DailyDose

₹2లక్షలు తీసుకుని తల్లికి తలకొరివి పెట్టిన ఘనుడు-CrimeNews-May 17 2024

₹2లక్షలు తీసుకుని తల్లికి తలకొరివి పెట్టిన ఘనుడు-CrimeNews-May 17 2024

* సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో దంప‌తుల‌తో పాటు వారి కుమారుడు మృతి చెందారు. నాందేడ్ – అఖోలా 161వ జాతీయ రహదారిపై ఆందోల్ మండ‌లం రామ్‌సాన్‌ప‌ల్లి వ‌ద్ద బైక్ అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌న ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్ర‌యాణిస్తున్న దంప‌తులు, వారి కుమారుడు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను మ‌ద్దూరుకు చెందిన శ్రీనివాస్(32), సునీత‌(30), న‌గేశ్‌(8)గా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

* పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిపై కక్ష గట్టాడో ఉన్మాది. తనతో కలిసి ఏడడుగులు వేయడానికి ఇష్టపడని అమ్మాయి.. ఈ భూమ్మీదే ఉండకూడదని అనుకున్నాడు. నేరుగా యువతి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి ఆమెను చంపేందుకు యత్నించాడు. అడ్డొచ్చిన ఆమె తల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వింజమూరు మండల కేంద్రానికి చెందిన నాగార్జున అనే యువకుడు కొంతకాలంగా పాతూరు గ్రామ పరిధిలోని యాదవ పాలెంలో ఉంటున్న ఓ యువతి వెంట పడుతున్నాడు. తనను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకోవాలని కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు. కానీ అతనితో పెళ్లికి సదరు యువతి ఒప్పుకోలేదు. అయినప్పటికీ నాగార్జున ఆమె వెంట పడటం మానలేదు. ఈ క్రమంలోనే సదరు యువతికి ఇంట్లో వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన నాగార్జున ఆగ్రహంతో ఊగిపోయాడు. సదరు యువతికి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. కూతురిపై కత్తితో దాడి చేయడం చూసిన ఆమె తల్లి కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అడ్డొచ్చిన యువతి తల్లిపై కూడా నాగార్జున కత్తితో దాడి చేశాడు. యువతి, ఆమె తల్లి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు ఒక్కసారిగా అక్కడకు వచ్చారు. దీంతో భయపడిపోయిన నాగార్జున అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్న తల్లీకూతుళ్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు నాగార్జున కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

* ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్‌పై జరిగిన దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సీఎం కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ తనపై విచక్షణరహితంగా దాడి చేసినట్లు తాజాగా స్వాతి మలీవాల్‌ ఆరోపించారు. సీఎం నివాసంలోని డ్రాయింగ్‌ రూమ్‌లో ఉన్న కుమార్‌ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని, చెంపదెబ్బ కొట్టాడని, ఛాతిపై తన్నాడని, లాగి పడేసినట్లు ఆమె ఆరోపించారు. ఆసమయంలో కేజ్రీవాల్‌ ఇంట్లోనే ఉన్నారని పేర్కొన్నారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సోమవారం ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి చేశారని ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి ఆరోపించిన ఉదంతం తెలిసిందే. దీన్ని ఆప్‌ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ విషయంలో స్వాతి మలీవాల్‌ పోలీసులకు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బిభవ్‌ కుమార్‌ను నిందితుడిగా పేర్కొంటూ గురువారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఇంటికి వెళ్లి వాంగ్మూలాన్ని కూడా రికార్డుచేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఆమె వాంగ్మూలాన్ని పొందుపరిచారు. దీని ప్రకారం.. సివిల్‌ లైన్స్‌లోని మలివాల్ సోమవారం సాయంత్ర ఆరు గంటలకు సీఎం నివాసానికి చేరుకుంది. ముఖ్యమంత్రి సహాయకుడిని సంప్రదించడానికి ప్రయత్నించగా. ఎలాంటి స్పందన రాలేదు. అనంతరం డ్రాయింగ్‌ రూమ్‌లో వేచి ఉన్న సమయంలో బిభవ్ కుమార్ గదిలోకి చొరబడి తనను దూషించడం ప్రారంభించాడని ఆమె ఆరోపించారు.

* పాట్నాలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పదరీతిలో చనిపోవడం, ఆ విషయాన్ని దాచేందుకు స్కూల్‌ సిబ్బంది యత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. బాధిత కుటుంబానికి అండగా తోడైన ఓ కులం.. పాట్నాలో నిరసనలకు దిగింది. రోడ్లపై మంటలు పెట్టి.. సత్వర న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తోంది. టినీ టాట్‌ అకాడమీ స్కూల్‌లో చదివే చిన్నారి.. గురువారం స్కూల్‌ ట్యూషన్‌ అయ్యాక కూడా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో స్కూల్‌కు వచ్చారు. అయితే పాఠశాల సిబ్బంది పొంతన లేని సమాధానం ఇవ్వడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. బలవంతంగా స్కూల్‌లోకి అర్ధరాత్రి దాకా వెతికారు. చివరకు.. ఈ వేకువ ఝామున 3గం. ప్రాంతంలో స్కూల్‌ ఆవరణలోని డ్రైనేజీలో ఆ చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన కుటుంబ సభ్యులు స్కూల్‌కు నిప్పటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్కూల్‌కు చేరుకుని ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చే యత్నం చేశారు. ఎస్పీ చంద్రప్రకాష్‌ స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.

* డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తి తన తండ్రిని బేస్‌బాల్‌ బ్యాట్‌తో కొట్టి చంపాడు. (Drug Addict Beats Father To Death) అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లిని కూడా అతడు కొట్టడంతో ఆమె గాయపడింది. ఆ తర్వాత ఇంటి నుంచి అతడు పారిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దత్తపురా ప్రాంతంలోని బాబా వాలీ గలిలో నివసిస్తున్న 32 ఏళ్ల సుధాంషు కదమ్ డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. డీ అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందిన అతడు ఇటీవల ఇంటికి తిరిగి వచ్చాడు. కాగా, గురువారం సుధాంషు ఇంటి వద్ద రెచ్చిపోయాడు. 65 ఏళ్ల తండ్రి రవిని బేస్‌ బాల్‌ బ్యాట్‌తో కొట్టి చంపాడు. భర్తను కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి శకుంతల తలపైనా ఆ బ్యాట్‌తో కొట్టాడు. దీంతో ఆమె తలకు గాయమైంది. ఆ తర్వాత ఇంటి నుంచి అతడు పారిపోయాడు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. సుధాంషు తండ్రి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సుధాంషును అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతడి కోసం పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి.

* మానవత్వం మంట కలిసిపోతుంది. మానవ సంబంధాలు, విలువలు రోజురోజుకు దిగజారుతూ అంతరించిపోతున్నాయి. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఒకప్పుడు ప్రేమానురాగాలు ఉండేవి. రాను రాను డబ్బుపై వ్యామోహం పెరిగి బంధుత్వాలు తగ్గుకుంటూ వస్తున్నాయి. ఆస్తి పాస్తులు ఉంటే చాలు తల్లిదండ్రులు కూడా అవసరం లేదని రుజువు చేస్తున్న ఘ‌ట‌న‌లు చూస్తున్నాం. తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతో ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేస్తారు. కానీ చివరికి అలాంటి తల్లిదండ్రులని పట్టించుకోని దీన స్థితి నెలకొంది. బంగారం, డబ్బుల కోసం చివరకు చనిపోయిన తల్లి అంత్యక్రియలు నిర్వ‌హించ‌కుండా రెండు రోజులు రోజులు ఆపి ఘ‌టన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని కందులవారి గూడెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కందులవారిగూడేనికి చెందిన వేము వెంకటరెడ్డి, లక్ష్మమ్మ (80) దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. గతంలోనే లక్ష్మమ్మ భర్త వెంకటరెడ్డి, చిన్న కుమారుడు కూడా చనిపోయారు . దీంతో నేరేడుచర్లలో ఉంటున్న చిన్న కుమార్తె వద్ద గత ఐదేళ్లుగా ల‌క్ష్మ‌మ్మ‌ ఉంటుంది. లక్ష్మమ్మ ఇటీవల కాలు జారి కింద‌ పడింది. దాంతో ఆమెను మిర్యాలగూడలోని ఓ ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందించారు . ఆమె పరిస్థితి విషమించ‌డంతో ఇంటికి తీసుకెళ్లండని డాక్ట‌ర్లు సూచించారు. దీంతో లక్ష్మమ్మను ఆక్సిజన్ స‌పోర్ట్‌తో చిన్నకుమార్తె తన ఇంటికి తీసుకెళ్లింది. బుధవారం రాత్రి 9 గంటలకు ఇంటి ముందు ఉన్న వెంచర్ వద్ద అంబులెన్స్ వ‌చ్చి ఆగింది. ఈలోగా లక్ష్మమ్మ కుమారుడు అక్కడికి చేరుకుని.. పెద్దమనుషులతో పంచాయితీ పెట్టించారు. లక్ష్మమ్మను కందులవారిగూడెం తీసుకెళ్తానని చెప్పడంతో.. మిగతా కూతుళ్లు ఆస్తి పంపకాలు తేలే వరకు అంబులెన్స్ కదిలేది లేదని పట్టుపట్టారు. చివరకు రాత్రి 11 గంటల సమయంలో లక్ష్మమ్మ కన్నుమూశారు. మృతదేహాన్ని కందులవారిగూడెం తరలించినా కొడుకు కూతుళ్ల పంచాయితీ మాత్రం ఆగలేదు. లక్ష్మమ్మ గతంలో రూ.21 లక్షల వరకు పలువురికి అప్పులిచ్చారు. ఆమె ఒంటిపై 20 తులాల బంగారు ఆభరణాలున్నాయి. అయితే లక్ష్మమ్మ వైద్య ఖర్చులు భరించిన చిన్నకూతురికి రూ.21 లక్షల్లోంచి రూ.6 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. మిగిలిన రూ.15 లక్షలకు సంబంధించిన పేపర్లను కుమారుడికి అప్పజెప్పారు. 20 తులాల బంగారు ఆభరణాలను ముగ్గురు కూతుళ్లు పంచుకున్నారు. అంతా అయిపోయిందిలే అనుకుంటున్నా సమయంలోనే కుమారుడు కొత్త పేచీ పెట్టాడు. తాను అంత్యక్రియల ఖర్చు భరించలేనని, తనకు డబ్బులిస్తేనే తలకొరివి పెడతానన్నాడు. శుక్రవారం ఉదయం పెద్ద మనుషులు అంత్యక్రియల ఖర్చుకు రెండు లక్షలు ఇప్పియడంతో ఆ పంచాయితీ కొలిక్కి వచ్చింది. తర్వాత ఆమె అంత్యక్రియల‌ను నిర్వ‌హించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z