Devotional

భూమన-ధర్మారెడ్డిలపై ఫిర్యాదు-NewsRoundup-July 08 2024

భూమన-ధర్మారెడ్డిలపై ఫిర్యాదు-NewsRoundup-July 08 2024

* తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డిపై సీఎస్‌ నీరబ్‌కుమార్‌కు తెదేపా నేతలు గురజాల మాల్యాద్రి, నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు ధర్మారెడ్డి, భూమాన కరుణాకర్‌రెడ్డి అక్రమాలకు తెగబడ్డారని, సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై సీబీ సీఐడీ లేదా విజిలెన్స్‌ శాఖతో విచారణ జరిపించి అక్రమాలను వెలికి తీయాలని కోరారు.

* మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులను తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నెలసరి సెలవులు (Menstrual Leave) మంచి నిర్ణయమే అయినప్పటికీ.. దానివల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలకు దూరం కావొచ్చని అభిప్రాయపడింది.

* నిత్యం స్ఫూర్తిమంతమైన కథనాలను పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ‘ఎక్స్‌’ ఖాతాలో తాజాగా మరో వీడియోను పంచుకున్నారు. అమెరికాలో జరిగిన ఓ టాలెంట్‌ షోలో భారత సంతతికి చెందిన చిన్నారి తన ప్రతిభతో అందర్నీ ఆకట్టుకోవడంపై ప్రశంసలు కురిపించారు. ఆమె తన గానంతో న్యాయనిర్ణేతలు సహా ఎంతోమందిని మంత్రముగ్ధుల్ని చేసింది. భారత సంతతికి చెందిన ప్రణిస్కా మిశ్రాకు తొమ్మిదేళ్లు. కుటుంబం ఫ్లోరిడాలో స్థిరపడింది. ఇటీవల ‘అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు చురుగ్గా సమాధానం చెప్పింది. తాను ఇక్కడి వరకు వచ్చేందుకు అమ్మమ్మ ఎంతో ప్రోత్సాహం అందించినట్లు తెలిపింది. అనంతరం తన పాటతో అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ‘గోల్డెన్‌ బజర్‌’ను సొంతం చేసుకొని ఔరా అనిపించింది.

* అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తదుపరి ఛైర్మన్ ఎన్నిక ఈ ఏడాది నవంబర్‌లో జరగనుంది. ప్రస్తుతం ఛైర్మన్‌గా గ్రెగ్‌ బార్క్‌లే నాలుగు సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. అతడు మరో టర్మ్‌ ఛైర్మన్‌గా కొనసాగడానికి అర్హత ఉంది. అయితే, బీసీసీఐ సెక్రటరీ జై షా (Jay Shah) ఐసీసీ ఛైర్మన్‌ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. జై షా మద్దతుతోనే బార్క్‌లే ఐసీసీ ఛైర్మన్ కావడం గమనార్హం.

* ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన జీవో 225 విడుదల చేయడంతో రాష్ట్రంలోని పలువురు దివ్యాంగులకు మేలు చేకూరింది. ఆ జీవో వల్ల ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో 25 మంది దివ్యాంగ విద్యార్థులు సీట్లు సాధించారు. దీంతో వారంతా తల్లిదండ్రులతో కలిసి ఉండవల్లిలోని మంత్రి నారా లోకేశ్‌ నివాసానికి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి లోకేశ్‌ అభినందించడంతోపాటు వారికి ల్యాప్‌టాప్‌లను బహుకరించారు. ‘సింపుల్‌ గవర్నమెంట్‌ – ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌’ విధానంతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్‌ తెలిపారు.

* కర్ణాటకలో భాజపా ఎంపీ మద్దతుదారులు ఏర్పాటు చేసిన కార్యక్రమం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కార్యక్రమంలో ఉచితంగా ‘మద్యం’ పంపిణీ చేయడం చర్చనీయాంశమయ్యింది. దీనికి భారీ సంఖ్యలో ముందుప్రియులు క్యూ కట్టగా.. పోలీసులే బందోబస్తు నిర్వహించడం గమనార్హం. ఈ నేపథ్యంలో భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌.. ఈ వ్యవహారంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటక మాజీ మంత్రి, భాజపా నేత కె.సుధాకర్‌ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో చిక్కబళ్లాపుర్‌ నుంచి విజయం సాధించారు. ఈ సందర్భంగా స్థానికంగా కృతజ్ఞత కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆయన మద్దతుదారులు.. ఉచితంగా మద్యం పంపిణీ చేపట్టారు. దీనికి జనం ఎగబడ్డారు. భారీ ‘క్యూ’ లైను ఉండగా.. ఆ తతంగాన్నంతా పోలీసులు పర్యవేక్షించారు. అయితే, ఈ కార్యక్రమానికి బందోబస్తు నిర్వహించాలని ఎంపీ సుధాకర్‌ స్థానిక పోలీసులకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

