DailyDose

లోకేశ్‌పై కేశినేని నాని తీవ్ర విమర్శలు-తాజా వార్తలు

లోకేశ్‌పై కేశినేని నాని తీవ్ర విమర్శలు-తాజా వార్తలు

* లోకేశ్‌పై కేశినేని నాని తీవ్ర విమర్శలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. తాత, తండ్రి పేర్లు, పార్టీ బలాన్ని వాడుకున్నా లోకేశ్ మంగళగిరిలో గెలవలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీకి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా ఆమోదం తర్వాత వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లోకే‌శ్‌కు ఏం అర్హత ఉందని పాదయాత్ర చేశారని ప్రశ్నించారు. లోకేశ్ ఏం త్యాగం చేశారని పాదయాత్రల పేరుతో హడావుడి చేశారని నిలదీశారు. లోకేశ్ పాదయాత్రకు తాను ఎదురు వెళ్లి స్వాగతం చెప్పాలా నాని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అండగా లేకపోయినా తాను గెలిచానని నాని వ్యాఖ్యానించారు. లోకేశ్ ఒక ఓడిపోయిన వ్యక్తి అని కేశినేని నాని ఎద్దేవా చేశారు.తన కుటుంబంలో చిచ్చు పెట్టారని కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతోనే తనను కొట్టించాలని చూశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని అభివర్ణించారు. విజయవాడను అభివృద్ధి చేయాలని చంద్రబాబుకు లేదన్నారు. టీడీపీ హయాంలో విజయవాడ అభివృద్ధికి కనీసం రూ.100 కోట్లు ఇవ్వలేదని తెలిపారు. తాను ఒక్కడినే టీడీపీ నుంచి వెళ్లడంలేదని.. ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 60 శాతం నాయకులు గుడ్ బై చెబుతారని కేశినేని జోస్యం చెప్పారు.

* బస్సులో కోడిని మర్చిపోయిన ప్రయాణికుడు

నిత్యం ప్రయాణీకులతో బిజీ బిజీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ లో ఓ కోడి పుంజును కట్టి పడేశారు. బస్సుల్లో ప్రయాణీకులు ఉండాల్సిన చోట ఉండడం ప్రత్యేకంగా నిలిచింది. ఇంతకీ ఈ కోడి ఎక్కడ నుండి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు. అంతేకాదు దాని బాధ్యతలు ఆర్టీసీ యాంత్రాంగంపై పడడంతో బోను ఏర్పాటు చేసి దానా, నీటిని అందిస్తున్నారు. ఇంతకీ ఆ కోడి వివరాలేంటి… ఎక్కడినుండి వచ్చిందో తెలుసుకుందాం…వరంగల్ నుండి వేములవాడ రాజన్న క్షేత్రానికి ఓ ఆర్టీసీ బస్సు బయలుదేరింది. ఆర్టీసీ బస్సు కరీంనగర్ కు చేరుకోగానే సరిరికి అక్కడ ఓ బ్యాగ్ లో ప్యాక్ చేసి పెట్టిన కోడిని గమనించిన ప్రయాణీకులు కండక్టర్ కు సమాచారం అందించారు. ఎవరి కంట పడకుండా ఓ ప్రయాణీకుడు ఓ బుట్టలో కోడిని ప్యాక్ చేసిన ప్రయాణీకుడు కోడి ఉన్న బ్యాగును బస్సులోనే మర్చిపోయాడు. దీంతో వెంటనే కండక్టర్ కరీంనగర్ బస్ స్టేషన్ లోని కంట్రోలర్ కు సమాచారం ఇచ్చి కోడిని వారికి అప్పగించారు. కంట్రోలర్ ఆ కోడిని తీసుకెళ్లి కరీంనగర్ 2 డిపో యంత్రాంగానికి అప్పగించగా… ఓ జాలిలో కోడిని ఉంచి దానికి దాణాతోపాటు నీటిని అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఏదైతే ఏం ఆర్టీసీ బస్సులతో పాటు కోడి కూడా అక్కడ సేద తీరుతోందని కొందరు ప్రయాణీకులు కామెంట్ చేస్తున్నారు. ప్రయాణీకుడు దొరికితే అతనిపై నిబంధనల మేరకు జరిమాని విధించే అవకాశం ఉండేది. కానీ ఆ కోడికి సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో దాని ఆలనా పాలనా అంతా ఆర్టీసీ యంత్రాంగంపై పడింది.

