Fashion

గడ్డం వద్దంటూ అమ్మాయిల ర్యాలీ-NewsRoundup-Oct 19 2024

గడ్డం వద్దంటూ అమ్మాయిల ర్యాలీ-NewsRoundup-Oct 19 2024

* మియాపూర్‌లో చిరుత పులి సంచారం అంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. స్థానిక మెట్రో స్టేషన్‌ వద్ద చిరుత సంచరిస్తోందని శుక్రవారం నుంచి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్‌ అయింది. దీంతో ఇవాళ ఉదయం అటవీశాఖ అధికారులు మెట్రో స్టేషన్‌ సమీపంలోని నడిగడ్డ తండా వద్దకు చేరుకుని ఆ ప్రాంతమంతా పరిశీలించారు. పాదముద్రలు గుర్తించి… ఆ ప్రాంతంలో సంచరించింది అడవి పిల్లి అని నిర్ధరించారు. ఈ ప్రాంతంలో చిరుత ఆనవాళ్లు లేవని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని సూచించారు.

* విజయవాడ కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వైకాపా నేత రూ.లక్షల్లో వసూలు చేసి మోసం చేశారంటూ కొందరు మహిళలు భవానీపురం పోలీసులను ఆశ్రయించారు. వైఎస్సార్‌ కాలనీకి చెందిన వైకాపా నేత ఏసు, భవానీపురానికి చెందిన కిషోర్.. మహిళలకు కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. పెద్ద పెద్ద లాయర్లు పరిచయం ఉన్నారంటూ మహిళల నుంచి రూ.10 లక్షలకు పైగా వసూలు చేశారు. ఉద్యోగాలు ఇప్పించడంలో జాప్యం జరుగుతుండటంతో అనుమానం వచ్చిన మహిళలు సదరు వ్యక్తులను నిలదీయగా వారు బెదిరింపులకు పాల్పడ్డారు. మోసపోయామని గ్రహించిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

* విశాఖ శారదాపీఠానికి ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠానికి భీమిలి మండలం కొత్తవలసలో 15 ఎకరాలు గత వైకాపా ప్రభుత్వం కట్టబెట్టింది. ఎకరా రూ.లక్ష చొప్పున రూ.15 లక్షలకు అప్పగించేశారు. బహిరంగ మార్కెట్‌లో అక్కడ ఎకరా రూ.15 కోట్లుంది. అంతటి విలువైన స్థలాన్ని తక్కువకు ఇచ్చి ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర నష్టం కలిగించేలా నాటి ప్రభుత్వం వ్యవహరించింది. కూటమి ప్రభుత్వ వచ్చాక ఈ స్థలంపై దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా అనుమతులను రద్దు చేసింది. తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం చేపట్టిన నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని తితిదేను ఆదేశించింది.

* త్వరలో ఝార్ఖండ్‌లో (Jharkhand) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాంచీలో ఏర్పాటు చేసిన ‘సంవిధాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌’ సభలో కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివాసీల గురించి బోధించడంలో మన విద్యావ్యవస్థ విఫలమైందని వ్యాఖ్యానించారు.

* జనసేనలో చేరికలు తమపై విశ్వాసాన్ని మరింత పెంచాయని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ముద్రగడ క్రాంతి, గుంటూరుకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు, నలుగురు జగ్గయ్యపేట మున్సిపల్‌ కౌన్సిలర్లు పవన్‌ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ.. సామినేని ఉదయభానుపై నమ్మకం ఉంచి ఎన్టీఆర్‌ జిల్లా బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు.

* ‘ఫన్‌లు, టర్న్‌లకు లిమిట్‌ లేదు’ అంటూ మొదలైన బిగ్‌బాస్‌ సీజన్‌-8 (Bigg Boss Telugu) ఆసక్తికరంగా సాగుతోంది. ఇక వీకెండ్‌ ఎపిసోడ్‌ కోసం అటు హౌస్‌మేట్స్‌, ఇటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. వ్యాఖ్యాత నాగార్జున (Nagarjuna) ఎలాంటి ఫీడ్‌ బ్యాక్ ఇస్తారా? అని కంటెస్టెంట్స్‌ ఆందోళన పడుతూ ఉంటారు. ఈ వారం ఆ తరుణం రానే వచ్చింది. గత వారం రోజులుగా హౌస్‌లో జరిగిన పరిణామాలపై నాగార్జున మాట్లాడారు. టాస్క్‌లో భాగంగా హెయిర్‌ కట్‌ చేయించుకున్న అవినాష్‌ను మెచ్చుకున్నారు. వెనకడుగు వేసిన పృథ్వీకి మాత్రం బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. గడ్డం తీసేస్తే, రూ.5లక్షలు లేదా మూడు వారాలు నామినేషన్స్‌లో లేకుండా ఉండేలా ఇమ్యూనిటీ ఇస్తానని ఆఫర్‌ ఇచ్చారు. మరి ఆ ఆఫర్‌కు పృథ్వీ ఓకే చెప్పాడా? లేదా? తెలియాలి.

