* కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈడుపుగల్లు గ్రామంలోని ఓ పాఠశాలలో పనిచేసే మండవ వెంకట శ్రీనివాస్ గత కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధిత విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ మురళీ కృష్ణ, ఎస్‌ఐ సందీప్‌లు విచారణ జరిపి నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
* దిల్లీలోని ఓ పాఠశాలలో అనూహ్య ఘటన జరిగింది. పదేళ్ల పిల్లాడు స్కూల్‌కు తుపాకి తీసుకురావడంతో తోటి విద్యార్థులు హడలిపోయారు. ఉపాధ్యాయులకు విషయం చెప్పగా వారు పిల్లాడి దగ్గరనుంచి తుపాకిని తీసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కుటుంబసభ్యులను విచారించగా అది చిన్నారి తండ్రికి చెందినదని, అతడు కొన్ని నెలలక్రితం మరణించాడని పేర్కొన్నారు. తుపాకిని స్వాధీనం చేసుకున్న పోలీసులు లైసెన్సును రద్దు చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు. కాగా ఇటీవల విద్యార్థులు పాఠశాలలకు తుపాకులను తీసుకువస్తున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఏడాది మేలో ఉత్తరప్రదేశ్‌లో ఓ పదేళ్ల చిన్నారి ఇంట్లో దొరికిన పిస్టల్‌తో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తన 16 ఏళ్ల సోదరిని కాల్చి చంపాడు.
* బద్లాపుర్ పాఠశాలలో మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై పాఠశాల స్వీపర్ లైంగిక దాడి చేసిన ఘటన మహారాష్ట్రను కుదిపేస్తోంది. దీనిపై ఓ వైపు నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ దారుణాన్ని మరువక ముందే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల చిన్నారిపై పాఠశాలలోని క్యాంటీన్ నడిపే వ్యక్తి లైంగిక దాడి చేసినట్లు బయటపడింది. వాసాయ్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. క్యాంటీన్‌కు వెళ్లేందుకు బాలిక నిరాకరించడంతో క్లాస్ టీచర్‌కు అనుమానం కలిగింది. దీనిపై ఆ చిన్నారిని బుజ్జగించి అడగ్గా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. క్యాంటీన్ అంకుల్ ఇబ్బంది పెడుతున్నట్లు ఆ బాలిక వెల్లడించింది. వెంటనే ఆ విషయాన్ని క్లాస్ టీచర్ స్కూల్ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేశారు. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తొలుత వారు విముఖత వ్యక్తం చేశారు. చివరకు ప్రిన్సిపల్‌నే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు. భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
* బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆమెతో పాటు మాజీ మంత్రులు, అనుచరులపై తాజాగా మరో నాలుగు హత్య కేసులు నమోదయ్యాయి. 2010లో బంగ్లాదేశ్ రైఫిల్స్ ఉన్నతాధికారి మరణానికి సంబంధించి కేసు నమోదైంది. దీంతో ఇప్పటివరకు హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 53కు చేరింది. బంగ్లాదేశ్‌లో రైఫిల్స్‌లో 2010లో డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా అబ్దుల్ రహీం ఉన్న సమయంలో అక్కడి ఫీల్‌ఖానాలో మారణహోమం సంభవించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రహీం.. అదే ఏడాది జులై 29న జైల్లో మరణించాడు. దీనిపై రహీం కుమారుడు అబ్దుల్ అజీజ్ తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌పై మాజీ ప్రధాని హసీనాపై అభియోగాలు మోపారు.
* ర్యాగింగ్ భూతానికి ముంబై టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్‌ఎస్)కి విద్యార్థి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించాడు.లక్నోకి చెందిన అనురాగ్ జైస్వాల్ ముంబై టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో హ్యూమన్ రిసోర్స్ కోర్స్‌లో చేరారు. ఈ తరుణంలో జైస్వాల్ తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జైస్వాల్ ప్రాథమికంగా ర్యాగింగ్ వల్లే ఆత్మహత్య చేకున్నాడని నిర్ధారించారు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో విద్యార్థి శుక్రవారం రాత్రి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆ పార్టీలో మొత్తం 150మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.పార్టీ జరిగిన మరుసటి రోజు ఉదయం అతని స్నేహితులు జైస్వాల్ రూమ్‌కి వెళ్లి చూడగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో గది తలుపు బద్దలు కొట్టి చూడగా రూములో విగతజీవిగా కనిపించాడు. అత్యవసర చికిత్స కోసం విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్ధి అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z