Politics

జులై 22 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు-NewsRoundup-July 06 2024

జులై 22 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు-NewsRoundup-July 06 2024

* రాయలసీమ ముఖచిత్రం త్వరలో మారిపోనుంది. గతంలో ఎన్నడూలేనంతగా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు కళకళలాడనున్నాయి. ఇందుకు ప్రధాన కారణం..ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా వెళ్లే హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-44)ని ఇప్పుడున్న నాలుగు వరుసల నుంచి ఏకంగా 12 వరుసలకు విస్తరించడమే. రెండు మెట్రో నగరాల మధ్య వాహన రద్దీని, భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి.. ఈ రహదారిని 12 వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ జాతీయ రహదారిలో 260 కి.మీ. మన రాష్ట్ర పరిధిలో ఉండటంతో అన్ని విధాలా అభివృద్ధికి అవకాశం ఏర్పడుతోంది.

* రాష్ట్రంలో చంద్రబాబు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. మునుపెన్నడూ రాష్ట్రంలో లేని చెడు సంప్రదాయానికి సీఎం చంద్రబాబు నాయుడు నాంది పలికారని విమర్శించారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త అజయ్‌కుమార్‌ రెడ్డిని వైఎస్ జగన్‌ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ చేస్తున్న దాడులను వెంటనే ఆపేయాలని సూచించారు. దాడులు ఆపకపోతే అవే వాళ్లకు తిప్పికొడతాయని టీడీపీ గుర్తించాలని హెచ్చరించారు.

* నిరుద్యోగుల ఉద్యమ సెగ సర్కారుకు గట్టిగానే తగిలినట్లుంది. ఇన్నాళ్లూ బెట్టుచేసిన రేవంత్‌ సర్కారు ఓ అడుగు దిగివచ్చింది. డీఎస్సీ లేదా గ్రూప్‌-2 (Group-2) పరీక్షల్లో ఏదో ఒకటి వాయిదా వేసే దిశగా ముందుకుపోతున్నది. అయితే గ్రూప్‌-2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ విషయం నిర్ణయం తీసుకున్నదని, నేడు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. డీఎస్సీ, గ్రూప్‌-2 పరీక్షలు వెంటవెంటనే ఉన్నాయి. షెడ్యూల్‌ ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే ఇవి రెండూ ఒకదాని వెంటే మరొకటి నిర్వహిస్తుండడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. డీఎస్సీని సెప్టెంబర్‌లో నిర్వహించాలని గతకొంతకాలంగా డిమాండ్‌ చేస్తూవస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో.. డీఎస్సీ వాయిదా, గ్రూప్‌-1 మెయిన్స్‌తోపాటు పలు సమస్యల పరిష్కారానికి నిరుద్యోగులు శుక్రవారం టీఎస్‌పీఎస్సీ ముట్టడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో పరీక్షల వాయిదా అంశంపై చర్చించినట్టు తెలిసింది. పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సమావేశంలో సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌-2 వాయిదా వేయిదా వేయడానికే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తున్నది.

* ఆంధ్రాలో పెళ్లి కొడుకు అయితే.. తెలంగాణ‌లో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని రేవంత్, చంద్ర‌బాబు భేటీపై మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నిరంజ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గ‌త ప‌దేండ్ల నుంచి ఎవ‌రి మానాన వారు బ‌తుకుతున్నారు. కానీ మానిన గాయాల‌ను మ‌ళ్లీ ర‌గిల్చేందుకు చంద్ర‌బాబు, రేవంత్ క‌లిసి కుట్ర‌లు చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి వేదిక‌గా ఉండ‌డం అభ్యంత‌రం లేదు. కానీ ఇక్క‌డ మేం మ‌ళ్లీ మా పాత్ర పోషిస్తామ‌ని రాజ‌కీయ ఆర్భాటాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావ‌డం లేదు. చంద్ర‌బాబు ఆంధ్రాలో సీఎం అయ్యారు. తెలంగాణ రాజ‌ధానిలో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావ‌డం లేదు. పెళ్లికొడుకు ఒక‌చోట‌.. పెళ్లి ఒక‌చోట‌.. పందిరి మాత్రం తెలంగాణ‌లో వేస్తున్న‌రు. ఆర్భాటం హైద‌రాబాద్‌లో చేస్తున్న‌రు. హైద‌రాబాద్‌లో ఆర్భాటం ఎందుకు..? ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారు. అప‌రిష్కృత అంశాల మీద చ‌ర్చ అనుకుంటే ఆ అడుగులు వేరేలా ఉండేవి. కానీ అలా లేవు. ప‌రోక్షంగా తెలంగాణ‌ను ప‌రిపాలించేట‌టువంటి కుట్ర ప్రారంభ‌మైంది. తెలంగాణ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరుతున్నాను అని నిరంజ‌న్ రెడ్డి తెలిపారు.

