* కాళేశ్వరం నిర్మాణానికి రూ.93వేల కోట్లు ఖర్చయితే.. రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన మల్లన్న సాగర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాళేశ్వరం కొట్టుకుపోయిందని కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెట్టారని.. కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన్నసాగర్‌లోకి నీళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కాళేశ్వరం జలాలతో మల్లన్నసాగర్ నిండు కుండలా ఉందన్నారు. భారాసది వాటర్ డైవర్ట్ పాలిటిక్స్ అయితే.. కాంగ్రెస్‌ది అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ ఎద్దేవా చేశారు.
* దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిపై శుక్రవారం సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత రికార్డుల ప్రకారం ఎఫ్టీఎల్ పరిధి 65 ఎకరాలుగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణను సోమవారానికి వాయిదా వేసిన సీజే ధర్మాసనం.. దీనిపై వివరణ ఇవ్వాలని రెవన్యూ, నీటిపారుదలశాఖ, హెచ్ఎండీఏకు నం నోటీసులు జారీ చేసింది.
* 2024గానూ ఏయన్నార్ జాతీయ అవార్డు (ANR National Award)ను చిరంజీవి (Chiranjeevi)కి ఇవ్వనున్నట్టు నాగార్జున (Nagarjuna) ప్రకటించారు. అక్టోబరు 28న పురస్కారం ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఆ వేడుకకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని ఆర్కే సినీ ప్లెక్స్‌లో నిర్వహించిన వేడుకలో నాగార్జున మాట్లాడారు. ఏయన్నార్ నవ్వుతూ తమకు జీవిత పాఠాలు నేర్పించారన్నారు. ఈ వేడుకలో అక్కినేని కుటుంబ సభ్యులు, దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ‘‘నాన్న పేరు తలచుకుంటే మాకు చిరునవ్వు వస్తుంది. ఆయన నటించిన చిత్రాలు మళ్లీ మీ ముందుకొస్తున్నాయి. నవంబరులో నిర్వహించనున్న ‘ఇఫి’ వేడుకలో నాన్న సినీ ప్రయాణంపై వీడియో ప్రదర్శించనున్నారు. నాన్నతో పాటు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు రాజ్ కపూర్ తదితరులపైనా స్పెషల్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. చాలామంది అభిమానులు రక్తదానం చేయడం, ఆశ్రమాల్లో వృద్ధులకు భోజనం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మీ ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేనిది. అవార్డు ఇవ్వనున్నామని చిరంజీవికి చెప్పగానే ఆయన ఎమోషనల్ అయ్యారు. దీనికంటే పెద్ద అవార్డు లేదన్నారు’’ అని పేర్కొన్నారు.
* ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సమావేశాలకు, కార్యక్రమాలకు హాజరయ్యే అతిథులకు లేపాక్షి కళాకృతులను మాత్రమే జ్ఞాపికలుగా ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృతులను ఆయన పరిశీలించారు. మంగళగిరిలోని పవన్ నివాసానికి లేపాక్షి ప్రతినిధులు కొన్ని కళాకృతులను తీసుకుని వచ్చారు. శ్రీకాళహస్తి పెన్ను, కలంకారీ వస్త్రాలు, నరసాపురం లేసు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలతో చేసి దశావతారాలు, ధర్మవరం తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ జ్ఞాపికలు, చిత్తూరు కొయ్య కళాకృతులు, సవర గిరిజనులు వేసిన చిత్రాలు, రత్నం పెన్నులు, దుర్గి రాతి బొమ్మలు, అరకు కాఫీ, మంగళగిరి శాలువాలన్నీ వీటిలో ఉన్నాయి. వాటిలో ఎంపిక చేసిన వాటికి గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్ర, అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని పవన్ సూచించారు.
* అగ్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకొని చిరంజీవి ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. ఏయన్నార్ అద్భుతమైన నటుడని కొనియాడారు. ఆయనతో కలిసి వర్క్ చేసిన రోజులను ఎప్పటికీ మర్చిపోనని తెలిపారు. ‘‘అద్భుతమైన నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావును శత జయంతి సందర్భంగా స్మరించుకుందాం. ఆయన ఒక నటనా మేధావి. అద్భుతమైన పాత్రలతో ఆయన ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉంటారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ‘మెకానిక్ అల్లుడు’ కోసం ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం నాకు కలిగింది. అందుకు నేను ఎంతో ఆనందించాను. ఆ క్షణాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా’’ అని చిరంజీవి పేర్కొన్నారు.
* పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా ప్రతి దాడికి దిగింది. ఆ దేశంపైకి తాజాగా 140 రాకెట్లు ప్రయోగించింది. ఇజ్రాయెల్ హద్దుమీరిందని, ప్రతి దాడి ఉంటుందంటూ హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా పేర్కొన్న వేళ ఈ రాకెట్లు ప్రయోగించడం గమనార్హం. ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు మిలటరీ బ్యారెక్స్‌పై ఈ దాడులు జరిపినట్లు హెజ్బొల్లా పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతిగా రాకెట్లతో దాడులకు పాల్పడినట్లు తెలిపింది. లెబనాన్ సరిహద్దుల నుంచి మూడు దఫాలుగా రాకెట్లు దూసుకొచ్చిన విషయాన్ని ఇజ్రాయెల్ మిలటరీ సైతం ధ్రువీకరించింది. నష్టం వివరాలు మాత్రం తెలియరాలేదు. నిన్న మొన్నటివరకు పాలస్తీనాలోని హమాస్‌పై దృష్టి పెట్టిన ఇజ్రాయెల్.. ఇప్పుడు హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్ అట్టుడికిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ కుట్ర ఉందనేది హెజ్బొల్లా వాదన. ఈ క్రమంలోనే దక్షిణ లెబనాన్‌పై గురువారం ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడగా.. నేడు హెజ్బొల్లా ప్రతీకార దాడికి దిగడం గమనార్హం.
* కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టల రీసెర్చ్ ఒకవైపు కొనసాగుతుండగానే మరొకవైపు నిర్మాణం కూడా జరిగిందని ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీ ఇంజినీర్లు తెలిపారు. శుక్రవారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట తెలంగాణ ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీ అధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు. గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మూడు బ్యారేజీల నిర్మాణానికి ముందు మోడల్ స్టడీస్ చేశారా లేదా అని రీసెర్చ్ ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించింది. నిర్మాణానికి ముందు, మధ్యలో, తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్లు రీసెర్చ్ ఇంజినీర్లు చెప్పారు. మోడల్ స్టడీస్ పూర్తికాకముందే నిర్మాణం చేపట్టారని, నీటిని భారీగా నిల్వ చేయడం కారణంగానే మేడిగడ్డతో పాటు ఇతర ఆనకట్టల్లో సమస్యలు వచ్చాయని వారు పేర్కొన్నారు. వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకపోవడం వల్ల సమస్యలు వచ్చాయన్నారు. మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్‌లో మార్పులు, సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. బ్యారేజీల్లో సమస్యలు, మోడల్ స్టడీస్‌కు సంబంధం లేదని వివరించారు.
* తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న వేళ తితిదే ఈవో శ్యామలరావు స్పందించారు. ‘‘శ్రీవారి లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. నాణ్యతపై పోటు సిబ్బందితో మాట్లాడాను. వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డూ నాణ్యతగా ఉండాలంటే.. నెయ్యి నాణ్యంగా ఉండాలని చెప్పారు. నెయ్యి నాసిరకంగా ఉందని గుత్తేదారుకు చెప్పాం. నెయ్యిలో నాణ్యతా లోపాన్ని నేను కూడా గమనించాను. నెయ్యి నాణ్యత నిర్ధరణకు తితిదేకు సొంత ప్రయోగశాల లేదు. నెయ్యి నాణ్యతపై అధికారులు గతంలో పరీక్షలు చేయలేదు. నాణ్యత నిర్ధరణ కోసం బయట ల్యాబ్స్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి. రూ.411కే కిలో నెయ్యి సరఫరా చేశారు. నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరు. మేం హెచ్చరించిన తర్వాత గుత్తేదారులు నాణ్యత పెంచారు’’ అని ఈవో తెలిపారు.
* హిట్ కొట్టే వరకూ అభిమానుల ముందుకు రానని తన కుమారుడు, నటుడు అఖిల్ (Akhil) చెప్పినట్టు నాగార్జున (Nagarjuna) తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి (anr 100th birthday celebrations) సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ఓ వేడుకలో ఆయన మాట్లాడారు. ఆ ఈవెంట్‌కు అఖిల్ హాజరు కాకపోవడంతో ఫ్యాన్స్ ఆయన గురించి అడగ్గా.. నాగార్జున స్పందించారు. అభిమానులను అడిగినట్టు చెప్పమన్నాడని నాగార్జున పేర్కొన్నారు. అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మీ అందరి ఆశీస్సుల వల్లే మేమంతా ఇలా ఉన్నాం. నాన్న జయంతిని సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ థ్యాంక్స్. పలువురు రక్తదానం చేశారు. అంత ప్రేమ చూపిస్తున్నందుకు ఆనందంగా ఉంది. పండగలాంటి వాతావరణం చూస్తుంటే నాన్న ఉండి ఉంటే బాగుండేది అనిపిస్తోంది. నాన్న నటించిన కొన్ని చిత్రాలను మళ్లీ మీ ముందుకు తీసుకొచ్చాం. వాటిని ఉచితంగా చూడొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లతోపాటు పీవీఆర్లోనూ ప్రదర్శిస్తున్నాం. ఉచితంగా చూడొచ్చు’’ అని తెలిపారు.
* తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఇది క్షమించరాని నేరమని.. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై దుమారం చెలరేగిన వేళ.. సీఎం చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ రాశారు. ‘‘ఈ వ్యవహారం శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందుల మనోభావాలను తీవ్రంగా కలచివేస్తోంది. తిరుమల పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు. ఎర్రచందనం కొల్లగొడుతూ ఏడు కొండలవాడిని రెండు కొండలకే పరిమితం చేశారని చెప్పినా స్పందించలేదు. జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదంలో వినియోగించారని మీరు చేసిన వ్యాఖ్యలతో కల్తీ నిజమేనని యావత్ హిందూ సమాజం భావిస్తోంది. ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించడం అత్యంత నీచం. దీన్ని హిందూ ధర్మంపై జరిగిన భారీ కుట్రగానే భావిస్తున్నాం. లడ్డూ ప్రాముఖ్యతను తగ్గించేందుకు తితిదేపై కోట్ల మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకు ఈ కుట్ర చేశారు.. క్షమించరాని నేరానికి ఒడిగట్టారు’’
* తిరుమల శ్రీవారి లడ్డూలో నాసిరకం నెయ్యి వాడినట్లు తేలిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రసాదంలో పంది, చేప కొవ్వు వాడినట్లు తేలిందన్నారు. నెయ్యి సరఫరాను రెగ్యులర్ కాంట్రాక్టర్‌కు కాకుండా కొత్త వాళ్లకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం ఇంత దారుణానికి ఒడిగడుతుందని అనుకోలేదన్నారు. కల్తీ నెయ్యి వాడిన వాళ్లను దేవుడు కూడా క్షమించడని పేర్కొన్నారు. వెంటనే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. దేవుడికి అన్యాయం జరిగిందని.. ఏ పార్టీ అయినా విచారణ జరగాల్సిందేనని చెప్పారు.
* వియత్నాం- ఏపీల మధ్య పర్యాటక, సాంస్కృతి సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో విజయవాడలో కాన్క్లేవ్ నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, వియత్నాం అంబాసిడర్ ఎంగ్యూయేన్ థాన్హయ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రంలోని పర్యటక ప్రదేశాలు, ఇక్కడి పర్యటక రంగ అవకాశాల గురించి మంత్రి వారికి వివరించారు.
* బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీపై తప్పుడు కేసు పెట్టిన వ్యవహారంలో వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ (Kukkala Vidyasagar) ను పోలీసులు అరెస్టు చేశారు. జత్వానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో వేరే రాష్ట్రంలో ఉన్న విద్యాసాగర్‌ను అరెస్టు చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు విద్యాసాగర్ తన స్నేహితుడి మొబైల్ వినియోగించారు. అయినా, సాంకేతికత సాయంతో నిందితుడిని పట్టుకున్నారు.
* వైకాపా పాలనలో వేధింపులకు గురైన మహిళలు మీడియా ఎదుటకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైకాపాకు చెందిన కౌన్సిలర్ ఒకరు తనను అనేకసార్లు లైంగికంగా వేధించాడని, చెప్పుతో కూడా కొట్టాడని ఓ బాధిత మహిళ మీడియా ఎదుట ఆరోపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన ఓ మహిళ వాలంటీర్‌గా పనిచేసేది. ఆ సమయంలో ఆమె భర్త అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో భర్త వైద్య ఖర్చుల కోసం.. అదే పట్టణానికి చెందిన కౌన్సిలర్ హైదద్ వద్ద బంగారాన్ని తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ డబ్బు చెల్లిస్తానని, తన బంగారం తిరిగివ్వాలని హైదర్‌ను కోరింది. హైదర్.. ఆ బంగారాన్ని ఆమెకు తిరిగి ఇవ్వకపోగా అసభ్య పదజాలంతో దూషించాడని, తన పిల్లలను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు బాధిత మహిళ తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z