NRI-NRT

మస్కట్‌లో ఘనంగా సంక్రాంతి వేడుకలు

మస్కట్‌లో ఘనంగా సంక్రాంతి వేడుకలు

ఒమన్ దేశ రాజధాని మస్కట్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఒమన్‌లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు, వీరి కోసం వచ్చిన తెలుగు ప్రముఖుల మధ్య రెండు రోజుల పాటు శోభాయమానంగా వేడుకలు నిర్వహించారు. ‘రాయల్ కింగ్ హోల్డింగ్‌’తోపాటు ‘చిరు మెగా యూత్ ఫోర్స్’ సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ అలరించాయి.

ఇటీవల సినీరంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రముఖులు.. డా. మాగంటి మురళీ మోహన్ గారిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఒమన్ దేశ చిహ్నం అయిన కంజరి నడుముకు తొడిగి స్వర్ణ కంకణంతో గౌరవించడం ఈ వేడుకలో ప్రధానఘట్టంగా నిలిచింది. టాలీవుడ్ నిర్మాత, సినీ పంపిణీదారు వ్యాపారవేత్త బుర్ర ప్రశాంత్ గౌడ్‌తోపాటు సీపీవైఎఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షలు రామదాస్ చందక ఈ వేడుకలు నిర్వహించారు. డా. మురళీమోహన్‌తో పాటు టాలీవుడ్ నటీమణులు.. రజిత, మధుమని, పింకీ, సోనియా చౌదరి, టివి నటి సంజన సంక్రాంతి వేడుకలకు కొత్త కళను తెచ్చారు. వేడుకలకు కుమారి మాధవి రెడ్డి చేసిన యాంకరింగ్‌ ఆకట్టుకుంది.

సింగర్లు హనుమాన్, స్వాతి సత్యభామ, మోనికా యాదవ్ లు తమ సంగీతంతో ప్రేక్షుకలును కట్టిపడేసారు. పాటలకు తగ్గ డ్యాన్సులతో సందడి నెలకొంది. వేడుకలో ఢీ ఫేమ్ గోవింద్ టీమ్ స్టెప్పులతో స్టేజిని దులిపారు. జబర్దస్త్ సుధాకర్ తన కామెడీతో కడుపు ఉబ్బా నవ్వించారు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన మరో కళాకారుడు ఎమ్‌ఎస్‌ఆర్‌ నాయుడు తన వెంట్రిలాక్కుజమ్ నైపుణ్యంతో పిల్లలను అలరించారు. ఈ సంక్రాంతి సంబరాలకు హైదరాబాద్ నుంచి ఇన్‌కంటాక్స్‌ మాజీ అధికారి శ్రీకర్ వేముల, వ్యాపారవేత్త రమేష్ గౌడ్‌లు హాజరయ్యారు. ఒమన్‌లో వివిధ రంగాల్లో వ్యాపారాభివృద్ధి గురించి పరిశీలన చేశారు.

సంక్రాంతి వేడుకల సందర్భంగా సామాజిక బాధ్యతను మరిచిపోలేదు తెలుగు బిడ్డలు. ఇప్పటివరకు 20 సార్లకు పైగా రక్తదానం చేసిన 30 మంది యువతీయువకులకు మురళీమోహన్ సత్కరించారు. అంబేద్కర్ సేవాసమితి మహిళామణుల అధినేత శ్రీలతాచౌదరి శాలువాతో సత్కరించారు. ఇందులో భాగంగా తెలుగు కమ్యూనిటీకి విశేష సేవలను అందిస్తున్న రాజేష్ మడకశిరను మెమొంటోతో సత్కరించారు. ఈ వేడుక జరిగేందుకు అన్ని రకాలుగా సహకరించిన హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ, వైబ్రాంట్‌ సంస్థకు చెందిన పెద్దలు.. మల్లారెడ్డి, రవీంద్ర రెడ్డి, శ్యామ్‌ సుందర్‌ రెడ్డి, సీఈఓ శ్రీనివాస్‌ రావులను సత్కరించారు. సంబరాల్లో సహాయ సహకారాలను అందించిన బాలాజీ, చంద్రశేఖర్‌, ప్రసాద్ రెడ్డి, నాగభూషణ్‌ను సన్మానించారు. సంక్రాంతి సంబరాలకు సహకరించిన రాయల్‌ కింగ్‌ యాజమాన్యానికి (రెన్నీ జాన్సన్‌ అండ్‌ టీం) అభినందనలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z