* గ్రూప్‌-1 అభ్యర్థుల్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. అభ్యర్థుల్ని చర్చలకు పిలవకపోవడం దుర్మార్గమన్న ఆయన.. కనీసం సుప్రీం కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకునే వరకైనా ప్రభుత్వం వేచి చూడాలన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి కావాలనే నాటకం ఆడుతున్నారని విమర్శించారు.

* కడప జిల్లా బద్వేలు సమీపంలో విద్యార్థినిపై పెట్రోల్‌ దాడి ఘటన కలకలం రేపింది. బద్వేలు పట్టణంలోని రామాంజనేయనగర్‌కు చెందిన విద్యార్థిని స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కాలనీకి చెందిన విఘ్నేశ్‌ తరచూ ఆమె వెంటపడుతుండేవాడు. బాలికను 8వ తరగతి నుంచే ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇటీవలే విఘ్నేశ్‌కు వివాహం కాగా.. అతని భార్య గర్భవతి కూడా. అయినా, విద్యార్థిని వెండపడటం ఆపలేదు. శనివారం మధ్యాహ్నం కళాశాలలో ఉన్న విద్యార్థినికి ఫోన్‌ చేసి కలవాలని చెప్పాడు. ఈరోజు తనను కలవకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్‌లో బెదిరించాడు. దీంతో గత్యంతరం లేని స్థితిలో బాలిక కళాశాల నుంచి ఆటోలో బయలుదేరింది. బద్వేలు పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద నిందితుడు కూడా ఆటో ఎక్కాడు. ఇద్దరూ బద్వేలుకు పది కిలోమీటర్ల దూరంలోని సెంచురీ ఫ్లైవుడ్‌ పరిశ్రమ సమీపంలోని ముళ్లపొదల్లోకి వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. విద్యార్థినిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు విఘ్నేశ్‌. కాలిన గాయాలతో కేకలు వేస్తుండగా.. సమీపంలోని పొలాల్లో పని చేస్తున్న కూలీలు వచ్చి ఆమెను రక్షించారు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాహనంలో బద్వేలు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో ఇంటర్‌ విద్యార్థిని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని నుంచి జిల్లా జడ్జి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.

* గ్రూప్‌ వన్‌ అభ్యర్థుల ఆందోళనలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. శనివారం(అక్టోబర్‌19) సాయంత్రం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని పోలీస్‌ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. గ్రూప్‌ వన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చినపుడే జీవో నెంబర్‌ 29 ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి గ్రూప్‌ 1 నియామకాలు జరగలేదన్నారు. కొంత మంది ఉద్యోగాలు పోవడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పదేళ్లు గ్రూప్‌ వన్‌ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఉచ్చులో విద్యార్థులు పడొద్దని హితవు పలికారు. కాగా గ్రూప్‌ వన్‌ రద్దు చేయాలని శనివారం ఉదయం గ్రూప్‌ వన్‌ అభ్యర్థులు హైదరాబాద్‌ అశోక్‌నగర్‌తో పాటు సచివాలయం వద్ద ఆందోళనలు చేశారు. వీరి ఆందోళనలకు బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు మద్దతు పలికారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

* ఇండోర్‌లో కొంద‌రు కాలేజీ యువ‌తులు ‘గ‌డ్డం తొలిగించండి.. ప్రేమ‌ను కాపాడండి’ అనే నినాదంతో యువ‌తులు ర్యాలీ తీశారు. ముఖాల‌కు గ‌డ్డం మేక‌ప్‌ వేసుకొని మరీ అబ్బాయిల గ‌డ్డం విష‌య‌మై ర్యాలీ తీయడం హాట్‌ టాపిక్‌గా నిలిచింది., ‘గడ్డం రఖో యా జిఎఫ్ రఖో’(గడ్డం కావాలా? గర్ల్‌ఫ్రెండ్‌కావాలా), ‘గడ్డం హటావో ప్యార్ బచావో’ నినాదాలతో వీధుల్లోకి వచ్చారు. ‘నో క్లీన్ షేవ్.. నో ల‌వ్‌’, ‘నో క్లీన్ షేవ్‌.. నో గ‌ర్ల్‌ఫ్రెండ్’ అనే ప్లకార్డులతో తీసిన ర్యాలీ నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఈ వీడియోను ఓ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌)లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు. వారి డిమాండ్ క‌రెక్టేగా కనీసం వారానికి ఒక‌సారైనా క్లీన్ షేవ్ కాకున్నా క‌నీసం ట్రీమ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మ‌నం ఎలుగుబంటిలా కాకుండా జెంటిల్‌మెన్‌లా ఉంటాం అంటూ కామెంట్‌ చేయడం విశేషం. మరికొందరు దీని వెనుకున్న మతలబు ఏంటి భయ్యా అంటూ దీర్ఘాలోచనలో పడిపోయారు.

