Sports

హమ్మయ్యా…హాకీలో కాంస్యం వచ్చింది-NewsRoundup-Aug 08 2024

హమ్మయ్యా…హాకీలో కాంస్యం వచ్చింది-NewsRoundup-Aug 08 2024

* పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌పై గెలుపొందింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్ (30వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్‌ చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్‌ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్‌ ఆరంభంలో (18వ నిమిషం) స్పెయిన్‌ ఆటగాడు మార్క్ మిరల్లెస్ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మార్చాడు. దీంతో ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. 29వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించింది. దానిని హర్మన్‌ప్రీత్‌ గోల్‌గా మలిచేందుకు ప్రయత్నించినా స్పెయిన్‌ గోల్‌కీపర్‌ అడ్డుకున్నాడు. వెంటనే మరో పెనాల్టీ కార్నర్‌ లభించగా భారత్‌ దానిని సద్వినియోగం చేసుకుంది. ఈ సారి హర్మన్‌ప్రీత్‌ ఎలాంటి పొరపాటు చేయకుండా బంతి గోల్‌ పోస్ట్‌లోకి పంపి స్కోరును 1-1తో సమం చేశాడు. మూడో క్వార్టర్‌ మొదలైన కాసేపటికే పెనాల్టీ కార్నర్‌తో హర్మన్‌ప్రీత్‌ మరో గోల్‌ చేశాడు. దీంతో భారత్‌ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత మూడు పెనాల్టీ కార్నర్‌లు సాధించిన ఇండియా వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. మ్యాచ్‌ మరో నిమిషంలో ముగుస్తుందనగా స్పెయిన్‌కు ఓ పెనాల్టీ కార్నర్‌ లభించింది. భారత్‌ దాన్ని సమర్థంగా అడ్డుకుంది.

* బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనంతరం షేక్‌ హసీనా తిరిగి స్వదేశానికి వస్తారని ఆమె తనయుడు సాజీబ్‌ వాజెద్‌ జాయ్‌ పేర్కొన్నారు. బంగ్లాకు తిరిగివచ్చిన తర్వాత క్రీయాశీల రాజకీయాల్లో ఉంటారా? లేదా? అన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తల్లి షేక్‌ హసీనా దేశం విడిచివెళ్లిపోయిన అనంతరం నెలకొన్న పరిణామాలపై పీటీఐ వార్త సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. దేశంలో కొనసాగుతున్న అనిశ్చితికి పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఆజ్యం పోస్తోందని ఆరోపించారు.

* ఉవ్వెత్తున కృష్ణవేణి తరంగాలు ఉరకలేస్తున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 3,10,088 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కాల్వల ద్వారా 13,768 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కాల్వల ద్వారా విడుదల చేసే వరదనీరు పూడిక ప్రభావంతో రోడ్లపైకి చేరుకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

* పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024) నుంచి అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్ వీడ్కోలు పలకడం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా ఆమెకు మద్దతు తెలుపుతూ పోస్టులు పెట్టారు. వినేశ్‌ చిన్ననాటి కోచ్‌, ఆమె పెద్దనాన్న మహవీర్‌ ఫొగాట్‌ స్పందించారు. వీడ్కోలు నిర్ణయంపై పునరాలోచన చేయాలని.. అవసరమైతే తాను కూర్చొని మాట్లాడతానని మహవీర్‌ వెల్లడించారు. ఫ్రీస్టైల్‌ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన వినేశ్‌పై అదనపు బరువు కారణంగా అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ‘‘రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఉదయం 5 గంటలకు చెప్పింది. పతకం సాధించేందుకు చేరువగా వచ్చి కోల్పోవడం మానసికంగా ఇబ్బందికి గురిచేసింది. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, రిటైర్‌మెంట్‌ నుంచి వెనక్కి రావాలని చెబుతున్నా. ఆమెతో కూర్చొని అర్థమయ్యేలా వివరిస్తా. మళ్లీ తీవ్రంగా సాధన చేస్తే విజేతగా నిలవడం పెద్ద కష్టం కాదు. ఎవరైనా సరే మెడల్‌కు దగ్గరగా వచ్చినప్పుడు ఈ ఆలోచనలే వస్తాయి. అయితే, కోపంగా ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు’’ అని మహవీర్‌ ఫొగాట్ వెల్లడించారు. అనర్హత వేటు పడిన వెంటనే వినేశ్‌కు మద్దతుగా మహవీర్‌ స్పందించారు. వచ్చే ఒలింపిక్స్‌కు సిద్ధం చేస్తానంటూ హామీనిచ్చారు.

