Business

SBI FD వడ్డీ రేట్లు పెంపు-BusinessNews-May 15 2024

SBI FD వడ్డీ రేట్లు పెంపు-BusinessNews-May 15 2024

* కాంటాక్ట్‌లో లేని నంబర్‌ నుంచి కాల్‌ లిఫ్ట్‌ చేయగానే.. లోన్‌ కావాలా? క్రెడిట్‌ కార్డ్‌ కావాలా అని అడుగుతుంటారు. ఒక్కోరోజు ఈ తరహా కాల్స్‌ పదుల సంఖ్యలో వస్తుంటాయి. ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఇలాంటి కాల్స్‌ వస్తే చిరాకు, కోపం వచ్చేస్తుంటుంది. ఈ తరహా కాల్స్‌ను నియంత్రించేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. తాజాగా వీటికి చెక్‌ పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. త్వరలో కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) ఇలాంటి కాల్స్ నియంత్రణ కోసం మార్గదర్శకాలు రూపొందించింది. రిజిస్టర్‌ కానీ మొబైల్‌ నంబర్లు, అన్‌వాంటెండ్‌ కాల్స్‌ నియంత్రణకు ఇందులో పరిష్కారాలను ప్రతిపాదించింది. సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థల నుంచి అధికంగా వస్తుంటాయి. ఇలాంటి కాల్స్‌ నుంచి ప్రయోజనం పొందుతున్న కంపెనీలే వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ట్రాయ్‌ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే టెలికాం సంస్థలు జరిమానాలూ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

* మ్యూచువల్‌ ఫండ్‌లో మదుపు చేస్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌. కేవైసీ (KYC) నిబంధనల్ని స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ.. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (SEBI) సులభతరం చేసింది. కేవైసీ రిజిస్టర్డ్‌ స్టేటస్‌ కోసం ఆధార్‌- పాన్‌ (PAN) లింక్‌ చేయడం తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన నిబంధనల్ని సడలించింది. ఈమేరకు తాజా సర్క్యులర్‌ని జారీ చేసింది. బ్యాంకులు, ఫండ్‌ హౌస్‌లు, స్టాక్‌ బ్రోకర్లు పెట్టుబడి ప్రారంభించే ముందు గుర్తింపును ధ్రువీకరించే ప్రక్రియే కేవైసీ. పారదర్శక వాతావరణంలో మదుపరులు తమ పెట్టుబడులను నిర్వహించేందుకు వీలు కల్పించడంతోపాటు, మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడమే దీని లక్ష్యం. అయితే ఇంతకుముందు మీ పాన్‌, ఆధార్‌ లింక్‌ చేయకపోతే మీ కేవైసీ హోల్డ్‌లో ఉండేది. అంటే తిరిగి పెట్టుబడులు చేయడానికి అనుమతి ఉండదు. ఈ కేవైసీ ప్రక్రియను 2024 మార్చి 31లోపు కచ్చితంగా పూర్తి చేయాలని గతేడాది అక్టోబర్‌లోనే సెబీ ఆదేశించింది. లేదంటే మార్చి 31 నుంచి కొత్త పెట్టుబడులను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మార్పు కారణంగా అనేక మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాలు తాత్కాలిక సస్పెన్షన్‌కు గురయ్యాయి. కేవైసీ అసంపూర్తిగా ఉన్న 13 మిలియన్‌ ఖాతాలు ఈ చిక్కుల్లో పడ్డాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అమ్మకాల ఒత్తిడి, విదేశీ మదుపరుల విక్రయాలు సూచీలను పడేశాయి. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. నిఫ్టీ 22,200 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 73,200.23 (క్రితం ముగింపు 73,104.61) పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఇంట్రాడేలో 72,822.66 – 73,301.47 మధ్య కదలాడింది. చివరికి 117.58 పాయింట్ల నష్టంతో 72,987.03 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 17.30 పాయింట్లు నష్టంతో 22,200.55 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.50గా ఉంది. సెన్సెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లాభపడగా.. ఏషియన్‌ పెయింట్స్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ, సన్‌ ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్ ధర 82.46 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లలో టోక్యో లాభపడగా.. షాంఘై మార్కెట్లు నష్టపోయాయి. హాంకాంగ్‌, దక్షిణ కొరియా మార్కెట్లకు ఇవాళ సెలవు.

* గూగుల్‌ తమ కృత్రిమ మేధ మోడల్‌ జెమినీలో (Google Gemini) కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఏఐ ఫీచర్లతో మరింత అధునాతనంగా తీర్చిదిద్దింది. ఏఐను అనుసంధానిస్తూ గూగుల్‌ సెర్చ్‌ను మరింత సులువుగా మార్చింది. వీడియోల క్రియేషన్‌ కోసం కొత్త టూల్స్‌ను తీసుకొచ్చింది. వీటితో పాటు మంగళవారం కాలిఫోర్నియాలోని మౌంటెన్‌ వ్యూలో జరిగిన వార్షిక సదస్సులో (Google I/O 2024) తమ ఉత్పత్తులకు మరిన్ని అప్‌గ్రేడ్‌లను గూగుల్‌ ప్రకటించింది.

* ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (State Bank of India) ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (fixed deposit ) వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లపైనా, అలాగే, రూ.2 కోట్ల పైబడిన బల్క్‌ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. రూ.2 కోట్లలోపు రిటైల్‌ డిపాజిట్లపై ఎస్‌బీఐ గరిష్ఠంగా 75 బేసిస్‌ పాయింట్ల మేర ఎస్‌బీఐ వడ్డీని పెంచింది. 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీపై గతంలో 4.75 శాతం వడ్డీకి బదులు ఇకపై 5.50 శాతం చెల్లించనుంది. సీనియర్‌ సిటిజన్లకు 5.25 శాతంగా ఉన్న ఈ వడ్డీని శాతానికి పెంచింది. 211 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై ప్రస్తుతం ఉన్న వడ్డీని 6 నుంచి 6.25 శాతానికి పెంచింది. సీనియర్‌ సిటిజన్లకు గరిష్ఠంగా 6.75 శాతం వడ్డీ లభించనుంది. ఇక 7 రోజుల నుంచి 45 రోజుల బల్క్‌ డిపాజిట్లపై వడ్డీని 25 బేసిస్‌ పాయింట్ల మేర ఎస్‌బీఐ పెంచింది. ప్రస్తతం ఈ ఎఫ్‌డీలపై 5 శాతం వడ్డీ అందిస్తుండగా.. ఇకపై 5.25 శాతం చొప్పున వడ్డీ ఇవ్వనుంది. 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీపై 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.75 శాతం నుంచి 6.25 శాతానికి వడ్డీ పెంచింది. ఇదే కాలానికి సీనియర్‌ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీ లభిస్తుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z