DailyDose

ఆ వియాత్నాం మోసగత్తెకు మరణశిక్ష-CrimeNews-Apr 11 2024

ఆ వియాత్నాం మోసగత్తెకు మరణశిక్ష-CrimeNews-Apr 11 2024

* హరియాణా (Haryana)లో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటుచేసుకొంది. మహేంద్రగఢ్‌ జిల్లాలో గురువారం ఉదయం స్కూల్‌ విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు (School Bus) బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 40 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది. నేడు రంజాన్ సందర్భంగా సెలవు దినం అయినప్పటికీ కనైనా ప్రాంతంలో ఓ స్కూల్‌ను యథావిధిగా నిర్వహించారు. ఈ క్రమంలోనే విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేస్తుండగా అదుపుతప్పి బస్సు బోల్తా పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘటన సమయంలో డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారు. గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు. హరియాణా విద్యాశాఖ మంత్రి సీమా ట్రిఖా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ 2018లోనే గడువు ముగిసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

* ట్రూంగ్‌ మై లాన్‌.. వియత్నాం (Vietnam)లోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరు. ‘వాన్‌ థిన్‌ ఫాట్‌’ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న ఆమె దాదాపు రూ.లక్ష కోట్లకు (12.5 బిలియన్‌ డాలర్లు) సంబంధించి బ్యాంకులను మోసం చేసిన కేసులో దోషిగా తేలారు. దీంతో ఆమెకు (Truong My Lan) అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దేశంలో సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన ఆమెపై కోర్టు కేసు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై వియత్నాం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసింది. ట్రూంగ్‌ మై లాన్‌కు స్థానిక సైగాన్‌ కమర్షియల్‌ బ్యాంకు (SCB)లో దాదాపు 90శాతం వాటా ఉంది. కొన్నేళ్లుగా ఈ బ్యాంకులో ఆమె మోసాలకు పాల్పడ్డారు. 2018 నుంచి 2022 మధ్య 916 నకిలీ దరఖాస్తులు సృష్టించి బ్యాంకు నుంచి 304 ట్రిలియన్‌ డాంగ్‌ (వియత్నాం కరెన్సీ)లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే 12.5 బిలియన్‌ డాలర్లకు పైమాటే. 2019-22 మధ్య ఆమె డ్రైవర్‌ బ్యాంకు హెడ్‌క్వార్టర్స్‌ నుంచి 4.4 బిలియన్‌ డాలర్ల నగదును లాన్‌ నివాసానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 2022లో ఈ కుంభకోణం బయటపడగా అదే ఏడాది అక్టోబరులో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

* క్రికెటర్లు హార్దిక్‌ (Hardik Pandya), కృనాల్‌ పాండ్య తమ సమీప బంధువు చేతిలోనే మోసపోయారు. వరుసకు సోదరుడయ్యే వైభవ్‌ పాండ్య (Vaibhav Pandya) వీరికి పార్ట్‌నర్‌షిప్‌ బిజినెస్‌లో దాదాపు రూ.4.3కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాడు. దీనిపై ఫిర్యాదు చేయడంతో ముంబయి పోలీసు ఆర్థిక నేరాల విభాగం అధికారులు వైభవ్‌ను అరెస్టు చేశారు. పాండ్య సోదరులు, కజిన్‌ వైభవ్‌ కలిసి 2021లో సంయుక్తంగా పాలిమర్‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందులో హార్దిక్‌, కృనాల్‌ (Krunal Pandya)కు 40శాతం చొప్పున పెట్టుబడులున్నాయి. మిగతా 20శాతం వాటా ఉన్న వైభవ్‌ ఈ బిజినెస్‌ రోజువారీ కార్యకలాపాలను చూసుకున్నాడు. లాభాలను కూడా ఇదే నిష్పత్తిలో పంచుకున్నారు. అయితే, పాండ్య సోదరులకు తెలియకుండా కొద్ది రోజుల క్రితం వైభవ్‌ సొంతంగా మరో పాలిమర్‌ వ్యాపారాన్ని ప్రారంభించాడు. దీంతో గతంలో భాగస్వామ్యంతో పెట్టిన బిజినెస్‌కు లాభాలు తగ్గి రూ.3కోట్ల మేర నష్టం వాటిల్లింది. అదే సమయంలో వైభవ్‌ రహస్యంగా తన లాభాల వాటాను 20శాతం నుంచి 33 శాతానికి పెంచుకున్నాడు. సంస్థ అకౌంట్‌ నుంచి భారీ మొత్తంలో డబ్బును తన ఖాతాకు మళ్లించుకున్నాడు. అలా మొత్తంగా దాదాపు రూ.4.3కోట్ల మేర హార్దిక్‌ సోదరులను మోసగించాడు. ఈ విషయంపై క్రికెటర్లు అడగ్గా.. పరువు తీస్తానంటూ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో హార్దిక్‌, కృనాల్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న ముంబయి పోలీసులు బుధవారం వైభవ్‌ను అరెస్టు చేశారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

