అధిక శబ్దంతో కొన్ని వాహనాలు వెళ్తుంటాయి.. అయితే, అధిక శబ్దంతో నడిచే వాహనాలపై చర్యలకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. తూర్పుగోదావరి జిల్లాలో నేటి నుండి అధిక శబ్దాలతో ధ్వని కాలుష్యం సృష్టిస్తున్న ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చర్యల కోసం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు రాజమండ్రి ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.. డిజిటల్ నాయిస్ లెవెల్ మీటర్ ద్వారా చెక్ చేసి 80 డేసిబుల్స్ పైన శబ్దం కలిగించే వాహనాలపై మోటార్ వాహన చట్టం U/S 190 (2) ప్రకారం జరిమానా విధిస్తున్నారు. ఈ రోజు స్పెషల్ డ్రైవ్ లో శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్న 20 బుల్లెట్ మోటార్ సైకిళ్లను గుర్తించి వాటి సైలెన్సర్లను వాహనదారుల ద్వారా తీయించి నట్టు ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.. ఇక పై ప్రతిరోజు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని.. అధిక శబ్దం చేసే సైలెన్సర్స్ ను బుల్లెట్ మోటార్ సైకిల్ కు అమర్చరాదని వార్నింగ్ ఇచ్చారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ లను బిగించే మోటార్ సైకిల్ మెకానిక్ షాపుల వారిపై కూడా చర్యలు తీసుకుంటామని.. మోటారు వాహనాల చట్టం ఉల్లంఘించిన వారిపై కేసును నమోదు చేస్తామని హెచ్చరించారు రాజమండ్రి ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు.
కాగా, అధిక ధ్వనిని వినడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరిగి రక్తపోటు, నిద్రలేమి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. వాటికి నివారణకు చర్యలు తీసుకుంటున్నా.. కొందరు పెద్ద సౌండ్‌తో కూడాన హారన్లను వాడడం.. మరికొందరు బుల్లెట్ మోటార్ సైకిళ్లకు సైలెన్సర్‌లను తొలగించి ఇష్టానుసారం భారీ శబ్దం వచ్చేలా వాహనాలను నడుపుతూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో.. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలకు పూనుకుంటూనే ఉన్నారు.. కానీ, పోలీసులకు చిక్కకుండా కొందరు తప్పించుకుంటూనే ఉన్నారు.. ఇప్పుడు రాజమండ్రిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు.. కాగా, గతంలో స్పెషల్ డ్రైవ్‌లో స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను రోడ్డుపై పెట్టి.. రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేసిన విషయం విదితమే.
👉 – Please join our whatsapp channel here –