NRI-NRT

స్కాట్‌ల్యాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి-CrimeNews-Apr 19 2024

స్కాట్‌ల్యాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి-CrimeNews-Apr 19 2024

* తనకు దూరంగా ఉంటుందన్న ఆగ్రహంతో మహిళను కత్తితో పొడిచి ఒక వ్యక్తి హత్య చేశాడు. కుమార్తె కోసం వచ్చిన ఆమె తల్లి రాయితో తలపై కొట్టి అతడ్ని చంపింది. జంట హత్యలు (double murder) స్థానికంగా కలకలం రేపాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల అనూష, 44 ఏళ్ల సురేష్‌ మధ్య ఐదేళ్లుగా పరిచయం ఉంది. అయితే తనను దూరం పెడుతున్న అనూషపై సురేష్‌ పగ పెంచుకున్నాడు. గురువారం సాయంత్రం పార్కులో కలుసుకుందామని ఆమెకు ఫోన్‌ చేశాడు. కాగా, ఒక వ్యక్తిని పార్కులో కలిసి ఐదు నిమిషాల్లో తిరిగి వస్తానని అనూష తన తల్లికి చెప్పింది. జయనగర్‌ ప్రాంతంలోని పార్కుకు ఆమె బయలుదేరింది. అనుమానించిన తల్లి కొంత సేపటి తర్వాత అనూషను అనుసరించింది. మరోవైపు పార్కులో వేచి ఉన్న సురేష్‌ అక్కడకు వచ్చిన అనూషను కత్తితో పలుమార్లు పొడిచాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అప్పుడే పార్కుకు చేరుకున్న అనూష తల్లి ఇది చూసి ఆగ్రహంతో రగిలిపోయింది. పెద్ద రాయితో సురేష్‌ తలపై కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అనూషను ఆసుపత్రికి తరలించగా ఆమె కూడా మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు జంట హత్యలపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజుల పాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు ఎవరికీ వినిపించకుండా పెదవులను అంటించడమే కాకుండా.. గాయాలపై కారం చల్లి, హింసించాడని మీడియా కథనాలు పేర్కొన్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..గుణ ప్రాంతంలో బాధితురాలు తన తల్లితో కలిసి నివసిస్తోంది. నెల రోజుల క్రితం నిందితుడు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి తన ఇంట్లో బంధించాడు. దాంతో ఆమె తప్పించుకోవడానికి వీలులేకుండా పోయింది. తనను పెళ్లి చేసుకోవాలని, తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తిని అప్పగించాలని వేధించినట్లు సదరు యువతి పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలోనే లైంగికంగా వేధించి, బెల్ట్‌, వాటర్‌ పైపులతో కొట్టేవాడని తెలిపింది. అయితే మంగళవారం రాత్రి ఆమె తప్పించుకోవడానికి అవకాశం దొరకడంతో.. అక్కడినుంచి బయటపడి, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీసుస్టేషన్‌కు చేరుకుంది. పెదవులు అంటించి ఉండటం, కళ్లు వాచి పోయి, ఒళ్లంతా గాయాలతో ఉన్న ఆమెను చూసి పోలీసులు చలించిపోయారు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఉన్నతాధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఈ ఘటన సమయంలో ఆమె తల్లి వేరే ఊరిలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

* తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి రోజా అనుచరుడు, వైకాపా నేత ఉమామహేశ్వరావుకు చెందిన శ్రీవిద్య కళాశాలలో కళాశాలలో 250 కేసుల మద్యాన్ని పట్టుకున్నారు. ఒక్కో కేసులో 48 బాటిళ్లు ఉన్నట్లు సమాచారం. నగరిలో మంత్రి రోజా నామినేషన్‌ నేపథ్యంలో ఇది బయటపడటం గమనార్హం.

* విదేశాల్లో ఉన్నత చదువులకోసం వెళ్లిన భారతీయ విద్యార్థుల వరుస మరణాలు తల్లిదండ్రులకు తీరని కడుపుశోకాన్ని మిగుల్చుతోంది. తాజాగా స్కాట్లాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. స్కాట్లాండ్‌లోని ఓ పర్యాటక ప్రదేశంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయారు. బుధవారం సాయంత్రం జరిగిన దురదృష్టకర సంఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మునిగిపోయారని వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని లండన్‌లోని భారత హైకమిషన్ ప్రతినిధి వెల్లడించారు. వీరిని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్న చాణక్య బొలిశెట్టి (22), జితేంద్రనాథ్ కరుటూరి (27)గా గుర్తించారు. వాటర్‌ఫాల్స్‌కు పాపులర్‌ అయిన లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం వద్ద వీరిద్దరూ దుర్మరణం పాలయ్యారు. అత్యవసర సేవల ద్వారా ఇద్దరి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. డూండీ యూనివర్సిటీలో చదువుతున్న నలుగురు స్నేహితులు ట్రెక్కింగ్ చేస్తుండగా, ప్రమాద వశాత్తూ ఇద్దరు నీటిలో పడి మునిగిపోయారు. దీంతో మిగిలిన ఇద్దరు విద్యార్థులు ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z