Health

కలకత్తా ఆసుపత్రి నిందితుడిపై మరో అభియోగం-CrimeNews-Sep 15 2024

కలకత్తా ఆసుపత్రి నిందితుడిపై మరో అభియోగం-CrimeNews-Sep 15 2024

* కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన మరువక ముందే నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరో దారుణం వెలుగుచూసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడికి తోడుగా కోల్‌కతా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చైల్డ్ హెల్త్ ‌(ICH) చిల్డ్రన్స్‌ వార్డులో నిద్రిస్తున్న మహిళపై నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడిని హాస్పిటల్‌లో వార్డ్‌ బాయ్‌గా పనిచేస్తున్న తనయ్‌ పాల్‌ (26)గా గుర్తించారు. చిల్డ్రన్స్‌ వార్డ్‌లోకి ప్రవేశించిన తనయ్‌ పాల్‌ మహిళను అభ్యంతరకరంగా తాకాడు. ఈ ఘటనను నిందితుడు తన మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోన్‌ను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపారు. ఆపై నిందితుడిని స్ధానిక కోర్టులో హాజరు పరచగా నిందితుడిని కోర్టు పోలీస్‌ కస్టడీకి ఆదేశించింది. ఇక పశ్చిమ బెంగాల్‌లోని బీర్భం జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న నర్స్‌ను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేయగా అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ రోగికి నర్సు సెలైన్‌ ఎక్కిస్తుండగా రోగి ఆమెను అభ్యంతరకరంగా తాకాడు. తన పట్ల అసభ్యంగా వ్యవహరించడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

* పల్నాడు (Palnadu District) జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద నెల్లూరు నుంచి కాకినాడకు వెళ్తుండగా కారు పంక్చర్‌ అయ్యింది. టైరు మారుస్తుండగా గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీ కొంది. ఈ ప్రమాదంలో నిడమర్రుకు చెందిన ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరిస్తున్నారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

* సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే సెంటింగ్‌ యార్డులో శనివారం ఓ యువకుడు రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దిగుతుండగా విద్యుత్‌ హై టెన్షన్‌ వైర్లు తగిలి షాక్‌తో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌కు స‌మాచారం ఇచ్చారు. 108 అంబులెన్స్‌లో ఎంజీఎంకు త‌ర‌లించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ గాంధీనగర్‌కు చెందిన పస్తం రాజు (18) తన తల్లి, కుటుంబ సభ్యులతో కలిసి కడిపికొండ చర్చిలో జరుగుతున్న క్రైస్తవ ఉత్సవాలకు వచ్చాడు. ప్రార్థనలు జరుగుతుండగా కొందరు పిల్లలతో కలిసి రాజు రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దింగేందుకు రాంనగర్‌ సమీపంలోని సెంటింగ్‌ యార్డుకు వెళ్లాడు. యార్డులో ఆగి ఉన్న గూడ్స్‌ రైలు బోగీ ఎక్కి సెల్ఫీ ఫొటో దిగుతుండగా, ఒక్కసారిగా హై టెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తగిలి షాక్‌ గురయ్యాడు. శరీరం కాలి కింద పడిపోయాడు. స్థానికులు 108 వాహనంలో ఎంజీఎం దవాఖానలో చేర్పించారు. తీవ్రంగా గాయపడిన రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

* జిల్లాలోని ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి వాసుపల్లి అప్పయ్యమ్మకు చెందిన ఓ బోటులో ఐదుగురు మత్స్యకారులు వేటకు బయలుదేరి వెళ్లారు. తీరానికి 35 మైళ్ల దూరంలో వెళ్లగానే బోటులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజిన్‌ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి బోటు పూర్తిగా దగ్ధమైంది. బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకారు. ఇది గమనించిన కోస్ట్‌గార్డు సిబ్బంది వారిని రక్షించి మరో బోటులో ఎక్కించి తీరానికి చేర్చారు. ప్రమాదానికి గురైన బోటు విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.

* సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా కొందరు మాత్రం అంధ విశ్వాసాలతో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుంట పీఎస్‌ పరిధిలోని ఇట్కల్‌లో చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో గ్రామస్థులు ఐదుగురిని హత్య చేశారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చేతబడి వల్ల తమ కుటుంబాల్లో వ్యక్తులు అనారోగ్యానికి గురయ్యరని, అందుకే వారిని హత్య చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి దర్యాప్తు చేస్తున్నారు.

* తిరుమల వస్త్రాలంకార సేవ పేరుతో భక్తులను దళారి మోసగించిన ఘటన తిరుమలలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా పట్టాభిపురానికి చెందిన భక్తులను అతడు మోసం చేశాడు. వస్త్రాలంకార సేవ పేరుతో రూ. 7లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం వారి నుంచి రూ. 4లక్షల వసూలు చేశాడు. దీంతో దళారిపై తిరుమల రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z