* శ్రీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం, హంపీ మఠం పీఠాధిపతి జగద్గురు విద్యారణ్య భారతి (Vidyaranya Bharati) స్వామీజీ శనివారం తన శిష్యులతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామి(Venkateswara Swamy) ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆయన రాక సందర్భంగా ఆలయ ప్రధాన ద్వారం వద్ద టీటీడీ(TTD) జేఈవో వీరబ్రహ్మం, వేదపండితులు ఆలయ మర్యాదతోస్వాగతం పలికారు.

* భారాసకు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అంతకు ముందు ఆయన జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గద్వాల స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవలే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.

* ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లతో ప్రపంచాన్ని ఆకర్షించిన రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ రూపొందించింది. దీని స్ట్రీమింగ్‌ తేదీని, ఇందులో ఏం చూపనున్నారో తెలుపుతూ తాజాగా ఆ సంస్థ (Netflix) పోస్ట్‌ పెట్టింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ పేరుతో ఇది రానున్నట్లు తెలిపింది. ‘ఒక మనిషి.. అనేక బ్లాక్‌బస్టర్‌లు.. అంతులేని ఆశయం. ఈ లెజెండరీ దర్శకుడు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇలాంటి అంశాలతో ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ రూపొందింది. ఆగస్టు2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది’ అని సంస్థ పేర్కొంది. దీన్ని అనుపమా చోప్రా సమర్పించనున్నారు. ఈ డాక్యుమెంటరీలో పలువురు హాలీవుడ్‌ దర్శకులు, సినీ ప్రముఖులు రాజమౌళిపై (SS Rajamouli) వారి అభిప్రాయాలను తెలియజేయనున్నారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు కూడా ఈ దర్శకధీరుడితో వారి అనుబంధాన్ని పంచుకోనున్నట్లు తెలుస్తోంది.

* ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన సోనాక్షి సిన్హా పెళ్లి తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు. అలాగే కొన్నిరోజులుగా తనపై వస్తోన్న ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై స్పందించారు. తన తాజా చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటి గురించి మాట్లాడారు. ‘పెళ్లికి ముందు నేను ఎంత సంతోషంగా ఉండేదాన్నో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. జీవితం ఇంతకంటే అందంగా, గొప్పగా ఉండదేమో అనిపిస్తోంది. ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలాంటి మార్పు లేదు. మళ్లీ నా సినిమాల చిత్రీకరణను ప్రారంభించడం సంతోషంగా ఉంది. పెళ్లి తర్వాత వచ్చిన ఒకే ఒక్క మార్పు ఏంటంటే.. ఇకపై మేము హాస్పిటల్‌కు వెళ్లాలనుకోవడం లేదు. ఎందుకంటే మేము అక్కడ కనిపిస్తే చాలు ప్రెగ్నెంట్‌ అని అనుకుంటున్నారు. ఇదొక్కటే ఆలోచనలో ఉంటున్నారు’ అని చెప్పారు. సోనాక్షి (Sonakshi Sinha) తండ్రి శత్రుఘ్న సిన్హా ఇటీవల జ్వరం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆయన్ని పరామర్శించడం కోసం సోనాక్షి అక్కడకు వెళ్లారు. దీంతో అప్పటి నుంచి ఆమెపై ఈ రూమర్స్ మొదలయ్యాయి.