* రాజ్‌తరుణ్‌కు (hero raj tarun) హైకోర్టులో ఊరట లభించింది. అతడికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి రాజ్‌తరుణ్‌పై నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తామిద్దరం కొన్నేళ్ల పాటు సహజీవనం చేశామని, ఆ తర్వాత రహస్య వివాహం చేసుకున్నామని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు వేరే మహిళతో సన్నిహితంగా ఉంటూ తనని పట్టించుకోవడం లేదని ఆరోపించింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్‌తరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో రాజ్‌ తరుణ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో న్యాయస్థానం అతడికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.20వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు రాజ్‌ తరుణ్‌ ఇటీవల ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరసామీ’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.

* ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi).. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Pinarayi Vijayan)ను కలిశారు. వయనాడ్‌ విపత్తుపై స్పందిస్తూ తన వంతు బాధ్యతగా రూ. కోటి చెక్కును సీఎంకు అందించారు. కాసేపు ఇద్దరూ పలు అంశాలపై మాట్లాడుకొన్నారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

* విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు ఎంతో ముఖ్యమన్న సంగతి మనందరికీ తెలిసిందే. విమానం ఎక్కేముందు పాస్ట్‌పోర్టు పత్రాల తనిఖీ కోసం కాస్త సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే అబుదాబిలోని షేక్‌ జాయెద్‌ ఇంటర్నెషనల్‌ విమానాశ్రయం (Zayed International Airport)లో కొత్త సాంకేతికతను అమల్లోకి తీసుకురానున్నారు. ప్రయాణికుల ముఖ కవళికలను గుర్తించగల టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా ఇకపై పాస్‌పోర్టు, ఐడీ కార్డు అవసరం ఉండదని తెలుస్తోంది. ప్రయాణానికి ముందు క్యూలో నిలబడి ప్రతి సెక్యూరిటీ గేటు వద్ద పత్రాలను తనిఖీ చేసే పని ఇక ఉండదు. దీనికి బదులు ఫేషియల్‌ స్కానర్‌ టెక్నాలజీని వినియోగిస్తారు. దీని ద్వారా సమయం ఆదా కానుంది. ఒక వేళ ఇది అమలైతే.. ఫేషియల్‌ ఫ్యూచరిస్టిక్‌ టెక్నాలజీని వినియోగించిన తొలి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా అవతరించనుంది.

* బంగ్లాదేశ్‌లో తీవ్ర సంక్షోభం కొనసాగుతున్న వేళ యూకే విదేశాంగ శాఖ కార్యదర్శి డేవిడ్ లామీతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఫోన్‌లో సంభాషించారు. ఈ విషయాన్ని ‘ఎక్స్‌’ ఖాతా వేదికగా వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా ప్రభుత్వం పతనం కావడం, ఇతర పరిణామాలపై లామీతో చర్చించినట్లు తెలిపారు. బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా యూకే ఆశ్రయం కోరారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఫోన్‌ సంభాషణ కీలకంగా మారింది. ఇదిలా ఉండగా.. ఇటీవల బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌లో తలదాచుకుంటున్న షేక్‌ హసీనా భవిష్యత్తు ప్రణాళిక ఏంటనే విషయంపై ఇప్పటివరకు ఇటు భారత్‌ గానీ, అటు యూకేగానీ స్పందించలేదు. ఆశ్రయం పొందేందుకు యూకేకు వెళ్లాలనుకొనే వ్యక్తులకు ప్రత్యేక అనుమతి ఇచ్చేందుకు తమ ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు అనుమతించడంలేదని యూకే హోం ఆఫీస్‌ వర్గాలు తెలిపినట్లు ‘పీటీఐ’వార్తా సంస్థ పేర్కొంది.

* మేడిగడ్డ ప్రాజెక్టుతోపాటు సుంకిశాల పాపం కూడా భారాసదేనని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆరోపించారు. ఆ నెపం వేరొకరి మీద వేయడం దారుణమని విమర్శించారు. నాసికరమైన కట్టడం, డిజైన్‌ లోపం కారణంగానే 2021లో భారాస హయాంలో చేపట్టిన సుంకిశాల రిటైనింగ్‌ వాల్‌ కూలిందన్నారు. భారాస కాలం నాటి ప్రాజెక్టు డిజైన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆరోపించారు. కూలిపోయే గోడలు కట్టి.. మరొకరిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వర్షాల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై హైదరాబాద్‌లోని టీజీఎస్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో భట్టి సమీక్షించారు. పదోన్నతులపై ఉద్యోగులతో చర్చిస్తామని తెలిపారు.

* పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024) రెజ్లింగ్‌ ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌ పతకం సాధిస్తుందని గంపెడంత ఆశతో ఎదురుచూసిన భారతీయులకు ‘అనర్హత’ రూపంలో షాక్‌ తగిలింది. ఈ క్లిష్ట సమయంలో ఆమెకు దేశమంతా అండగా నిలిచింది. హరియాణా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా (Bhupinder Singh Hooda) ఒక అడుగు ముందుకు వేసి, ఆమెను రాజ్యసభకు నామినేట్‌ చేయాలన్నారు. అలాగే ఆయన కుమారుడు దీపిందర్‌ సింగ్ హుడా కూడా ఇదే తరహాలో స్పందించారు. ‘‘ఫైనల్‌కు చేరిన వినేశ్‌ (Vinesh Phogat) ఆట నుంచి వైదొలగాల్సి వచ్చినప్పటికీ.. కోట్లాది మంది ప్రజల హృదయాలను గెల్చుకున్నారు. క్రీడా వ్యవస్థ ఓడిపోయింది. బంగారు పతక విజేతలకు ఇచ్చే సౌకర్యాలనే ఆమెకు కల్పించాలి. ధైర్యం, స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన ఆమే ఈ పదవికి తగిన వ్యక్తి’’ అని దీపిందర్ హుడా అన్నారు.

* యువ రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌ (Antim Panghal) ఆమె సోదరిని ఒలింపిక్‌ గేమ్స్‌ విలేజ్‌లోకి తన అక్రిడిటేషన్‌తో పంపించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో క్రమశిక్షణ రాహిత్యం కింద భారత ఒలింపిక్‌ సంఘం ఆమెపై చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై అంతిమ్‌ తొలిసారిగా స్పందించింది. తనను, తన సోదరిని అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయని, వాటిలో నిజం లేదని చెప్పింది. ఈ మేరకు ఓ మీడియా ఛానల్‌కు వెల్లడించింది. ‘‘నిన్న నాకేదీ కలిసి రాలేదు. పారిస్‌ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024) క్వార్టర్స్‌లో నా బౌట్‌ ఓడిపోయా. ఆ తర్వాత నుంచి నేను, నా సోదరి అరెస్టు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, అలాంటిదేమీ జరగలేదు. ఓటమి తర్వాత నాకు జ్వరం వచ్చింది. ఓపిక లేకపోవడంతో నా సోదరి హోటల్‌కు తీసుకెళ్తానంది. కోచ్‌ల అనుమతి తీసుకుని హోటల్‌కు వెళ్లిపోయాం. ఒలింపిక్‌ గ్రామంలో ఉన్న నా వస్తువుల్లో కొన్ని మాకు అవసరమయ్యాయి. నేను నిద్రపోయిన తర్వాత నా సోదరి అక్రిడిటేషన్‌ కార్డు తీసుకుని ఒలింపిక్‌ గ్రామానికి వెళ్లింది. వస్తువులను తీసుకెళ్లొచ్చా? అని అక్కడి అధికారులను అడిగింది. వాళ్లు ఆమె దగ్గరున్న అక్రిడిటేషన్‌ కార్డు తీసుకుని నా సోదరిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. వెరిఫికేషన్‌ కోసం మాత్రమే ఆమె స్టేషన్‌కు వెళ్లింది. మమ్మల్ని అరెస్టు చేయలేదు. కొంతసేపటి తర్వాత కార్డు ఇచ్చి ఆమెను పంపించారు’’ అని అంతిమ్‌ (Wrestler Antim Panghal)వివరించింది.