* దంపతులు ఏడాదిన్నర వయసున్న కుమార్తెను రహస్యంగా చంపారు. చిన్నారి మృతదేహాన్ని శ్మశానవాటికలో పాతిపెట్టారు. అయితే దీని గురించి పోలీసులకు లేఖ అందింది. దీంతో దర్యాప్తు జరిపి ఆ భార్యాభర్తలను అరెస్ట్‌ చేశారు. (Couple Secretly Kills Daughter) మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 38 ఏళ్ల జాహిద్ షేక్, 28 ఏళ్ల నూరామి భార్యాభర్తలు. వారికి 18 నెలల వయసున్న కుమార్తె లబీబా ఉంది. అయితే మార్చి 18న ఆ దంపతులు తమ కుమార్తెను హత్య చేశారు. స్థానిక శ్మశానవాటికలో రహస్యంగా పాతిపెట్టారు. కాగా, ఈ సంఘటన జరిగిన మూడు వారాల తర్వాత ఒక అజ్ఞాత వ్యక్తి రాసిన లేఖ స్థానిక పోలీసులకు అందింది. దీంతో దీనిపై దర్యాప్తు చేపట్టారు. పాతిపెట్టిన చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్‌మార్టం నిర్వహించగా ఆ పసి పాప తల, శరీరంపై గాయాలున్నట్లు తేలింది. మరోవైపు ఆ చిన్నారి తల్లిదండ్రులైన జాహిద్ షేక్, నూరామిని పోలీసులు ప్రశ్నించారు. తొలుత కట్టుకథ చెప్పిన వారిద్దరూ తమ కుమార్తెను చంపినట్లు చివరకు ఒప్పుకున్నారు. అయితే ఎందుకు హత్య చేశారో అన్నది వెల్లడించలేదు. బుధవారం ఆ దంపతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టులో హాజరుపర్చిన తర్వాత తమ కస్టడీలోకి తీసుకున్నారు. పసి పాపను ఎందుకు చంపారో అన్నది ఆరా తీస్తున్నారు.

* ప్రియుడితో కలిసి పారిపోయేందుకు పిల్లల అడ్డు తొలగించుకోవాలని మహిళ భావించింది. గొంతు నొక్కి వారిని చంపింది. పిల్లలు నిద్రపోతున్నట్లుగా భర్తను నమ్మించేందుకు ప్రయత్నించింది. చివరకు అసలు గుట్టును పోలీసులు రట్టు చేశారు. (Woman Kills Children to Elope) మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కిహిమ్‌ ప్రాంతంలో నివసిస్తున్న 25 ఏళ్ల శీతల్‌కు ఐదేళ్ల కుమార్తె ఆరాధ్య, మూడేళ్ల కుమారుడు సార్థక్‌ ఉన్నారు. వివాహేతర సంబంధం ఉన్న ప్రియుడు సాయినాథ్ జాదవ్‌తో కలిసి పారిపోయేందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారని ఆమె భావించింది. మార్చి 31న గొంతు నొక్కి వారిని చంపింది. కాగా, శీతల్‌ భర్త సదానంద్ ఇంటికి తిరిగి వచ్చాడు. పిల్లలు బెడ్‌పై అచేతనంగా ఉండటాన్ని గమనించాడు. భార్యను అడగ్గా వారు నిద్రపోతున్నారని ఆమె చెప్పింది. అనుమానించిన సదానంద్‌ పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే వారు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు పిల్లల మృతిపై దర్యాప్తు చేపట్టారు. శీతల్‌, సాయినాథ్ జాదవ్‌ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని గ్రహించారు. దీంతో పోలీసులు శీతల్‌ను గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. ప్రియుడు సాయినాథ్‌తో పారిపోయేందుకు అడ్డుగా ఉన్న పిల్లలను గొంతునొక్కి చంపినట్లు ఒప్పుకుంది. శీతల్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z