* బీఆర్ఎస్ నాయకులపై సీతక్క ఫైర్

ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకుల కడుపు కాలుతోందని మంత్ర సీతక్క ఫైర్ అయ్యారు. బుధవారం సెక్రటేరియట్‌లోని మంత్రి కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా గడవక ముందే తమపై బీఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడం వారు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. గులాబీ నేతలు ప్రచారం చేస్తున్న అవాస్తవాలను సమర్ధవంతంగా కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు ప్రతి ఒక్క హామీని అమలు చేసి చూపిస్తామని హితవు పలికారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించేలా ప్రతి ఒక్కరూ విధిగా ఓటేసి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.

* తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు ఆరు గంటల్లో సర్వదర్శనం

తిరుమలలో కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి చెంతకు చేరుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులు కంపార్టుమెంట్లలో కాకుండా నేరుగా ఆరుగంట్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు.నిన్న స్వామివారిని 65,901 మంది భక్తులు దర్శించుకోగా 16,991 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు వచ్చిందని అధికారులువెల్లడించారు.

* మరోసారి ఢిల్లీ వెళ్లనున్న సీఎం

సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అధిష్టానం పిలుపుతో గురువారం ఆయన హస్తినాకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ టూర్‌లో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఈనెల 29న ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీల భర్తీకి పోలింగ్, నామినేటెడ్ పోస్టుల భర్తీ, లోక్ సభ ఎన్నికలు నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది.ఏఐసీసీ ఇన్ చార్జి దీపాదాస్ మున్షికి సైతం అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో వీరు ఇరువురు రేపు ఢిల్లీలో హైకమాండ్‌తో భేటీ అయి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో విజిలెన్స్, జ్యుడిషీయల్ విచారణ విషయంలో ప్రభుత్వం దూకుడు పెంచిన నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపురావడం ఆసక్తిగా మారింది.త్వరలో రెండు ఎమ్మెల్సీలకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ రెండు స్థానాలు ఎవరికి దక్కబోతున్నాయనే చర్చ జోరందుకుంది. వీటికి ఇప్పటికే అభ్యర్థులు ఖరారయ్యారనే టాక్ వినిపిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి టికెట్ల విషయంలో కాంప్రమైజ్ అయిన పలువురు నేతలు ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఎమ్మెల్సీ దక్కించుకోబోయే వారిలో కనీసం ఒకరికి మంత్రి వర్గంలో చోటు ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఎమ్మెల్సీ టికెట్ తమకే ఇవ్వాలని నేతలు పార్టీ పెద్దలపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం.ఇక సంక్రాంతి లోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయంలో అధిష్టానం ఎటువంటి సూచనలు చేయబోతున్నది అనేది చర్చనీయాశంగా మారింది. ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అనూహ్యంగా ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన కూడా పార్టీ అధిష్టానంతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎం టూర్‌కు ఒక రోజు ముందే జగ్గారెడ్డి హస్తిన బాట పట్టడం వెనుక ఏం జరుగుతోందనే అభిప్రాయాలు ఆసక్తిరేపుతున్నాయి.

* వైసీపీకి మరోనేత గుడ్‌బై

అధికార వైసీపీలో వరుసగా వికెట్లు పడిపోతున్నాయి. వైసీపీలో నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు గుడ్‌బై చెప్పేయగా తాజాగా మరో నేత ఈ జాబితాలో చేరిపోయారు. వైసీపీని వీడాలని కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ (kurnool MP Sanjeev kumar) నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు పార్లమెంట్ పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి తప్పించడంతో ఆయన తీవ్ర మనస్థాపం చెందారు. దీంతో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంజీవ్ కుమార్ ప్రకటించారు.అయితే ఏ పార్టీలో చేరబోయేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఎంపీ తెలిపారు. జగన్‌ను కలవడానికి పోన్ చేస్తే ఎవరూ రిసీవ్ చేసుకోలేదని ఎంపీ సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు పెద్దపీట వేస్తామంటారు కానీ.. అది చేతల్లో ఉండదన్నారు. ఐదేళ్లలో అభివృద్ధి పనులు చేయలేకపోయానని విమర్శలు గుప్పించారు.‘‘వైద్యుడిగా ఉన్న నేను ప్రజలకు సేవ చేద్దామని వచ్చా. నేను వందశాతం లక్ష్యంలో పదిశాతమే సాధించా. ఎన్ని ప్రయత్నాలు చేసినా నియోజకవర్గం అభివృద్ధి చేయలేకపోయా. పెద్దలను కలసి రాజీనామా చేయాలని భావించా. నా రాజీనామాకు ప్రధాన కారణం అభివృద్ది లేకపోవడమే. కరువు ప్రాంతమైన కర్నూలులో ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వలసలు, ఆత్మహత్యలు ఆగలేదు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం మంచిది కాదనుకున్నా. పార్టీకి, ఎంపీకి రాజీనామా చేస్తున్నా. బీసీలకు పదవులు ఇస్తున్నారు.. మా మాటకు పార్టీలో విలువివ్వడం లేదు. బీసీలకు ప్రత్యేకంగా అధికారం ఇవ్వడం లేదు. బీసీ ఎంపీలతో డిస్టెన్స్ చూపిస్తున్నారు.. వాళ్లకు సంబంధించిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సీఎం వద్దకు తీసుకుపోతే పట్టించుకోలేదు… ఐదేళ్లలో కేవలం 3 సార్లు మాత్రమే సీఎంను కలిసేందుకు అవకాశం ఇచ్చారు. నీవు ఎందుకు కష్టపడతావు.. ఎమ్మెల్యేలు చూసుకుంటారని సీఎం నాకు సలహా ఇచ్చారు. అభివృద్ధి అంతా ఎమ్మెల్యేలు చూసుకుంటారని సీఎం చెప్పారు. ఎంపీగా అభివృద్ధి కోసం నేను ఎంతో ప్రయత్నం చేశా.. ప్రయోజనం దక్కలేదు. కర్నూలులో వలసలు ఆగాలి.. ఆత్మహత్యలు ఆగాలని పోరాడా. సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదు’’ అంటూ ఎంపీ సంజీవ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.వైసీపీలో ఓ వైపు ఇంచార్జిల మార్పు, మరోవైపు పార్టీని వీడుతున్న నేతల అంశం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది.

