తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఈసారి పుంజుకుంది. సింగిల్ డిజిట్‌కే పరిమితమైనప్పటికీ.. గతంలో కంటే ఈసారి ఓట్లు, సీట్ల సంఖ్యను పెంచుకుంది. పలు చోట్ల భారాస, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చింది. బలమైన అభ్యర్థులను ఓడించడంలోనూ కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర నాయకత్వం ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ.. ఈ ఫలితాలు వారికి కొంత ఊరటను కలిగించినట్లు తెలుస్తోంది. మొత్తం 8 స్థానాల్లో భాజపా అభ్యర్థులు విజయం సాధించగా.. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ఎంపీల్లో సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఓటమి చెందడం గమనార్హం.
ఈ ఫలితాలపై ప్రధాని మోదీ సైతం సంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘భాజపాకు మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. గత కొన్నేళ్లుగా మీ సహాయ సహకారాలతోనే ముందుకు వెళ్తున్నాం. ఇది భవిష్యత్‌లోనూ కొనసాగాలి. తెలంగాణతో మా అనుబంధం ఎవరూ తెంచలేరు. రాష్ట్ర ప్రజల కోసం మరింత కష్టపడతాం. ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు నా అభినందనలు’’ అని తెలిపారు.
ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు 8 స్థానాలు కేటాయించి కమలం పార్టీ మొత్తం 111 చోట్ల పోటీ చేసింది. ఇందులో భాజపా 8 స్థానాల్లో విజయం సాధించింది. గెలిచిన వారిలో కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ముథోల్‌లో రామ్‌రావ్ పవార్, ఆదిలాబాద్‌లో పాయల్ శంకర్, ఆర్మూర్‌లో పైడి రాకేశ్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్‌లో ధనపాల్ సూర్యనారాయణ, గోషామహల్‌లో రాజాసింగ్, నిర్మల్‌లో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సిర్పూర్ నుంచి పాల్వాయి హరీశ్‌రావు ఉన్నారు. అయితే, పోటీ చేసిన 8 స్థానాల్లో జనసేన కనీసం పోటీ ఇవ్వలేకపోయింది.
6 నుంచి 13 శాతానికి!
అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు 118 చోట్ల పోటీ చేసిన భాజపా 105 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటును మాత్రమే గెలుచుకున్న భాజపా కేవలం 7 శాతం ఓట్లనే తెచ్చుకుంది. 2023 ఎన్నికల్లో మంచి సీట్లతో పాటు ఓట్లు శాతాన్ని పెంచుకుని మెరుగైన ఫలితాలు సాధించింది. బీసీ ముఖ్యమంత్రి నినాదం, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత, అగ్రనేతల ప్రచారం, కేంద్ర సర్కార్ పథకాలు ఇందుకు కారణంగా నిలిచాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 8 సీట్లతో దాదాపు 13 శాతం ఓటు బ్యాంకును సంపాదించుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఆరు శాతం ఓటు బ్యాంకు పెరిగింది.
ఒక్క రాజాసింగ్ మాత్రమే
పాతబస్తీలోని బహుదూర్‌పుర, చార్మినార్, కార్వాన్, యాకుత్‌పుర, మహేశ్వరం, గజ్వేల్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, భారాస పార్టీలకు భాజపా హోరా హోరీగా పోటీనిస్తూ వచ్చింది. భాజపా సిట్టింగ్ ఎమ్మెల్యేలైన రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌లలో.. ఒక్క రాజాసింగ్ మాత్రమే స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. దుబ్బాకలో రఘునందన్ రావు ఘోర పరాజయం చవి చూశారు. రెండు స్థానాల్లో పోటీ చేసిన ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గమైన హుజురాబాద్‌లో మూడో స్థానానికి పరిమితమయ్యారు. ముఖ్యమంత్రిపై గజ్వేల్‌లో పోటీ చేసి రెండో స్థానానికే పరిమితమయ్యారు. కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సొంత నియోజకర్గమైన అంబర్ పేటలోనూ భాజపా అభ్యర్థి కృష్ణ యాదవ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.
👉 – Please join our whatsapp channel here –