* బదిలీ అయ్యి పోస్టింగు లేకుండా వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులు రోజూ డీజీపీ కార్యాలయానికి వచ్చి సంతకాలు చేయాల్సి ఉండగా.. నలుగురైదుగురు మాత్రం రావడం లేదు. నిఘా విభాగం మాజీ అధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, సీఐడీ విభాగం మాజీ అధిపతి పీవీ సునీల్‌కుమార్‌లు కొన్ని రోజులు పాటు సెలవులో కొనసాగారు. ఆ తర్వాత నుంచి విధులకు గైర్హాజరవుతున్నారు. డీఐజీ విశాల్ గున్ని, ఎస్పీలు కేకేఎన్ అన్బురాజన్, తిరుమలేశ్వర్‌రెడ్డిలదీ ఇదే పరిస్థితి. వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారుల్లో 16 మంది డీజీపీ కార్యాలయానికి రాకుండా, ఇతరత్రా వ్యవహారాల్లో ఉంటున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో వారందర్నీ రోజూ ఉదయం 10 గంటలకు పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చి, సంతకం చేయాలని, సాయంత్రం పనివేళలు ముగిసే వరకూ కార్యాలయంలోనే ఉండాలని డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు ఇటీవల ఆదేశాలు చేసిన సంగతి తెలిసిందే.
* అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప2 :ది రూల్’ (Pushpa 2: The Rule). శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించిన కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 100 రోజుల్లో అనగా డిసెంబర్ 6న ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా చిత్రబృందం ఒక పోస్టర్ షేర్ చేసింది. ‘‘మరో వంద రోజుల్లో అతడి రూల్ చూడనున్నారు. అద్భుతమైన అనుభూతిని పొందేందుకు సిద్ధంగా ఉండండి’’ అని టీమ్ పేర్కొంది. దీనిపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘వెయిటింగ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.
* పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమలకు సంబంధించి రెండు నోట్స్‌ను కేంద్రం క్లియర్ చేసింది. కేంద్రం చర్యలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం కలుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఏర్పాటు చేశారు. పోలవరం విషయంలో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు. పోలవరానికి కేంద్రం పెండింగ్ నిధులు ఇవ్వాలి. కేంద్రం ఇవ్వలేదని ఎప్పుడూ పోలవరం పనులు ఆపలేదు.
* భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. కవిత వెంట కేటీఆర్, హరీశ్‌రావు, కుటుంబ సభ్యులు ఉన్నారు. దిల్లీ మద్యం విధానం కేసులో ఐదున్నర నెలలు తిహాడ్ జైలులో ఉన్న ఆమె మంగళవారం బెయిల్ మీద విడుదలైన విషయం తెలిసిందే. ఐదు నెలల తర్వాత హైదరాబాద్ చేరుకున్న కవితకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి.
* రాజస్థాన్ భాజపా (BJP) రాష్ట్ర ఇన్‌ఛార్జి, రాజ్యసభ సభ్యుడు రాధామోహన్ దాస్ అగర్వాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ (Congress) శ్రేణులు భగ్గుమంటున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడంపై అగర్వాల్ స్పందించారు. తనకు ఏదైనా హాని జరిగితే అందుకు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
* దేశంలో పలుచోట్ల ఇటీవల కాలుష్య తీవ్రత తగ్గినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2022లో కాలుష్య రేణువుల స్థాయి (Particulate Pollution) 19.3శాతం తగ్గినట్టు తాజా నివేదిక పేర్కొంది. తద్వారా దేశ పౌరుల సగటు ఆయుర్దాయం (Life Expectancy) ఏడాది పెరిగినట్లు అంచనా వేసింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో కాలుష్యం తగ్గినా.. అనేక ప్రాంతాల్లో వీటి కాలుష్య ముప్పు అధికంగానే ఉందని తెలిపింది. కాలుష్య (Pollution) తీవ్రతకు సంబంధించి ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్-2024’ను యూనివర్సిటీ ఆఫ్ షికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (EPIC) రూపొందించింది. 2021తో పోలిస్తే 2022లో భారత్‌లో పీఎం2.5 స్థాయిలు క్యుబిన్ మీటరుకు 9మైక్రోగ్రాములు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్‌లోని పలు జిల్లాల్లో కాలుష్య స్థాయిలు గణనీయంగా క్షీణించినట్లు పేర్కొంది. కాలుష్యం తగ్గినా.. భారత్‌లోని 42శాతం పౌరులు గాలి నాణ్యతా ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని తాజా నివేదిక వెల్లడించింది.
* మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఇటీవల 35 అడుగుల ఛత్రపతి శివాజీ (Chhatrapati Shivaji)విగ్రహం కూలడంపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) ఆవేదన వ్యక్తం చేశారు. లాతూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘శివాజీ మహారాజ్ మనందరి ఆరాధ్య దైవం. ఆయన విగ్రహం కూలినందుకు మహారాష్ట్రలోని 13కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా’’ అన్నారు.
* యుద్ధాలు, ఉగ్రవాదం, నక్సలిజం ఘటనల్లో మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే (Road Accidents) మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) పేర్కొన్నారు. దేశంలో ఏటా లక్షల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆయన.. రోడ్డు ఇంజినీరింగ్‌లో లోపాల కారణంగానూ అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్నారు. ఫిక్కీ (FICCI) రోడ్ సేఫ్టీ అవార్డ్స్, కాంక్లేవ్ 2024లో పాల్గొన్న గడ్కరీ ఈ విధంగా వ్యాఖ్యానించారు.
* జస్టిస్ హేమ కమిటీ నివేదికలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారందరి పేర్లను బయటపెట్టాలంటూ, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఎఫ్‌ఈఎఫ్‌కేఏ) దర్శకుల యూనియన్ డిమాండ్ చేసింది. ఈమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ‘అమ్మ’ తర్వాత అంత పేరు పొందిన సంస్థ ‘ఎఫ్‌ఇఎఫ్‌కెఏ’. ‘‘ప్రస్తుతం ఈ విషయం హైకోర్టులో ఉన్నందు వల్ల దీనిపై ఎక్కువగా స్పందించాలనుకోవడం లేదు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారి పేర్లను వెల్లడించాలి. ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్’ను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. సరైన దర్యాప్తు చేసి ఇలాంటి వాటికి పాల్పడిన వారిని శిక్షించాలి’’ అని ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ ‘ఎఫ్‌ఈఎఫ్‌కేఏ’ లో ఉన్న సభ్యులు నిందితులుగా ఉండి.. విచారణలో నిజం నిర్ధారణ అయితే వారి అరెస్టు విషయంలో యూనియన్ ఎలాంటి జోక్యం చేసుకోదని స్ఫష్టం చేసింది. ‘అమ్మ’ సభ్యులు రాజీనామా చేయడంతో.. ఇప్పటికైనా ఆ సంస్థలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది.
* నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, రైతుల నిరసనపై చేసిన వ్యాఖ్యలపై రైతు సంఘాలు మండిపడ్డాయి. ఆమె దిష్టి బొమ్మతో నిరసన చేసేందుకు ప్రయత్నించారు. (Kangana Ranaut’s Effigy) అయితే పోలీసులు ఆ దిష్టి బొమ్మను లాక్కోవడంతో ఇరు వర్గాల మధ్య పెనుగులాట జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. రైతులపై కంగనా రనౌత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ (లోఖిత్) జాయింట్ కిసాన్ మోర్చా సభ్యులు ఆమె దిష్టి బొమ్మతో నిరసన తెలిపి దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే కారు నుంచి బయటకు తీసిన దిష్టి బొమ్మను పోలీసులు లాక్కున్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు, పోలీసుల మధ్య పెనుగులాట జరిగింది.
* వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఏపీ కేబినెట్ రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పట్టాదారు పాసు పుస్తకాలపై మాజీ సీఎం జగన్ ఫొటో తొలగించి.. ప్రభుత్వ చిహ్నంతో కొత్తగా 21.86 లక్షల పాస్ పుస్తకాలను ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది. అలాగే గత ప్రభుత్వం 77 లక్షల సర్వేరాళ్లపై ముద్రించిన జగన్ బొమ్మలను చెరిపివేసి వినియోగించుకునేందుకు కూడా ఆమోదం తెలిపింది.
* ఢిల్లీ మద్యం కేసులో ఐదు నెలల క్రితం అరెస్టయ్యి మంగళవారం బెయిల్‌పై విడుదలైన కవిత ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు. సాయంత్రం 4:45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆమె తన నివాసానికి వెళ్లనున్నారు. అయితే తమ అభిమాన నాయకురాలు దాదాపు ఐదు నెలల తర్వాత తెలంగాణకు వస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు భారత జాగృతి భారీ ఏర్పాట్లు చేసింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z