* ఏపీ బెవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి కలెక్టర్‌ మాధవీలతారెడ్డిపై కేసు నమోదు చేశారు. తన తల్లి మరణానికి వాసుదేవరెడ్డి, కొడాలి నాని కారణమయ్యారంటూ గుడివాడ రెండో పట్టణ పీఎస్‌లో గుడివాడ ఆటోనగర్‌ వాసి దుగ్గిరాల ప్రభాకర్‌ ఫిర్యాదు చేశారు. తమ గోదాములో ఉన్న లిక్కర్‌ కేసులను పగులకొట్టి తగులబెట్టారని అందులో పేర్కొన్నారు. తమ బాధ చెబితే వాసుదేవరెడ్డి, మాధవీలత దూషించారని ఆరోపించారు. కొద్దిరోజులకే తన తల్లి మనస్తాపంతో మరణించిందని ప్రభాకర్‌ తెలిపారు.

* నెదర్లాండ్స్‌ (Netherlands)లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ప్రధానిగా డిక్‌ స్కూఫ్‌ ప్రమాణస్వీకారం చేశారు. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మార్క్‌ రుట్టే (Mark Rutte).. కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగించి తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అయితే, అందరు నేతల్లా బందోబస్తు నడుమ కారులో కాకుండా సింపుల్‌గా సైకిల్‌పై తన సొంతింటికి వెళ్లిపోయారు. సైకిల్‌ నడుపుకుంటూ సిబ్బందికి టాటా చెబుతూ వీడ్కోలు పలికారు.

* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ముఖాముఖి భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం భేటీ అయి.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్యనేతల సమావేశం వేదికైంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు.

* ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమ్ఇండియా నిలిచింది. సెమీ ఫైనల్‌లో రోహిత్‌ సేన.. ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. దీంతో 2022 సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. బార్బడోస్‌లో జరిగిన ఫైనల్ మ్యచ్‌లో దక్షిణాఫ్రికాను భారత జట్టు మట్టికరిపించి టీ20 ప్రపంచ కప్‌ని చేజిక్కించుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మరో సెమీస్‌లో అఫ్గానిస్థాన్‌ ఓటమిపాలైన అనంతరం వాన్ మాట్లాడాడు. టోర్నమెంట్ షెడ్యుల్‌ను ప్రస్తావిస్తూ.. నిర్వాహకులు భారత్‌కు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపించాడు. అఫ్గాన్‌ ఆటగాళ్లు సెమీస్‌ కోసం ట్రినిడాడ్‌కు వెళ్లాల్సిన విమానం నాలుగు గంటలు ఆలస్యమైందని తెలిపాడు. దీంతో వారికి ప్రాక్టీస్ చేసే సమయం కూడా దొరకలేదన్నాడు. ఐసీసీ.. భారత్‌కు అనుకూలంగా వ్యవహరించిందని వాన్‌ ఆరోపించడంపై రవిశాస్త్రి గట్టిగానే స్పందించాడు. ‘‘మైకెల్ వాన్‌ ఏది పడితే అది మాట్లాడుతాడు. అతని మాటలను భారత్‌లో ఎవరూ పట్టించుకోరు. సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ ఎందుకు విఫలమైందనే దానిపై అతడు దృష్టిపెడితే మంచిది. భారత్‌ నాలుగు ట్రోఫీలు సాధించింది. ఇంగ్లాండ్‌ రెండు సార్లు కప్పు గెలిచింది. కానీ, మైకెల్ వాన్‌ ఒక్కసారైనా ప్రపంచ కప్ సాధించలేదు’’ అని రవిశాస్త్రి కౌంటర్ ఇచ్చాడు.

