* రాజకీయ అనిశ్చితితో సతమతమవుతోన్న పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో ఇంధన సంక్షోభం నానాటికీ తీవ్రమవుతోంది. ఇంధన కొరతను తీర్చుకునే క్రమంలో అప్పుల భారం తాత్కాలిక ప్రభుత్వం నెత్తిన నిప్పులకుంపటిగా మారింది. భారత్‌కు చెందిన అదానీ గ్రూప్ (Adani Group)నకు ఆ దేశం దాదాపు 500 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.4వేల కోట్ల) బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీనిపై తాజాగా ఆ సంస్థ బంగ్లా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఝార్ఖండ్‌లో అదానీ పవర్‌కు చెందిన గొడ్డా ప్లాంట్ నుంచి మొత్తం విద్యుత్ ఉత్పత్తిని బంగ్లాదేశ్‌కు సరఫరా చేసేందుకు ఒప్పందం జరిగింది. 2017లో అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డుతో అదానీ గ్రూప్ (Adani Group) 25 ఏళ్లకు అగ్రిమెంట్ చేసుకుంది. ఈ ఒప్పందం కింద ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే 1496 మెగావాట్ల విద్యుత్‌ను బంగ్లాదేశ్‌కు సరఫరా (Power Supply) చేస్తున్నారు. బంగ్లాదేశ్ విద్యుత్ డిమాండ్‌లో ఇది 10 శాతానికి సమానం. 2023 జూన్‌లో ఈ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి మొదలవగా.. అప్పటినుంచి బంగ్లాదేశ్‌కు సరఫరా చేస్తున్నాయి.
* ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ (Apple) అతి పెద్ద ఈవెంట్‌కు సిద్ధమైంది. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా లాంచ్ ఈవెంట్ నిర్వహించనుంది. ‘గ్లోటైమ్’ పేరిట ఈ రాత్రి (సెప్టెంబర్ 9న) ఈ కార్యక్రమం జరగనుంది. యాపిల్ పార్క్‌లో స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో పలు ఉత్పత్తులను లాంచ్ చేయనున్నారు. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.30 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షించొచ్చు. యాపిల్ వెబ్‌సైట్ లేదా యూట్యూబ్ ద్వారా లైవ్‌లో వీక్షించొచ్చు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. తర్వాత కోలుకున్నాయి. ఐసీఐసీఐ, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హిందుస్థాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్ వంటి అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్‌లో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. మరోవైపు అమెరికాలో ఆగస్టు నెలకు సంబంధించి జాబ్ డేటా నిరుత్సాహంగా ఉండడం, చైనా వృద్ధిపై ఆందోళనలు ఆసియా మార్కెట్ల నష్టాలకు కారణమయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 80,973.75 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,183.93) వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఉదయం కాసేపటి వరకు నష్టాల్లో కొనసాగింది. తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఇంట్రాడేలో 80,895.05 – 81,653.36 పాయింట్ల మధ్య కదలాడిన సూచీ.. చివరికి 375.61 పాయింట్ల లాభంతో 81,559.54 వద్ద ముగిసింది. నిఫ్టీ 84.25 పాయింట్ల లాభంతో 24,936.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.95గా ఉంది.
* దేశీయంగా మరో ఎలక్ట్రిక్ వాహన సంస్థ పబ్లిక్ ఇష్యూకు (IPO) రాబోతోంది. హీరో మోటోకార్ప్ మద్దతు కలిగిన ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy IPO) ఐపీఓకు సిద్ధమైంది. ఈ మేరకు సెబీకి ఐపీఓ పత్రాలను సోమవారం సమర్పించింది. ఐపీఓలో భాగంగా రూ.3,100 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ప్రమోటర్లు 2.2 ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఆఫర్ ఫర్ సేల్‌లో భాగంగా ప్రమోటర్లయిన తరుణ్ సంజయ్ మెహతా, స్వప్నిల్ బబన్‌లాల్ జైన్ 10 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ప్రమోటర్లతో పాటు కలాడియం ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్, నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 2, 2 స్టేట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐఐటీఎం ఇంక్యుబేషన్ సెల్ అండ్ ఐఐటీఎంఎస్ రూరల్ టెక్నాలజీ అండ్ బిజినెస్ ఇంక్యుబేటర్ సంస్థలూ వాటాలను విక్రయిస్తున్నాయి.
* భారత్‌లో గత కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్‌జీ వాహనాలపై వాహనదారులు మక్కువ చూపుతున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఈవీ, సీఎన్‌జీ ఆటోమోటివ్ పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన పెట్రోల్, డీజిల్ వాహనాలపై వైఖరిని స్పష్టం చేశారు. తాను పెట్రోల్, డీజిల్ వాహనాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 64వ ఏసీఎంఏ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీ మార్చేందుకు తప్పనిసరి చేయనప్పటికీ.. మార్కెట్ శక్తులు మార్పును నడిపిస్తాయన్నారు. బజాజ్ ఫ్రీడమ్ 125 ఉదహరిస్తూ.. బైక్ సీఎన్‌జీతో నడుస్తుందని.. పెట్రోల్‌తో నడిచే మోడల్స్‌తో పోలిస్తే 40శాతం పొదుపు చేయవచ్చన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు 60శాతం వరకు ఎక్కువ ఖర్చు కూడుకున్నవని.. ఈ ఖర్చు ప్రయోజనాలు చివరికి వాహన తయారీదారులు తమ స్వచ్ఛమైన ఇంధన వాహనాలను అందించేలా చేస్తాయన్నారు. భారతదేశ వాయు కాలుష్యంలో 40శాతం రవాణారంగం ద్వారానే ఉత్పత్తమవుతోందని.. అయితే, ఆ శాఖకు తాను మంత్రిగా బాధ్యత వహిస్తున్నానని.. అది మంచిదేనా? అంటూ ప్రశ్నించారు. నైతికత, ఆర్థిక వ్యవస్థ, జీవావరణ శాస్త్రం, పర్యావరణం సమాజానికి పునాది అన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z