Food

గంజాయి అడ్డాగా ఖమ్మం!

గంజాయి అడ్డాగా ఖమ్మం!

గంజాయి స్మగ్లర్లు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) నుంచి సరకును దక్షిణాది రాష్ట్రాల్లోకి తరలించేందుకు తొలుత ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకి అడుగుపెడుతుండటంతో ఆబ్కారీ యంత్రాంగం నిఘా విస్తృతం చేసింది. వాస్తవానికి ఒడిశాలోని కోరాపుట్, మల్కాన్‌గిరితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలతో కూడిన ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి పెద్దఎత్తున సాగవుతోంది. తొలుత అక్కడి నుంచి భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ గుండా తమిళనాడు, కర్ణాటకలతోపాటు మహారాష్ట్రకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇలా తొలుత తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తున్న కారణంగా ఎక్సైజ్‌ అధికారులు ఆ ప్రాంతంలో నిఘా విస్తృతం చేశారు. ఈ ఏడాది జూన్‌ చివరి నాటికే 100 కేసుల్లో 1,533.26 కిలోల సరకును స్వాధీనం చేసుకున్నారు. గడిచిన నాలుగేళ్లతో పోల్చితే కేసుల నమోదు భారీగా పెరగడంతో గంజాయి రవాణా ఈ ప్రాంతంలో వేళ్లూనుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆబ్కారీ యంత్రాంగం దాడుల్లో బయటపడుతున్న కేసులే ఇన్ని ఉండగా.. రహస్యంగా తరలిపోతున్నవి మరింత ఎక్కువగా ఉంటాయనే వాదన వినిపిస్తోంది.

ఏవోబీలో శీలావతి పేరిట దొరికే గంజాయికి డిమాండ్‌ విపరీతంగా ఉంటోంది. దీనికితోడు మావోయిస్టుల సమస్య కారణంగా గంజాయి రవాణాపై నిఘా తక్కువగా ఉండటంతో స్మగ్లర్లు ఏజెన్సీ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. మరోవైపు తమిళనాడు, కేరళకు చెందిన స్మగ్లర్లు తెర వెనకుండి దందా నడిపిస్తున్నారు. ఎకరా సాగుకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెడుతున్నారు. దాన్ని విక్రయిస్తే రూ.7-10లక్షలు లభిస్తుండటంతో ఎన్నిసార్లు పట్టుకుంటున్నా దందా ఆగడం లేదు. మరోవైపు ఎక్సైజ్‌ సిబ్బంది కొరత వేధిస్తుండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఎక్సైజ్‌ జిల్లాల పరిధిలో 13 ఆబ్కారీ స్టేషన్లున్నాయి. ఒక్కో స్టేషన్‌లో సగటున 12 మంది సిబ్బందే ఉండటంతో వారితోనే సర్దుబాటు చేసుకుంటూ తనిఖీలు చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రత్యేక బృందాలను అక్కడ మోహరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z