* నాగర్‌కర్నూలు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో లింగాల పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ముగ్గురు యువకులతో ఓ ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. తన ముందే ఓ యువకుడు తల దువ్వుకున్నాడని కోపంతో ఊగిపోయిన ఎస్సై.. ముగ్గురు యువకులకు గుండు గీయించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూలు జిల్లా లింగాల వద్ద ఓ పెట్రోల్‌ బంక్‌ సిబ్బందితో ముగ్గురు యువకులకు ఇటీవల గొడవ జరిగింది. దీనిపై పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ గొడవను నచ్చజెప్పాల్సిన పోలీసులు మాత్రం అతిగా ప్రవర్తించారు. ముగ్గురు యువకులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై జగన్మోహన్‌ రెడ్డి.. వారికి వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ సమయంలో ఓ యువకుడు తల దువ్వుకోవడంతో ఎస్సై సీరియస్‌ అయ్యాడు. నా ముందే తలదువ్వకుంటావా అని వారిపై కోపంతో రెచ్చిపోయాడు. వెంటనే ముగ్గురు యువకులకు గుండు గీయించాడు. ఇలా అందరిముందు గుండు గీయించడంతో ముగ్గురు యువకులు మనోవేదనకు గురయ్యారు. వారిలో నితీశ్‌ అనే యువకుడు తీవ్ర మనస్తాపం చెందాడు. తన పరువు పోయిందని భావించి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని నాగర్‌కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నితీశ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ దురుసు ప్రవర్తన కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించినప్పటికీ ఎస్సై మాత్రం తన తీరును మార్చుకోలేదని సమాచారం. మిగతా ఇద్దరు యువకులను ఊరు విడిచి హైదరాబాద్‌ వెళ్లిపోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

* వాతావరణ మార్పులపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గోవా గవర్నర్‌ పీఎన్‌ శ్రీధరన్‌ పిళ్లై రచించిన ‘ట్రెడిషనల్‌ ట్రీస్‌ ఆఫ్‌ ఇండియా’ పుస్తకాన్ని సీజేఐ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పులు మత్స్యకారులు, రైతులతో పాటు సమాజంలోని అత్యంత అట్టడుగు వర్గాలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం అక్టోబర్, డిసెంబర్‌లో వర్షాలు కురుస్తున్నాయన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు రాష్ట్రంతో పాటు పౌరులు కలిసి పని చేయాలని సీజేఐ పిలుపునిచ్చారు. నిన్న గోవాలో వర్షాలు కురిశాయని.. నారాలి పౌర్ణమి రోజున మత్స్యకారులు సముద్రానికి కొబ్బరికాయలు సమర్పిస్తే వర్షాలు ముగుస్తాయని చిన్నప్పుడు చెప్పేవారన్నారు. కానీ, అక్టోబర్‌, డిసెంబర్‌లో వర్షాలు కురుస్తున్నాయన్నారు. వాతావరణ మార్పులతో అన్ని వర్గాలు నష్టపోతున్నాయన్నారు. వాతావరణ మార్పు సంపన్నులను మాత్రమే ప్రభావితం చేయదని.. కానీ ఇది సమాజంలోని అత్యంత అట్టడుగు వర్గాలకు చెందిన మత్స్యకారులు, రైతులను కూడా ప్రభావితం చేస్తోందన్నారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 48ఏ రాష్ట్రం పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది, మెరుగుపరుస్తుంది. అడవులను, వన్యప్రాణులను రక్షించాలని నిర్దేశిస్తుంది. అయితే, ఆర్టికల్ 51A (g) ప్రకృతిని రక్షించడం ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యమని చెబుతుంది’ అన్నారు. దేశంలోని న్యాయస్థానాలు సుస్థిర అభివృద్ధి సూత్రం, కాలుష్యదారుల చెల్లింపుల భావనతో పాటు ఇంటర్-జనరేషన్ ