఆఫర్ చేస్తోంది.భవిష్యత్‌లో అత్యంత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను సిద్ధం చేయడంలో భాగంగా అమెజాన్ ఈ శిక్షణా కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతోంది. ఇప్పటికే 2.1 కోట్ల మంది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్‌లో శిక్షణ పొందారని అమెజాన్ తెలిపింది. 2025 నాటికి తన ఏఐ కోర్సుల ద్వారా మరో 20 లక్షల మందికి చేరువ కావాలని అమెజాన్ కసరత్తు సాగిస్తోంది.సీనియర్లు, యువతకు సరిపడేలా న్యూ ప్రోగ్రామ్స్‌ను అమెజాన్ లాంఛ్ చేస్తోంది. ఏఐ రెడీ ప్రోగ్రాంలో భాగంగా ఎనిమిది నూతన ఫ్రీ ఏఐ కోర్సులను అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఆఫర్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 50,000 హైస్కూల్స్, యూనివర్సిటీ విద్యార్ధుకు ఏడబ్ల్యూఎస్ జనరేటివ్ ఏఐ స్కాలర్‌షిప్‌ను అమెజాన్ అందిస్తోంది. కోడ్.ఓఆర్‌జీ భాగస్వామ్యంతో జనరేటివ్ ఏఐ ప్రపంచాన్ని విద్యార్ధులకు అమెజాన్ పరిచయం చేయనుంది.
* భారత్‌తో టెస్లా ఒప్పందం
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ, ఎలాన్ మస్క్‌కి చెందిన ‘టెస్లా’ భారతదేశంలో అడుగుపెట్టేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తోంది. అయితే దీనిపై టెస్లా ప్రతినిధులు, భారత ప్రభుత్వంతో చాలా సార్లు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో చర్చలు తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి భారత్ లోకి టెస్లా తన కార్లను దిగుమతి చేయబోతుందని తెలస్తోంది. మరో రెండేళ్లతో ఇక్కడ టెస్లా తన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.జనవరిలో జరిగే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో ఈవీ వాహనాల తయారీ, ఎగుమతులకు సంబంధించిన ఎకోసిస్టమ్ కలిగి ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.టెస్లా ఏదైనా ప్లాంట్‌లో దాదాపుగా 2 బిలియన్ల ప్రారంభ కనీస పెట్టుబడిని పెడుతుందని, దేశం నుంచి ఆటో విడిభాగాలు కనుగోళ్లకు సంబంధించి 15 బిలియన్లకు పెంచుతుందని తెలుస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి భారతదేశంలోనే బ్యాటరీలను తయారు చేయాలనే ప్లాన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని రియాసీ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం నిల్వలు బయటపడ్డాయి. ప్రస్తుతం మొబైల్స్, ఈవీ వాహనాల్లో వాడుతున్న బ్యాటరీలన్నీ లిథియం ద్వారానే తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడే బ్యాటరీలను తయారు చేయాలనే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది.టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ జూన్ నెలలో మాట్లాడుతూ.. టెస్లా భారత్ తో గణనీయమైన పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు తెలిపారు. 2024లో భారత పర్యటనకు రావాలనుకున్నట్లు కూడా చెప్పారు. ప్రస్తుతం ఒప్పందంపై ఇటు భారత ప్రభుత్వం కానీ, అటు టెస్లా కానీ స్పందించలేదు. మధ్యతరగతి వర్గం ఎక్కువ కలిగిన భారత్ ఇటీవల కాలంలో ఈవీ మార్కెట్‌లో దూసుకెళ్తోంది. ముఖ్యంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో, ఇది అమెరికన్ కంపెనీ టెస్లాకు వరంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం టెస్లాకు అమెరికా, చైనా, జర్మనీల్లో ప్లాంట్లు ఉన్నాయి.చైనాలో తయారవుతున్న టెస్లా కార్లను ఇండియాలోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వ ఒప్పుకోలేదు. అధిక పన్నుల కారణంగా భారత్ టెస్లా కార్లను దిగుమతి చేసుకోలేదు. గతంలో టెస్లా సీఈఓ మస్క్ భారత్ లో అధిక పన్నుల గురించి విమర్శించారు. ఈ నెల ప్రారంభంలో కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లోని టెస్లా ప్లాంట్‌ను సందర్శించిన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, సెప్టెంబర్‌లో టెస్లా ఈ ఏడాది భారతదేశం నుండి దాదాపు రెట్టింపు ఆటో విడిభాగాల కొనుగోళ్లను 1.9 బిలియన్ల డాలర్లకు పెంచాలని యోచిస్తోందని చెప్పారు.
* లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ప్రారంభం నుంచి ముగింపు వరకు లాభాల్లో కదలాడాయి. నిఫ్టీ 89 పాయింట్లు లాభపడి 19,783 వద్దకు చేరింది. సెన్సెక్స్ 275 పాయింట్లు పుంజుకుని 65,930 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటాన్, టాటాస్టీల్, సన్‌ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో ట్రేడయ్యాయి. ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, మారుతిసుజుకీ, ఎస్‌బీఐ, ఎల్ అండ్ టీ, టీసీఎస్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్ కంపెనీ షేర్లు నష్టపోయాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, ఆటో, బ్యాంకింగ్, రియాల్టీ స్టాక్‌లకు సంబంధించిన సూచీల్లో ర్యాలీ కనిపించింది. ప్రధానంగా స్టీల్ స్టాక్‌ల మంచి లాభాల్లో ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ స్టాక్‌లు స్వల్ప నష్టాల్లో కదలాడాయి. మరోవైపు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో మంచి ర్యాలీ కనిపించింది. బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్‌లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ట్రేడర్లు, ముదపరులు రేపు రాబోతున్న ఫెడ్ మినట్స్ మీటింగ్ సమావేశం సారంశం కోసం వేచిచూస్తున్నట్లు సమాచారం.
👉 – Please join our whatsapp channel here –