* శ్రీవారి దర్శనానికి వెళ్లే నారాయణగిరి ఉద్యానవన షెడ్లలో కొందరు ఆకతాయిలు తీసిన ప్రాంక్ వీడియోలు దుమారం రేపాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీటీఎఫ్ వాసన్ తన మిత్రులతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో నారాయణగిరి షెడ్స్‌లోని క్యూలో వెళ్తూ.. కంపార్ట్మెంట్ తాళాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నటించారు. వచ్చిన వారు తితిదే సిబ్బందిగా భావించిన భక్తులు ఒక్కసారిగా పైకి లేచి ఆశగా ఎదురు చూశారు. వెకిలిగా నవ్వుతూ వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టారు. తీరా చూస్తే వారు ప్రాంక్ వీడియో చేశారు. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించిన ఆకతాయిలు ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై తమిళనాడులో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు ప్రవేశించక ముందే భక్తుల నుంచి సెల్ఫోన్లు డిపాజిట్ చేయిస్తారు. నిత్యం భక్తుల గోవింద నామాలతో మారు మ్రోగే తిరుమల కంపార్ట్మెంట్లలో వారి మధ్యనే ఉండి ఒకరిద్దరు ఆకతాయిలు చేసిన ఈ వికృత చేష్టలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తితిదే హెచ్చరించింది. తితిదే విజిలెన్స్ విభాగం విచారణకు ఆదేశించింది.
* తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా ఆగినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్య కారణంగా గురువారం మధ్యాహ్నం నుంచి అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌కు ఆధార్ లింక్ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తినట్టు చెప్పారు. యూడీఐఏలో ఈకేవైసీ వెరిఫికేషన్‌కు సంబంధించి సాంకేతిక సమస్యగా చెబుతున్న అధికారులు దానిని పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణుల ద్వారా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బంది పడ్డారు. సమస్య పరిష్కారమైతే వేచి ఉన్న వారి రిజిస్ట్రేషన్లు వెంటనే పూర్తి చేస్తామని, రద్దీగా ఉన్న కార్యాలయాల్లో శుక్రవారం రావాల్సిందిగా ఇప్పటికే తెలియజేసినట్టు పేర్కొన్నారు.
* నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో నితిన్ వృద్ధుడి గెటప్‌లో కనిపించి సందడి చేశారు. మరి ఆ గెటప్ ఫేస్ యాప్ ద్వారా చేశారా? లేక సినిమాలో ఇలా కనిపిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ మూవీని వినోదం, సందేశంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్నారు.
* విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ.కోట్ల మేర ఫీజులను తిరిగి చెల్లించాలని పలు ప్రైవేటు పాఠశాలలకు మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించి ఆ స్కూళ్లు.. ఫీజులను పెంచినట్లు తేలడంతో ఈమేరకు చర్యలకు ఉపక్రమించింది. అధికారుల వివరాల ప్రకారం.. జబల్‌పుర్‌లోని పలు ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు జిల్లా విద్యాయంత్రాంగానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఓ కమిటీని ఏర్పాటు చేసి.. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టింది.
* విలక్షణ నటుడిగా 500లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు సీనియర్ నటుడు మోహన్‌బాబు (Mohan Babu). ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తాజాగా ఆయన పంచుకున్న ఒక ఫొటో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది. ‘ఎంతో చారిత్రక ప్రాధాన్యం గల అపురూప రాజదండం అందడం పూర్వజన్మ సుకృతం.. ఈ రాజ దండం ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో అతి త్వరలో వివరాలు తెలియజేస్తా’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీనిపై ఆయన అభిమానులు నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
* ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) సచివాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై పయ్యావుల తొలి సంతకం చేశారు. స్థానిక సంస్థలకు రూ.250 కోట్ల మేర నిధులు విడుదల చేశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీ మేరకు పయ్యావుల తొలి సంతకం చేశారు.
* రాజకీయ వలసలపై మాట్లాడే నైతికత భారాస నాయకులకు లేదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు గతంలో భారాస ఏం చేసిందో గుర్తుచేసుకోవాలన్నారు. అవినీతి, అహంకారం వల్లే రాష్ట్రంలో భారాస ఓడిపోయిందన్నారు. పదేళ్ల భారాస పాలన అవినీతిమయమని కడియం ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం ఈ మేరకు మాట్లాడారు.
* తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ సాగింది. వైకాపా నేతలు లేళ్ల అప్పిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాష్, ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. విచారణను హైకోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. అప్పటివరకు వరకు తొందరపాటు చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. 2021 అక్టోబరు 19న తెదేపా కేంద్ర కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో వైకాపా మూకలు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే.
* భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ప్రజలు నిలవాలి.. రాష్ట్రం నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. అరాచకాలు చేసే వ్యక్తిని ప్రజాకోర్టులో శిక్షించారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను ఆయన పరిశీలించారు. అంతకుముందు దానికి సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువను పరిశీలించిన అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తిచేస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రం నిలదొక్కుకునేందుకు తన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు. వైకాపా పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని.. డబ్బుల్లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర పరిస్థితి వివరించినట్లు సీఎం తెలిపారు.
* విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతోందని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన.. గురువారం స్టీల్ ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అనేక మంది ఆధారపడి ఉన్నారన్నారు. దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. ప్లాంట్ మూతపడుతుందనే ఆందోళన వద్దన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు.
* పార్లమెంట్ సభ్యుడిగా.. కేంద్రమంత్రిగా ఉండి హైదరాబాద్ అభివృద్ధికి కిషన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్న ప్రభాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేసినట్లుగా, అభివృద్ధి కుంటుపడినట్లుగా కిషన్‌రెడ్డి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. గాంధీభవన్‌లో మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. కేంద్రం హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీ చేయలేదని, అమృత్ పథకం నుంచి ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతోనే రాజకీయ లబ్ధి కోసం హైదరాబాద్‌ను విమర్శిస్తున్నారని ఆక్షేపించారు.
* అందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకే రైతు భరోసా సదస్సులు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో రైతు భరోసా వర్క్‌షాప్ నిర్వహించారు. మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో రైతుభరోసా పథకం విధివిధానాలపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అన్నదాతల అభిప్రాయాల మేరకు ప్రభుత్వ నిర్ణయం ఉంటుందన్నారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి యోచిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చిన్న రైతుల కోసం పథకాల రూపకల్పనకు ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. ప్రజలతో చర్చించి పథకాలు అమలు చేయడమే లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
* ప్రజలు తమ సమస్యలను వాట్సప్ ద్వారా కాకుండా hello.lokesh@ap.gov.in మెయిల్‌కు పంపాలని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలపై వాట్సప్ మెసేజ్‌లు పంపుతుండడంతో మంత్రి వాట్సప్‌ను మాతృసంస్థ మెటా బ్లాక్ చేసింది. వేలాది మంది తమ సమస్యలను వాట్సప్ చెయ్యడం వల్ల సాంకేతిక సమస్యతో బ్లాక్ అయినట్లు నారా లోకేశ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. దీంతో hello.lokesh@ap.gov.in మెయిల్ ఐడీ ద్వారా ప్రజలు తనకు సమాచారం, సమస్యలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. తానే అందరి సమస్యలు నేరుగా చూస్తానని స్పష్టం చేశారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య-సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని సూచించారు. యువగళం పాదయాత్రలో నిర్వహించిన ‘హలో లోకేశ్’ కార్యక్రమం పేరుతోనే ఈ మెయిల్ ఐడీని లోకేశ్ క్రియేట్ చేసుకున్నారు.
* భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విహంగ వీక్షణం ద్వారా భోగాపురం విమానాశ్రయం ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘భోగాపురం వరకు బీచ్‌రోడ్ నిర్మాణం కూడా జరగాలి. పారిశ్రామికంగా ఎదిగేందుకు భోగాపురం ప్రాంతానికి మంచి అవకాశాలున్నాయి. నేను సీఎంగా ఉన్నప్పుడే అన్ని అనుమతులు వచ్చాయి. నేషనల్ హైవే నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీ పెంచాలి. గత ప్రభుత్వ వైఖరి వల్ల అన్నీ మళ్లీ మొదటి నుంచి చేయాల్సి వస్తోంది.
* అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించనున్న భారత వ్యోమగాములను కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు అమెరికా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ పేర్కొన్నారు. ‘అమెరికా ఇండిపెండెన్స్ డే’ సందర్భంగా ఐఎస్ఎస్ నుంచి దిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయానికి పంపిన సందేశంలో ఈ విషయం పేర్కొన్నారు.
* జమ్మూ-కశ్మీర్లో సైనిక వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడి(Kathua Attack)కి పాల్పడిన ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దీనికి ముందు ఉగ్రవాదులు స్థానికుల్ని బెదిరించినట్లు తెలుస్తోంది. వారి తలపై తుపాకీ గురిపెట్టి, తమ కోసం భోజనం తయారుచేయించుకున్నారని ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది. అలాగే దాడి సమయంలో ఉగ్రవాదులు బాడీ కెమెరాలు ధరించి ఉన్నారు. భద్రతా బలగాల నుంచి ఆయుధాల దోపిడీకి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాన్ని మన సైనికులు తిప్పికొట్టారు. గాయపడినా సరే వారికి మాత్రం ఆయుధాలను దక్కనివ్వలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఓ సైనికుడి చేతికి తీవ్రంగా గాయమైనప్పటికీ తన ఆయుధం జామ్ అయ్యేవరకు ఒక్క చేతితోనే కాల్పులు కొనసాగించడం గమనార్హం.
* ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీగా హరీశ్ కుమార్ గుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు.
జి.అనంతరాము- అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఆర్.పి. సిసోడియా- స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శిగా పోస్టింగ్
జి.జయలక్ష్మి- సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు
కాంతిలాల్ దండే- ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శిగా బదిలీ
సురేశ్ కుమార్- పెట్టుబడులు మౌలిక సదుపాయాల కార్యదర్శి
సురేశ్ కుమార్- గ్రామవార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలు
జీఏడీ కార్యదర్శిగానూ సురేశ్‌కు అదనపు బాధ్యతలు
సౌరభ్ గౌర్- ఐటీశాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా బాధ్యతలు
యువరాజ్- పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి
హర్షవర్ధన్- మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బాధ్యతలు
పి.భాస్కర్- వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కార్యదర్శి
పి.భాస్కర్- ఈడబ్ల్యూఎస్, జీఏడీ సర్వీసెస్ అదనపు బాధ్యతలు
కె.కన్నబాబు- సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి
గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గానూ బాధ్యతలు
వినయ్‌చంద్- పర్యాటకశాఖ కార్యదర్శిగా బదిలీ
వివేక్ యాదవ్- యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శి
సూర్యకుమారి- మహిళా, శిశుసంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ కార్యదర్శిగా బదిలీ
సి.శ్రీధర్- ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా బాధ్యతలు
జె.నివాస్- ఆర్థికశాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్
విజయరామరాజు- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్
హిమాంశు శుక్లా- సమాచార, పౌర సంబంధాలశాఖ డైరెక్టర్
ఢిల్లీరావు- వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్
వ్యవసాయశాఖ నుంచి హరికిరణ్ బదిలీ
గిరిజాశంకర్- ఆర్థికశాఖ నుంచి రిలీవ్
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z