Kids

గర్ల్‌ఫ్రెండ్ ఐఫోన్ కోసం తల్లి బంగారు నగల చోరీ చేసిన బాలుడు-CrimeNews-Aug 08 2024

గర్ల్‌ఫ్రెండ్ ఐఫోన్ కోసం తల్లి బంగారు నగల చోరీ చేసిన బాలుడు-CrimeNews-Aug 08 2024

* గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌ కొనివ్వాలనుకున్నాడు ఓ బాలుడు. దీని కోసం ఏకంగా అమ్మ నగలకే ఎసరు పెట్టాడు. ఆమె బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. ఈ ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తన ప్రియురాలి పుట్టినరోజు సందర్భంగా ఐఫోన్‌ బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాడు. డబ్బు కావాలని తల్లిని అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఇంట్లోని బంగారు ఆభరణాలను తస్కరించాడు. వాటిని అమ్మేశాడు. ఇంట్లోని బంగారం కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు బంగారు గొలుసులు, చెవి కమ్మలు, ఉంగరం కనిపించకుండా పోయాయని పేర్కొంది. గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని వాపోయింది. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు సమయంలో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే.. నేరం జరిగినప్పటినుంచి ఆ బాలుడు కనిపించకుండా పోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై అనుమానం పెరిగింది. బాలుడి స్నేహితులను విచారించగా.. అసలు విషయం బయటపడింది. ఇటీవలే రూ.50 వేలు ఖర్చు చేసి ఐఫోన్‌ కొనుగోలు చేశాడని మిత్రులు వెల్లడించారు. తన గర్ల్‌ఫ్రెండ్‌కి పుట్టిన రోజు బహుమతిగా ఇచ్చాడని తెలిపారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

* పల్నాడు జిల్లా కారంపూడిలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. స్థానిక (మోడల్‌ స్కూల్‌) ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రవికుమార్‌ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు రవికుమార్‌పై దాడి చేశారు. గురువు స్థానంలో ఉండి అసభ్యంగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల వసతి గృహంలోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తుంటే పాఠశాల సిబ్బంది, ప్రధానోపాధ్యాయుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే రవికుమార్‌ను విధుల నుంచి తొలగించాలని ఆందోళనకు దిగారు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు ఎంఈవో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు.

* విశాఖ నగరంలోని కంచరపాలెంకు చెందిన బాలుడి (17) హత్య కేసును పోలీసులు ఛేదించారు. 8 మందిని అరకు లోయ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గంజాయి వివాదమే ఈ హత్యకు కారణమని సీఐ సీహెచ్‌ రుద్రశేఖర్‌ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 30న బాలుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు డుంబ్రిగుడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ రుద్రశేఖర్‌ నేతృత్వంలో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసుకుని ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఈనెల 6న డుంబ్రిగుడ మండలం బొందుగుడ సమీపంలోని చెరువులో బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. గంజాయి కోసం మరో ముగ్గురు స్నేహితులతో కలిసి బాలుడు అరకు వచ్చినట్లు విచారణలో తేలింది. గతంలో స్థానికంగా ఉన్న కొంతమంది యువకులు వారికి పరిచయం ఉండడంతో నేరుగా వారి వద్దకు వెళ్లారు. గంజాయి కొనుగోలుకు తమ వద్ద డబ్బులు లేవని.. దానికి బదులుగా సెల్ ఫోన్లు ఇస్తామని చెప్పారు. మొబైళ్లను స్థానిక యువకులకు అందజేశారు. ఫోన్లు తీసుకున్న యువకులు గంజాయి ఇవ్వకుండా జాప్యం చేయడంతో ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఈ కొట్లాటలో ముగ్గురు స్నేహితులు అక్కడి నుంచి తప్పించుకోగా.. బాలుడిని స్థానిక యువకులు కొట్టి చంపి బొందుగుడ సమీపంలోని చెరువులో పడేశారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టి ఐదుగురు యువకులు, ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

* ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు మెగవత్ రంగా నాయక్, జటావత్ ఇమామ్ నాయక్, జటావత్ మౌలాన నాయక్, షేక్ జటావత్ వలీ నాయక్, కేతవత్ సునిల్ కుటుంబ సభ్యులు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఈ కుటుంబం ముఠాగా ఏర్పడ్డారు. ఇందుకోసం వ్యవసాయ పొలాల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి అందులోని కాపర్ కాయిల్స్, ఆయిల్ ను దొంగిలించి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా హైదరాబాద్ లోని పాత ఇనుము షాప్ లలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

* ఆసుపత్రి ముందు ఉన్న అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లాడు.. సీన్ కట్ చేస్తే.. అంబులెన్స్ యాక్సిడెంట్ అయ్యి అదే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఓ దొంగ.. ఈ షాకింగ్ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆరోగ్యం బాగాలేదని వచ్చాడు ఓ యువకుడు.. అంతలోనే బుద్ధి మారింది.. ఆరోగ్యం సంగతి ఏమో కానీ.. ఆసుపత్రి ముందు ఉన్న అంబులెన్స్ అతని కళ్ళలో బడింది.. ఆరోగ్యం తర్వాత అయినా చూపించుకోవచ్చు ముందుగా అంబులెన్స్ సంగతి చూద్దాం అనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా మెల్లిగా అంబులెన్స్ దగ్గరికి వెళ్లి లుక్కేశాడు.. ఆ తర్వాత ఎవ్వరూ చూడటం లేదని గమనించి.. అంబులెన్స్ తో అక్కడి నుంచి ఉడాయించాడు. సీన్ కట్ చేస్తే.. అంబులెన్స్ ఎత్తుకెళ్తున్న క్రమంలో హైదరాబాద్ రాజీవ్ రహదారిపై దుద్దెడ టోల్ గేట్ దగ్గరకు రాగానే అతడు దొంగిలించిన అంబులెన్స్ కు యాక్సిడెంట్ అయింది‌. దీనితో ఎక్కడ నుంచి బయలుదేరాడో మళ్లీ అక్కడికి పేషెంట్ లాగా వచ్చి జాయిన్ అయ్యాడు ఆ దొంగ. ఆ యువకుడి పేరు వల్లెపు అశోక్ అని.. పోలీసులు తెలిపారు. అంబులెన్స్ తీసుకొని తన అక్క దగ్గరికి పోతున్నానని.. ఇంతలో యాక్సిడెంట్ అయినట్లు తమకు సమాధానం చెప్పాడని పోలీసులు తెలిపారు. అశోక్ ది మద్దూర్ మండల రేపర్తి గ్రామంగా పోలీసులు గుర్తించారు. అతని తండ్రి పేరు పోశెట్టిగా పేర్కొన్నారు. ఏది ఏమైనా అంబులెన్స్ ను ఏ ఆసుపత్రి నుంచి దొంగలించాడో మళ్ళీ అదే ఆసుపత్రికి పేషెంట్ గా రావడంతో ఆసుపత్రి సిబ్బంది, పోలీసులే కాదు.. ఆ దొంగ కూడా ఆశ్చర్యానికి గురైయ్యాడు. ఈఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z