గతేడాది ‘పఠాన్’, ‘జవాన్’లాంటి రెండు యాక్షన్ సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan). ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రాలు ఇప్పుడు ఇంటర్నేషనల్ అవార్డుల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి.
తాజాగా న్యూయార్క్‌కు చెందిన మ్యాగజైన్ ‘వల్చర్ 2023 యాన్యువల్ స్టంట్’ అవార్డుల కోసం నామినేషన్స్ ప్రకటించింది. వాటిలో షారుక్ నటించిన రెండు చిత్రాలు ఉండటంతో ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ మూడు కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుంది. బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్‌తో పాటు స్టంట్స్‌కు సంబంధించిన మరో రెండు కేటగిరిల్లో హాలీవుడ్ చిత్రాలతో కలిసి పోటీ పడనుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘పఠాన్’ రెండు విభాగాల్లో పోటీ పడనుంది. ఈ అవార్డుల్లో హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ నటించి ‘మిషన్ ఇంపాజిబుల్’ కూడా ఉండటంతో ఆసక్తి నెలకొంది.
ఇటీవలే ‘డంకీ’తో మరో విజయాన్ని సొంతం చేసుకున్న షారుక్.. అదే జోష్‌తో ఇప్పుడు తర్వాత సినిమాను మొదలుపెట్టనున్నారు. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌లో నటించేందుకు పచ్చజెండా ఊపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరవై రెండేళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా రానుందని తెలియడంతో సినీ ప్రియులు ఆనందిస్తున్నారు. వయసు మళ్లిన హీరో, అతడి కన్నా వయసులో బాగా చిన్నదైన కథానాయికల మధ్య మొదలైన ప్రేమ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
👉 – Please join our whatsapp channel here