* రైల్వే స్టేషన్‌లో సామాన్యుడిలా మాజీ కేంద్రమంత్రి

మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత సామాన్యుడిలా రైల్వే ప్లాట్ ఫాం మీద కూర్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయనగరం రైలులో ప్రయాణించుటకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ అరుగు మీద కూర్చున్నారు. గతంలో కేంద్ర విమానయానశాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు రాజకుటుంబానికి చెందినవారు. అయితే సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన.. ఒక సామాన్య ప్రయాణికుడిలా రైల్వే స్టేషన్‌లో కనిపించారు. ఆయన కావాలనుకుంటే అధికారులే వచ్చి వీఐపీ గదిలో కూర్చోపెడతారు.. అంతేకాకుండా.. ఆయన అనుకుంటే ప్రత్యేక విమానంలో కూడా ప్రయనించవచ్చు. కానీ అవేమీ ఆయన కోరుకోరు. ఒక సామాన్యుడిలా అశోక్ గజపతిరాజు కుటుంబం రైలు ప్రయాణం చేయటం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోని టీడీపీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.అశోక్ గజపతి రాజు రాష్ట్రమంత్రిగా పనిచేసినప్పుడు కూడా ప్రభుత్వం కేటాయించిన వాహనంలో కాకుండా.. తన సొంత కారులోనే సచివాలయానికి వచ్చి వెళ్తుండే వారు. పదమూడేళ్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. వాణిజ్య పన్నులశాఖ, ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా ఆయన పనిచేశారు. మంత్రిగా పనిచేసినా.. పూసపాటి అశోక్ గజపతి రాజులో ఎటువంటి బేషజాలు కనిపించవు. ఆయన సాధారణ వ్యక్తిలాగానే ఉంటారు. అంతేకాకుండా.. వేల ఎకరాల భూములను సమాజ అభివృద్ధి కోసం పంచిపెట్టిన కుటుంబం ఆయనది.కాగా.. స్వతహాగా రాజు అయిన అశోక్ గజపతి రాజు హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్లడానికి సామాన్యుడిలా రైల్వే స్టేషన్‌లో ఎదురుచూశారని టీడీపీ తెలిపింది. ఆయన నిజాయతీకి, పరిపూర్ణతకు ప్రతిరూపమని అభివర్ణించింది. ఎల్లప్పుడూ ప్రజలకు ఏది ఉత్తమమో అదే చేస్తుంటారని ప్రశంసించింది. అధికారం ఎప్పుడూ ఆయనను తప్పుదోవ పట్టించలేదని, తెలుగు దేశం అంటే ఇదని వ్యాఖ్యానించింది.

* జయశంకర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నాయకుల దౌర్జన్యం

కాంగ్రెస్‌ పార్టీ(Congress) అధికారం అండతో బీఆర్‌ఎస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై అకారణంగా దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసింది. నేడు జయశంకర్ భూపాలపల్లి(Jayashankar district) జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీ(BRS flexes)ని తొలగించి తన వక్రబుద్ధిని చాటుకున్నది.వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన పర్మినెంట్ పోల్స్‌కు ఫ్లెక్సీని కట్టారు. అయితే ఇదే ఫ్లెక్సీ పై కాంగ్రెస్ నాయకులు బుధవారం ఫ్లెక్సీ కట్టారు. దీంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు జోక్యం చేసుకొని కాంగ్రెస్ నాయకులతో ఫ్లెక్సీని తీసివేయించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z