పులుపు- వగరు కలబోసుకుని ఆకర్షణీయమైన రంగులో ఉంటుంది వాక్కాయ. కలివేకాయ, వోగ్గాయ, కలేక్కాయ, సీమ కలివికాయ అని ప్రాంతానికో పేరుతో పిలిచే ఈ కాయలు విరివిగా దొరికే కాలమిది. కూరలూ, పచ్చళ్లతోపాటు రకరకాల పదార్థాలు చేసుకునే వాక్కాయలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. పల్లె నుంచి పట్టణాల వరకూ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే ఈ వాక్కాయ ప్రత్యేకతలు ఎన్నో. విందుభోజనాల్లో ఆఖరున టూత్‌పిక్‌కి ఓ ఎర్రని పండును గుచ్చిన కిళ్లీలను ఇస్తారు. పిల్లలు కిళ్లీలను తినరుగానీ దానికి గుచ్చిన పండు కోసం మాత్రం పోట్లాడుకుంటారు. అలానే బస్టాండ్లూ, రైల్వేస్టేషన్లలో చెర్రీల పేరుతో ఎర్రెర్రని తీయని పండ్లూ, టూటీ ఫ్రూటీలూ దొరుకుతాయి. వాటి రుచిని ఆస్వాదిస్తూ ప్రయాణం చేసిన జ్ఞాపకాలు ఎందరికో ఉంటాయి. వాటన్నిటినీ కేకులూ, సలాడ్ల డెకరేషన్‌లోనూ వాడతారు. చిన్నల నుంచీ పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఈ పదార్థాలన్నింటినీ చేసేది మనకు సహజసిద్ధంగా దొరికే వాక్కాయలతోనే. ఈ కాయల్ని పప్పులో వేసుకుంటారు, రోటి పచ్చళ్లు చేసుకుంటారు, ఆవకాయ, పచ్చిమిర్చితో వాక్కాయ నిల్వ పచ్చడీ పెట్టుకుంటారు. మరెన్నో రకాలుగానూ ఉపయోగించే వాక్కాయ ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తుంది.
వాక్కాయ ప్రస్తావన రామాయణంలోనూ ఉంది. శ్రీరాముణ్ని ఆరాధించిన శబరి- ఆయన స్వయంగా ఇంటికొచ్చినప్పుడు ఆమె పెట్టిన పుల్లని ఫలాల్లో వాక్కాయలూ ఉన్నాయట. ‘శ్రీకాళహస్తి మహత్మ్యము’లోని ఓ పద్యంలో ధూర్జటి మహాకవి వర్ణించిన 24 రకాల మధుర ఫలాలలో వాక్కాయ కూడా ఒకటి. అలాంటి ప్రశస్తి ఉన్న ఈ కాయల్ని చింతపండుకు ప్రత్యామ్నాయంగానూ ఉపయోగిస్తారు కొందరు. నగరాల్లో అయితే మార్కెట్‌లో దొరుకుతున్నాయిగానీ, పల్లెల్లో పొలం గట్లపైనున్న వాక చెట్టు అనే ముళ్ల పొదకు కాస్తుంటాయివి. కావల్సినన్ని కాయల్ని ఇంటికి తెచ్చుకుని రకరకాల పదార్థాలు తయారు చేసుకుంటారు. కేవలం ఈ సీజన్‌లో మాత్రమే దొరికే వాక్కాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వాడుకోవడానికి- ఉప్పూ, పసుపులో ఊరబెట్టి, ముక్కలు కోసి ఎండబెట్టి ఏడాదంతా నిల్వ చేసుకుంటారు కొందరు. ఐస్‌క్రీమ్‌లపైన చల్లే- కేకులకూ బ్రెడ్‌లకూ అద్దే టూటీఫ్రూటీలనూ వీటితో చేసుకునేవారూ ఉన్నారు. అలానే ఆన్‌లైన్‌లోనూ ఆవకాయ, రకరకాల పచ్చళ్లూ, జామ్, డ్రైడ్ వాక్కాయలూ, మురబ్బా(స్వీట్ చెర్రీలూ) దొరుకుతున్నాయి.
వాక్కాయలు కాసే వాక చెట్టు ఎత్తుగా పొదలా పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఆదిలాబాద్, నిజామాబాద్, ఒంగోలు, రాయలసీమ జిల్లాల రైతులెందరో బయో ఫెన్సింగ్‌గానూ ఎంచుకుని- పంట పొలాల్లోకి అడవి జంతువులు రాకుండా సరిహద్దుల్లో పెంచి వాటిని అడ్డుకుంటున్నారు. మరోవైపు సీజన్‌లో వాక్కాయలతో రకరకాల పదార్థాలు తయారు చేసి అదనపు ఆదాయమూ పొందుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే వాక్కాయలను కొందరు కుండీల్లోనూ పెంచుకుంటున్నారు. వీటిలో ఉండే విటమిన్ బి, సి, ఐరన్ రోగనిరోధకశక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇందులోని పీచు కడుపు ఉబ్బరాన్నీ, అజీర్తినీ తగ్గిస్తుంది. పెక్టిన్ అనే కార్బోహైడ్రేట్ జీర్ణవ్యవస్థను మెరుగు పరిచి ఆకలిని పెంచుతుంది. ఈ కాయల్లోని విటమిన్స్, ట్రిప్ట్టొఫాన్ అనే అమైనో యాసిడ్ సెరటోనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. అవి ఒత్తిడిని తగ్గించి మెదడును చురుగ్గా ఉంచుతాయి. ఇంకా వీటిలోని పోషకాలు కాలేయాన్నీ, రక్తాన్నీ శుద్ధి చేస్తాయి. శరీరంలో కొవ్వు నిల్వలు చేరుకోకుండా చూస్తాయి. రుచినీ ఆరోగ్యాన్నీ పంచే వాక్కాయల సుగుణాలు తెలిశాక మనమూ తెచ్చేద్దామా ఇంటికి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z