Business

జెరోదాలో సాంకేతిక లోపం. మదుపర్లకు లక్షల్లో నష్టం-BusinessNews-July 08 2024

జెరోదాలో సాంకేతిక లోపం. మదుపర్లకు లక్షల్లో నష్టం-BusinessNews-July 08 2024

* పాపులర్ స్టాక్ బ్రోకరేజ్ ప్లాట్​ఫామ్ ‘జెరోధా’లో మళ్ళీ సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన ఆర్డర్‌లకు సంబంధించిన సాంకేతిక లోపాల గురించి సోమవారం బహుళ జెరోధా వినియోగదారులు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు.”జెరోధా వల్ల 10 లక్షలు నష్టపోయాం. ఇది కష్టపడి సంపాదించిన డబ్బు. నేను నా డబ్బును తిరిగి పొందాలనుకుంటున్నాను. దీనికోసం కోర్టును ఆశ్రయిస్తాను” అని ఒక వినియోగదారు చెప్పారు. జెరోధాలో సమస్య తలెత్తినట్లు బ్రోకర్ కూడా అంగీకరించారు.ఈ సమస్య ఇప్పుడు పూర్తిగా పరిష్కరించాము. కొత్త ఆర్డర్‌ల స్థితి ఇప్పుడు అప్‌డేట్ చేయబడుతోంది. మేము పాత ఆర్డర్‌ల స్థితిని అప్డేట్ చేయడానికి పని చేస్తున్నాము. మీకు కలిగిన అసౌకర్యానికి జెరోధా క్షమాపణలు చెప్పింది.జీరోధాలో ఇలాంటి సమస్య తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికి ఆరు సార్లు ఇలాంటి సమస్యను యూజర్లు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆర్డర్ ప్లేస్‌మెంట్‌కు సంబంధించి సాంకేతిక లోపం ఏర్పడింది. 2023లోనే, Zerodha కైట్ యాప్‌లో లాగిన్ చేయడం , ఆర్డర్‌లు మరియు పొజిషన్‌ల ప్రదర్శన అలాగే ఆర్డర్ ప్లేస్‌మెంట్‌లకు సంబంధించిన సమస్యలలో సాంకేతిక లోపాలను సంస్థ అంగీకరించింది.

* ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ఇదే సరైన సమయమని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకులన్నీ మంచి స్థితిలో ఉన్న వేళ ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, పెట్టుబడుల ఉపసంహరణకు ఇది అనుకూలమని తెలిపింది. ఈ మేరకు ‘కేంద్ర బడ్జెట్‌ 2024-25కు ముందుమాట’ పేరుతో ఓ నివేదికను సోమవారం విడుదల చేసింది. ఐడీబీఐలో ప్రభుత్వం, ఎల్‌ఐసీ కలిసి 61 శాతం వాటాను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎస్‌బీఐ తన నివేదికలో ప్రస్తావిస్తూ.. 2022లో ఐడీబీఐ విక్రయానికి బిడ్లు ఆహ్వానించారని, 2023 జనవరిలో వాటాల కొనుగోలు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను దీపమ్‌ అందుకుందని పేర్కొంది. ఈ బడ్జెట్‌లో దీనిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది. అలాగే డిపాజిట్లపై లభించే వడ్డీపై పన్నుతో పాటు, మ్యూచువల్‌ ఫండ్‌, ఈక్విటీ మార్కెట్‌ తరహాలోనే వీటిపైనా పన్ను విధానం ఉండాలని అభిప్రాయపడింది.

* దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. ఇంట్రాడేలో కాస్త కోలుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటాన్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోగా.. ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఇటీవల ఈక్విటీలు గరిష్ఠాలకు చేరిన నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతుండడమే దీనికి కారణం. సెన్సెక్స్‌ ఉదయం 79,915.00 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 79,996.60) నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 79,731.83 – 80,067.46 మధ్య చలించింది. చివరికి 36.22 పాయింట్ల నష్టంతో 79,960.38 వద్ద ముగిసింది. నిఫ్టీ 3.30 పాయింట్ల నష్టంతో 24,320.55 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.50గా ఉంది. సెన్సెక్స్‌లో టైటాన్‌, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏషియన్‌ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఐటీసీ, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 85.70 వద్ద, బంగారం ఔన్సు 2381 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

* ప్రీమియం ఎకానమీ సీట్లు అమర్చిన నారోబాడీ విమానమైన ఎ320 నియో, ఎయిరిండియాకు చేరింది. ఈ విమానంలో 8 విలాసవంత బిజినెస్‌ తరగతి సీట్లు, అదనపు లెగ్‌రూం ఉండే 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, సౌకర్యవంతమైన 132 ఎకానమీ తరగతి సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత విమానాల డిజైన్‌కు భిన్నంగా, సరికొత్త లివరీతో ఈ విమానాన్ని తీర్చిదిద్దారు. ఫ్రాన్స్‌లోని ఎయిర్‌బస్‌ తయారీ ప్లాంటు నుంచి దిల్లీ విమానాశ్రయానికి ఈ విమానం ఆదివారమే చేరింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z