* బ్రిటన్‌ నూతన ప్రధానిగా లేబర్‌ పార్టీ అధ్యక్షుడు కీర్‌ స్టార్మర్‌ (Keir Starmer) ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం, ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంపై శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో భారత్‌ పర్యటనకు రావాలంటూ ఆహ్వానించారు. ఇరుదేశాల మధ్య చారిత్రక సంబంధాలను గుర్తుచేసుకున్న నేతలు.. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నిబద్ధతను చాటినట్లు భారత విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పరస్పర ప్రయోజనకరమైన ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ)’ వీలైనంత త్వరగా కొలిక్కి తెచ్చేందుకు కృషి చేయాలని అంగీకరించినట్లు వెల్లడించింది. బ్రిటన్‌ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల అభివృద్ధికి భారతీయ సమాజం అందించిన సహకారాన్ని అభినందిస్తూ.. ఇరుదేశాల ప్రజల నడుమ సన్నిహిత సంబంధాలను ప్రోత్సహించడాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

* రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్‌బాబును శనివారం భారాస ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, వివేకానందగౌడ, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి కలిశారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల సంబంధించిన ప్రతిపాదనలను ఎమ్మెల్యేలు మంత్రికి అందజేశారు. జీహెచ్‌ఎంసీకి నిధులు విడుదల చేయాలని కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి జీహెచ్‌ఎంసీకి నిధులు ఇవ్వలేదని మంత్రి దృష్టికి తెచ్చారు.

* అయోధ్యలో (Ayodhya) భాజపాను ఓడించినట్లే.. గుజరాత్‌లోనూ (Gujarat) ఆ పార్టీపై ఇండియా కూటమి (India Bloc) విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత, రాయ్‌బరేలి ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు.

* గత ఐదేళ్లలో నైపుణ్య శిక్షణపరంగా రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. విజయనగరంలోని టీటీడీసీ శిక్షణా కేంద్రం, జిల్లా సమాఖ్య కార్యకలాపాలను ఆయన పరిశీలించారు.

* కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌ హౌస్‌ ఇంజినీర్లను జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారించనుంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్‌హౌస్‌ ఇంజినీర్లను కమిషన్‌ ప్రశ్నించనుంది. ఈ మూడు పంప్‌హౌస్‌లకు చెందిన సీఈ నుంచి ఏఈఈల హోదాల్లో పనిచేసే ఇంజినీర్లు సోమవారం కమిషన్‌ ఎదుట హాజరుకానున్నారు.

* తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. సికింద్రాబాద్‌ నుంచి వాస్కోడగామా(గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించనుంది. ఇప్పటివ రకు వారానికి ఒక రైలు 10 బోగీలతో సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి గుంతకల్‌ చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది.

* టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బర్త్‌డే ఆదివారం. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కన ధోనీ ‘100’ అడుగుల కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు.

* సమంతను విమర్శించినందుకు డాక్టర్‌ లివర్‌ డాక్‌ క్షమాపణలు చెప్పారు. కొన్ని రోజులుగా సమంతకు ఆయనకు మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆయన సమంత ఇచ్చిన హెల్త్‌ టిప్‌ను విమర్శించే క్రమంలో ఆమెను బలమైన పదాలతో దూషించారు.

* టీ20 ప్రపంచకప్‌లో (T20 WorldCup) విజయఢంకా మోగించిన రోహిత్‌ సేన.. ప్రధాని మోదీ (Modi) నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీమ్ఇండియా హార్దిక్ పాండ్య (Hardik Pandya) ప్రధానితో మాట్లాడుతూ.. గత కొద్దినెలలుగా తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వెల్లడించాడు.

* సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించి, నరేంద్రమోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీయే కూటమి కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ప్రభుత్వం జులై 23న బడ్జెట్‌ (Union Budget 2024)ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సమర్పించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో జులై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను తీసుకొస్తున్నారు. మోదీ 3.0లో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌ ఇదే. దీంతో వరసగా ఏడుసార్లు బడ్జెట్‌ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్‌ అందుకోనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్‌ వరసగా ఆరుసార్లు బడ్జెట్‌ సమర్పించారు. 2019లో రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామన్‌కు (Nirmala Sitharaman) ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రెండో మహిళగా గుర్తింపు పొందారు. ఎప్పటిలా సూట్‌కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్‌ ప్రతులను తీసుకొచ్చే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z