* తన అధికారానికి అడ్డం వస్తారని అనుమానిస్తే సొంత వారిని కూడా ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) వదిలిపెట్టరు. గతంలో సవతి సోదరుడిపైనే విషప్రయోగం చేయించిన ఆయన.. తాజాగా నానమ్మపైనే ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. ఆమెకు చెందిన పెద్ద రాజభవనాన్ని బుల్డోజర్లతో కూలగొట్టాడు. కిమ్‌ తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌ తొలి భార్య కుమారుడి వారసుడే కిమ్‌ జోంగ్‌ ఉన్‌. ఇక భార్య మరణంతో ఇల్‌ సంగ్‌ రెండో వివాహం చేసుకొన్నారు. ఆమె పేరు కిమ్‌ సంగ్‌ ఏ. వీరి సంతానానికి వారసత్వం అప్పగించేందుకు యత్నాలు జరిగినట్లు తెలియడంతో అంతఃపుర వైరం మొదలైంది.

* జపాన్‌(Japan)ను భారీ భూకంపం (earthquake) వణికించింది. గురువారం దక్షిణ తీర ప్రాంతంలో క్యుషు ద్వీపం సమీపంలో ఇది సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దాని తీవ్రత 7.1గా నమోదైందని జపాన్‌ వాతావరణ సంస్థ వెల్లడించింది. 30 కి.మీ. లోతులో భూకంప కేంద్రం నమోదైందని తెలిపింది. దాంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపకేంద్రం సమీపంలోని విమానాశ్రయం అద్దాలు దెబ్బతిన్నాయని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. క్యుషు ద్వీపంలోని నిచినాన్‌, మియాజాకి సమీపంలోని కొన్ని ప్రాంతాలపై భూకంపం ప్రభావం ఎక్కువగా కనిపించింది. 1.6 అడుగుల ఎత్తులో అలలు కనిపించినట్లు జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. అధికారులు నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నట్లు చీఫ్ క్యాబినెట్‌ సెక్రటరీ వెల్లడించారు. ప్రభావిత ప్రాంత ప్రజలు తీరానికి దూరంగా ఉండాలని సూచించారు. అలాగే క్యుషు, షికోకు ప్రాంతంలోని న్యూక్లియర్ రియాక్టర్లు సురక్షితంగానే ఉన్నాయని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ వెల్లడించింది. 2011లో సంభవించిన భూకంపం, సునామితో పుకుషిమా అణుకేంద్రం దెబ్బతింది. అప్పటి నుంచి ప్రకృతి ప్రకోపించినప్పుడల్లా ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతూ ఉంటుంది.

* 2023 జూన్‌లో అట్లాంటిక్‌ సముద్రంలో మునిగిపోయిన టైటాన్‌ (Titan) జలాంతర్గామి విషాదంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అందులో ప్రయాణిస్తున్నవారికి తాము చనిపోతామని కొద్దిసేపటిముందే తెలిసిపోయిందని తాజాగా దాఖలు చేసిన దావాలో పేర్కొన్నారు. అసలు టైటాన్‌ మినీ జలాంతర్గామికి ప్రయాణంలో సమస్యలు ఎదుర్కొన్న రికార్డు ఉందని వారి తరఫున అటార్నీ పేర్కొన్నారు. దీనికితోడు ఓషన్‌గేట్‌ సంస్థ కూడా సదరు మినీ జలాంతర్గామికి సంబంధించిన వాస్తవాలను, దాని సామర్థ్యాన్ని వెల్లడించకుండా దాచిపెట్టిందని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z