* తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను రెండో రోజు దర్యాప్తు బృందం కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది. వీరి స్టేట్‌మెంట్ కీలకంగా మారడంతో పాటు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు శుక్రవారం అరెస్టు అయిన టాస్క్‌పోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అదనపు ఎస్పీల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో భుజంగరావు, తిరుపతన్న చేసిన వ్యవహరంపై ఆరా తీస్తున్నారు. వీరంతా పలువురు ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో టాస్క్‌ఫోర్స్‌ను తన గుప్పిట్లో ఉంచుకున్న రాధాకిషన్‌రావు.. సిబ్బందిని అనధికారిక కార్యకలాపాలకు వినియోగించుకున్నారని సమాచారం. దీంతో పాటు గత శాసనసభ ఎన్నికల్లో ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. సదరు పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం ఎస్‌ఐబీ బృందాన్ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఇందుకు సంబంధించిన ఆధారాలను ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ధ్వంసం చేయడంతో ఈ విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
* పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగడ్డ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు అఖిల (20) మృతి చెందింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు అఖిలకు వివాహమైంది. వివాహ క్రతువు ముగిసిన తర్వాత నీరసంగా ఉందని నిద్రలోకి జారుకుంది. బంధువులు పిలిచినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మక్కువ పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నవవధువు మృతి చెందినట్లు నిర్ధరించారు.
* దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఓ యువకుడిని బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి వద్ద రూ. 75,200 విలువ చేసే 94 గ్రాముల హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయిల్‌ను హిమాచల్‌ప్రదేశ్ నుంచి తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒక్కో గ్రామును రూ. 8వేలకు కాలేజీ విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు కనగల ఉదయ్ కుమార్(29) వృత్తి రీత్యా డాగ్ బ్రీడర్ అని తేలింది. దుండిగల్ పరిధిలోని మల్లంపేట్ ఎస్సార్కే హోమ్స్‌లోని విల్లా నెంబర్ 12లో నివాసముంటున్నట్లు పేర్కొన్నారు. ఉదయ్ నుంచి డిజిటల్ వెయిటింగ్ మెషీన్, రూ. 11 వేల నగదు, మొబైల్ ఫోన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
* లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భద్రాచలంలోని కూనవరం రహదారిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కూనవరం నుంచి భద్రాచలం వైపునకు కారులో తరలిస్తున్న రూ. 7.23 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నగదును సీజ్ చేశారు.
* వికారాబాద్ జిల్లా తాండూరులో (Tandur) దారుణం చోటుచేసుకున్నది. తన వద్ద పనిచేస్తున్న నర్సుపై ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. తాండూర్ పట్టణంలో ఆర్‌ఎంపీ డాక్టర్ అహ్మద్ వద్ద ఓ మహిళ నర్సుగా పనిచేస్తున్నది. ఆమెను లోబర్చుకున్న అహ్మద్.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. బలాత్కారం చేస్తున్న సమయంలో వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం ఆమెను బెదిరిస్తూ వస్తున్నారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z