ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గంగా నది (Ganga River) ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆదివారం నాటికి నీటిమట్టం రిషికేశ్‌లోని త్రివేణి ఘాట్, గంగా హారతి ప్రాంతాల్లో ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో రాత్రివేళల్లో ఘాట్‌ల వద్దకు పర్యాటకులెవరూ వెళ్లొద్దని రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన దళం (SDRF) హెచ్చరికలు జారీ చేసింది. ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
మరోవైపు మరో మూడు రోజుల పాటు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రధానంగా కుమాన్, చమోలి, రుద్రప్రయాగ, పౌడీ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు దెహ్రాదూన్, తెహ్రీ, హరిద్వార్, ఉత్తరకాశీ ప్రాంతాల్లోనూ భారీ వర్ష సూచనలున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరింది. మరోవైపు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z