* భారతీయ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో మహేశ్‌బాబు (Mahesh babu), రాజమౌళి (SS Rajamouli) మూవీ ఒకటి. యాక్షన్ అడ్వెంచర్‌ మూవీగా రాబోతున్న ఈ చిత్రం గురించి ఇప్పటివరకూ అనేక విషయాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే, కథానాయకుడి పేరు తప్ప ఒక్కటీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ క్రమంలో ఆగస్టు 9న మహేశ్‌బాబు పుట్టినరోజు జరుపుకోనున్నారు. సరిగ్గా నెల రోజులే ఉండటంతో జక్కన్నతో చేసే మూవీ నుంచి అప్‌డేట్‌ ఉంటుందా? అని మహేశ్‌ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల మహేశ్‌బాబు తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లి వచ్చారు. తాజాగా ఎయిర్‌పోర్ట్‌ నుంచి మహేశ్‌ బయటకు వస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అందులో ఆయన పొడవైన జుట్టు, గుబురు గడ్డంతో తలపై క్యాప్‌ పెట్టుకుని కనిపించారు. రాజమౌళి మూవీకి సంబంధించిన పాత్ర కోసమే ఆయన ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకూ మహేశ్‌ తెరపై కనిపించని సరికొత్త లుక్‌లో దర్శనమివ్వబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి తన సినిమా మొదలు పెట్టేముందే దానికి సంబంధించిన విశేషాలతో ఓ ప్రెస్‌మీట్‌ పెట్టి వివరిస్తారు. ఇప్పటివరకూ మహేశ్‌ విదేశాల్లో ఉండటంతో అది సాధ్యం కాలేదు. తాజాగా ఆయన హైదరాబాద్‌ చేరుకున్నారు. దీంతో అందరూ SSMB29 అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. మహేశ్‌ పుట్టినరోజు కానుకగా సినిమాకు సంబంధించి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఏదైనా ప్రీవిజువల్‌ టీజర్‌ ఉంటుందా? లేక మహేశ్‌ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ వస్తుందా? అన్న చర్చ సామాజిక మాధ్యమాల వేదికగా మొదలైంది.

* దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద మాజీ సీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీతో రాష్ట్రంలో రాజకీయం మరోసారి హీటెక్కింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని కామెంట్స్‌ చేశారు. కాగా, జగ్గారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో బీజేపీ గేమ్‌ స్టార్ట్‌ చేసింది. టీడీపీని ముందుపెట్టి బీజేపీ పొలిటికల్‌ గేమ్‌ ఆడుతోంది. తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్‌ కేడర్‌ అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నాను. సీఎం హోదాలో చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టాడు.చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంలో రాజకీయం మొదలు పెట్టాడు. కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టేందుకు టీడీపీ, జనసేనను బీజేపీ రంగంలోకి దింపింది. చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నాడు. ఏపీలో చేసిన పొలిటికల్‌ గేమ్‌ను తెలంగాణలో ఆడాలనుకుంటున్నారు. విభజన సమస్యల పేరుతో చంద్రబాబు తెలంగాణలో ఎంటరయ్యారు. రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ పార్టీనే. చంద్రబాబు కేవలం కొనసాగించారు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

* భారత క్రికెట్‌కు దూకుడును పరిచయం చేసిన మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఇవాళ (జులై 8) 52వ పడిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా గంగూలీ పేరిట ఉన్న ఓ ఆల్‌టైమ్‌ రికార్డు గురించి తెలుసుకుందాం.క్రికెట్‌ చరిత్రలో వివిధ ఫార్మాట్లలో ఇప్పటిదా​కా పదుల సంఖ్యలో ఐసీసీ టోర్నీలు జరగగా.. ఓ రికార్డు నేటికీ భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ పేరిటే ఉంది. అదేంటంటే.. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు.1992లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన గంగూలీ భారత కెప్టెన్‌గా ఐసీసీ టోర్నీల్లో ఆరు సెంచరీలు చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో కెప్టెన్‌గా (ఐసీసీ టోర్నీల్లో) ఎవరూ ఇన్ని సెంచరీలు చేయలేదు. గంగూలీ తర్వాత ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అత్యధికంగా 5 సెంచరీ చేశాడు.పాంటింగ్‌ తర్వాత ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్ల జాబితాలో కేన్‌ విలియమ్సన్‌ (3), ఆరోన్‌ ఫించ్‌ (2), స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ (2), సనత్‌ జయసూర్య (2) ఉన్నారు.

* షెడ్యూల్‌ ప్రకారమే తెలంగాణలో డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుత నోటిఫికేషన్‌ను రద్దు చేసి మరిన్ని పోస్టులను జత చేసి మెగా డీఎస్సీ నిర్వహించాలన్న డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం నిరుద్యోగుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో.. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 11వ తేదీ నుంచి డీఎస్సీ హాల్‌ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాబులో ఉంచనుంది విద్యాశాఖ. జులై 18వ తేదీ నుంచి ఆగష్టు 5వ తేదీ దాకా పరీక్షలు జరగనున్నాయి.

* ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తున్న కార్పొరేషన్ల (Corporations) పదవులను కాంగ్రెస్‌ సర్కార్‌ ఎట్టకేలకు భర్తీచేసింది. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. టీఎస్‌ఐఐసీ (TSIIC) చైర్‌పర్సన్‌గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలా రెడ్డిని నియమించింది. అదేవిధంగా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనీల్‌ను మైనింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించింది. మొత్తం 34 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జీవో విడుదల చేశారు. వీరంతా రెండేండ్ల పాటు పదవుల్లో కొనసాగనున్నారు.

* పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నంబ‌ర్ 1లో ఉన్న భారీ నిర్మాణాల‌ను సోమ‌వారం ఉద‌యం అధికారులు కూల్చివేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. మీ కాంగ్రెస్ నాయకులు అమ్మిన, మీ కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసిన ప్లాట్లలో నిర్మించుకుంటున్న ప్రజల ఇండ్లను మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏమి ఆశించి ఈరోజు కూలగొట్టించాడో ఒకసారి విచారణ చేయించండి. ప్రజా పాలనలో ప్రజలకు మద్దతుగా వెళ్లిన‌ బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా..? మీకు అన్నగా ప్రచారం చేసుకుంటూ సుధీర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో చేస్తున్న అరాచకాలపై మీరు ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోండి. లేదంటే ప్రజలు తిరగబడుతారు. మీ నిర్బంధాలు ప్రజాగ్రహాన్ని నిలువరించలేవు.అని కేటీఆర్ తేల్చిచెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z