* తమిళి సైతో షర్మిల భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళి సైని కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల కలిశారు. మంగళవారం రాజ్ భవన్‌కు వెళ్లిన షర్మిల గవర్నర్ తమిళి సైతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షర్మిల తన కొడుకు వివాహానికి రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. కుమారుడి పెళ్లి శుభలేఖను గవర్నర్‌కు అందజేసి వివాహానికి హాజరు కావాలని కోరారు. కాగా, వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి తన ప్రియురాలు అట్లూరి ప్రియను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 18వ తేదీన ఎంగేజ్‌మెంట్ జరగనుండగా.. ఫిబ్రవరి 17వ తేదీన రాజారెడ్డి, ప్రియాల వివాహం జరగనుంది. ఈ క్రమంలో కొడుకు వివాహానికి షర్మిల పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఇటీవలే సోదరుడు, సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
* సీఎం క్యాంప్ ఆఫీసుకు కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏది చేసినా కాస్త వెరైటీగానే ఉంటుంది.. అది కాస్తా వైరల్‌గా మారిపోతుంది.. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసేందుకు చేస్తున్న ప్రయత్నం నవ్వులు పూయిస్తుంది.. ఏపీ పర్యటనలో ఉన్న సీఈసీ రాజీవ్ కుమార్‌ను కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పలు సూచనలు చేశారు.. కేంద్ర ఎన్నిక సంఘం ప్రతినిధుల కలసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.. అక్కడి వరకు బాగానే ఉంది.. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు కేఏ పాల్.. సీఎం వైఎస్ జగన్ ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లిన పాల్‌ను.. అనుమతి లేదని క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు పోలీసులు.. ఇక, పోలీసులు అడ్డుకోవడంతో సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్ద వేచి చూస్తున్నారు.
* కాంగ్రెస్ సర్కారుపై కవిత విసుర్లు
ఈ నెల ఒకటిన పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉందని.. ఇప్పటి వరకు వాటి ఊసేలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అన్నసాగర్‌లో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని కవిత పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకటి రెండు జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని ఆరోపించారు. రైతుబంధు నిధుల పంపిణీ ప్రస్తావనే లేదన్నారు. ప్రజా పాలనలో భాగంగా 1.20కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారని, ఆ దరఖాస్తులు ఎందుకు తీసుకున్నారో ప్రజలకు అర్థమవడం లేదన్నారు. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఇప్పటికే మీ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 44 లక్షల మందికి కేసీఆర్ హయాంలో పెన్షన్లు అందించిందని, వారికి పెన్షన్ల మొత్తం పెంచి పంపిణీ చేయకుండా.. మళ్లీ దరఖాస్తులు తీసుకుంటారన్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తే కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, కాబట్టి ఆ ప్రకారం బిల్లు వస్తే ఎవరూ చెల్లించవద్దని పిలుపునిచ్చారు. అలాగే, అభివృద్ధిలో తాము ఎక్కడా ఆటంకపర్చబోమని, హామీల అమలులో సూచనలు చేస్తామని చెప్పారు. అవసరమైతే నిలదీస్తామని, కానీ జరుగుతున్న పనులు మాత్రం నిలిపివేయవద్దని సూచించారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి, ప్రజల హక్కులను సాధించడానికి బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని, ఇందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో తెలంగాణ అనే మాట మాట్లాడేది కేవలం బీఆర్‌ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడూ కూడా పార్లమెంట్‌లో తెలంగాణ గురించి మాట్లాడలేదని విమర్శించారు. 2009లో కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని తెలిపారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారని గుర్తు చేశారు. పాలమూరు ప్రజల వలసలను అడ్డుకట్ట వేయడానికి కృషి చేశామని కవిత వివరించారు.
* పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్
తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే పద్మావతి ఎపిసోడ్ చేరుకుంది. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. రెండు రోజుల కిందట ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఫేస్బుక్ లైవ్ ఇచ్చింది. దీంతో.. పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో.. ఆమేకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో, తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. కాగా.. ఈ వ్యవహారంపై సజ్జల రామకృష్ణారెడ్డి సహా సీఎం జగన్ ను కలవనున్నారు ఎమ్మెల్యే పద్మావతి. తనకు సింగనమల సీటు నిరాకరించడంతో ఎమ్మెల్యే పద్మావతి సీఎంవో పై విమర్శలు చేసింది. ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలు చేసింది. తమ కాలువల నుంచి తాము తాగునీటి విడుదల కోసం.. సీఎంవో నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. తన వ్యాఖ్యల పై సీఎంకు వివరణ ఇవ్వనున్నారు పద్మావతి.
* ఓటర్ల జాబితా లో అనర్హుల పేర్లు తొలగింపు
ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని పలు పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం సుపరిచితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిర్యాదులపై దృష్టి సారించింది. దీనితో ఓటర్ల జాబితా గుట్టు బయటపడింది. అర్హత లేని లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుండి రాష్ట్ర ఎన్నికల సంఘం తొలిగించింది. ఈ విషయం పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా మాట్లాడుతూ.. 14.48 లక్షల మంది అనర్హుల పేర్లు జాబితాలో ఉన్నాయని.. వివిధ పార్టీల నుండి ఫిర్యాదులు వచ్చిన మేరకు వాటిని పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ఓటర్ల జాబితాలో 5 లక్షల 64 వేల 819 మంది అనర్హత కలిగి ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. అనంతరం అనర్హులైన వాళ్ళ పేర్లను జాబితా నుండి తొలిగించామని తెలిపారు. కాగా రాష్ట్రం లోని ఓటర్ల జాబితాలో విస్తారంగా అవకతవకలు చోటు చేసుకున్నాయని తెలుగుదేశం అధినేత ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి తీసుకున్న చర్యలను వివరిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా సోమవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు లేఖ రాశారని.. ఈ క్రమంలో ప్రత్యేక సమగ్ర సవరణ-2024 ప్రక్రియలో భాగంగా వచ్చిన 17,976 దరఖాస్తులు మినహా మిగతావన్నీ పరిష్కరించామని స్పష్టం చేశారు.
* శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న పార్వేట ఉత్సవం నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు ఆర్జిత సేవల్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.సంక్రాంతి పండుగ సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి పార్వేట ఉత్సవాల కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం పలు సేవలను రద్దు చేసింది. సంక్రాంతి సందర్భంగా 14న శ్రీ గోవిందరాజులస్వామివారి ఆలయంలో భోగితేరు, 15న మకర సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు. 14న సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగిస్తారు.16న పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. అదే రోజు గోదా పరిణయోత్సవం కూడా ఉంటుంది. ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెదజీయర్ మఠం నుంచి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామి వారికి సమర్పిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేస్తారు. ఆస్థానం, పార్వేట కార్యక్రమాల అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించాల్సిన అష్టాదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీడీడీ రద్దు చేసింది. జనవరి 7న ప్రారంభమైన శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు ఈ నెల 13 వరకు కొనసాగనున్నాయి.
* తమిళనాడును మరోసారి ముంచెత్తుతున్న భారీ వర్షాలు
తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు (Tamil Nadu Rains) ముంచెత్తుతున్నాయి. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తూత్తుకుడి, కడలూరు, కోయంబత్తూరు, తంజావూరు, కాంచీపురం, దిండిగల్, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచ్చి, చెంగల్‌పట్టు, కన్యాకుమారి సహా 18 జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఈ వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది.ముఖ్యంగా తురునెల్వేళి, తూత్తుకుడి జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో ఆ రెండు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఇక రాష్ట్ర రాజధాని చెన్నైలో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఆలయాల్లోని వర్షపు నీరు ప్రవేశించింది. భారీ వర్షం నేపథ్యంలో నాగపట్టిణం, కిల్వేలూర్ తాళూకా, కుడ్డలూర్, విల్లుపురం, కళ్లకురిచి, రాణిపేట్, వెల్లోర్, తిరువణ్ణమళైలో అధికారులు స్కూళ్లు, కాలేజీకు సెలవు ప్రకటించారు. కొన్ని ప్రైవేటు కార్యాలయాలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని కల్పిస్తున్నారు.బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో పాటు ఈశాన్య గాలుల ప్రభావం తమిళనాడులో కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. మైచాంగ్ తుఫాను అంత తీవ్రంగా ఇప్పుడు ఉండదని, అయితే తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
* సీఈసీ వద్దకు రాజకీయ పార్టీలు క్యూ
కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలు సీఈసీ వద్దకు క్యూ కట్టాయి. వైసీపీ-టీడీపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. వైసీపీ ఆరు అంశాలతో.. టీడీపీ-జనసేన ఎనిమిది అంశాలతో పరస్పరం ఫిర్యాదులు చేశాయి. కాగా.. నిబంధనల ప్రకారం వచ్చే ఎన్నికల్లో జనసేనకు గాజు గుర్తు కేటాయించకూదనే కీలకాంశాన్ని వైసీపీ తెర పైకి తెచ్చింది. మరోవైపు.. టెక్నాలజీతో ఓటర్ల యాప్ రూపొందించి అవకతవకలకు పాల్పడుతోందంటూ టీడీపీపై వైసీపీ ఫిర్యాదు చేసింది.అంతేకాకుండా.. టీడీపీ ఎలక్ట్రోరల్ కమిటీలోని కోనేరు సురేష్ సహా ఇతర సభ్యులపై వైసీపీ ఫిర్యాదు చేసింది. మరోవైపు.. హైదరాబాద్ లో నివాసం ఉండే వారి ఓట్లను ఏపీలో నమోదు చేయించడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదిలాఉంటే.. 10.32 లక్షల అప్లికేషన్లు పరిశీలించకుండానే డ్రాఫ్ట్ ఎలక్షన్ రోల్స్ ప్రకటించడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొందరి వ్యక్తుల పేర్లతో భారీ ఎత్తున ఫాం-7 ధరఖాస్తులు దాఖలు కావడాన్ని టీడీపీ సీఈసీ దృష్టికి తీసుకెళ్లింది.నిబంధనలకు విరుద్దంగా ఫాం-7 ధరఖాస్తులు చేసిన వారిని గుర్తించినా.. చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ ఆరోపించింది. అంతేకాకుండా.. ఇంటింటి సర్వేను గ్రామ సచివాలయ సిబ్బంది చేపట్టడాన్ని టీడీపీ తప్పు పట్టింది. రూల్స్ కు విరుద్దంగా వాలంటీర్ల జోక్యాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని సీఈసీ కోరింది టీడీపీ – జనసేన. అంతేకాకుండా.. గతంలో తామిచ్చిన రిప్రజెంటేషన్లకు చర్యలు తీసుకోకుండా సీఈఓ మొక్కుబడి వివరణలు ఇస్తున్నారని సీఈసీకి టీడీపీ కంప్లైంట్ చేసింది.
👉 – Please join our whatsapp channel here –