రాష్ట్రంలోనే పామాయిల్ హబ్‌గా పేరుగాంచిన అశ్వారావుపేట ప్రాంతంలో క్రమంగా ఆ పంట ప్రాభవం మసకబారుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జన్యులోపంతో కూడిన మొక్కల పంపిణీ దగ్గర నుంచి మొదలుకొని.. దిగుబడుల తగ్గుదల, ధరల పతనం, ప్రభుత్వ పట్టింపులేనితనం వంటివన్నీ తమ పాలిట శాపాలుగా మారుతున్నట్లుగా కన్పిస్తోందని పామాయిల్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండడం ఇందుకు బలం చేకూరుస్తోంది. పామాయిల్ సాగుకు పేరుగాంచి ఇప్పటివరకూ విరాజిల్లుతున్న ప్రాంతం అశ్వారావుపేట. రాష్ట్రం మొత్తంలో సాగవుతున్న 2.03 లక్షల ఎకరాల్లో సుమారు లక్ష ఎకరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనివే. అందులోని అశ్వారావుపేట, దమ్మపేట పరిసర ప్రాంతాల్లోని నేలలు ఈ పంట సాగుకు యోగ్యంగా ఉండడం, స్థానికంగానే పరిశ్రమలు ఉండడం ఇక్కడి రైతులకు కలిసొచ్చే అంశం. అన్ని పంటలనూ తోసిరాజని గణనీయస్థాయిలో ఈ ప్రాంతంలో ఈ పంట సాగవుతోంది. దమ్మపేట మండలంలో మొత్తం 51 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే.. 35 వేల ఎకరాల్లోనూ, అశ్వారావుపేట మండలంలో 21 వేల ఎకరాల్లోనూ ఈ పంట సాగవుతోంది. ఈ పంటకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రభుత్వాలు ఈ పంటను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాయి. దేశ అవసరాల రీత్యా గణనీయస్థాయిలో కేంద్రంలో వివిధ దేశాల నుంచి పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ.. రాష్ట్రం నుంచి సుమారు రూ.600 కోట్ల విలువైన పామాయిల్‌ను ఉత్పత్తి చేసి కేంద్రానికి అందిస్తున్న ఘనత ఇక్కడి పామాయిల్ రైతులది.
పామాయిల్ సాగు ఎంతవేగంగా విస్తరిస్తుందో అంతే వేగంతో చీడపీడల బెడద కూడా పెరుగుతోంది. ఇంతుకుముందు వరకు ఎకరాకు సగటున 10-12 మెట్రిక్ టన్నుల మధ్య వచ్చే దిగుబడి.. ఇప్పుడు 5-7 మెట్రిక్ టన్నులకు పడిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు 2022 జూన్‌లో రూ.23,467 ఉన్న పామాయిల్ గెలల ధర 2024 నాటికి రూ.13,705కు పడిపోవడం రైతులను దెబ్బతీస్తోంది. పైగా పెరుగుతున్న సాగు ఖర్చులను.. ప్రస్తుత దిగుబడులను బేరీజు వేసినప్పుడు తాము మరింత నష్టాల్లోకి కూరుకుపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
కానీ.. ఇటీవల పామాయిల్ దిగుబడులు గణనీయంగా తగ్గాయి. వాతావరణ ప్రతికూల పరిస్థితులు, తెల్ల దోమలు వంటివి కారణాలని ఆయిల్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. ఈ కారణాలను రైతులు కొట్టిపారేస్తున్నారు. శాస్త్రవేత్తలు, ఉద్యానవన శాఖ అధికారులు వచ్చి కనీసం తమ పంటలను కూడా పరిశీలించడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా పంటకు తెల్లదోమ, గానోడర్మా, స్టమ్ రాట్, రైనోసార్ బీటల్(రెడ్ ఫామ్ ఈవిల్), సంచి పురుగు(బ్యాగ్ వార్మ్)లు ఆశిస్తుండడం.. నివారణకు ప్రభుత్వం మందులు సరఫరా చేయకపోవడం వంటివి కూడా దిగుబడుల తగ్గుదలకు కారణంగా ఉన్నాయి. అయితే, గతంలో విదేశాల నుంచి తెచ్చి ఇక్కడి రైతులకు ప్రభుత్వం సరఫరా చేసిన మొక్కల్లో అత్యధికంగా హాఫ్ టైప్(జన్యు లోపాలతో కూడిన) మొక్కలు కన్పిస్తున్నాయి. చెట్లు పెరిగి పంట దశకు చేరుకుంటున్న సమయంలో అవి జన్యు లోపంతో చనిపోతుడడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z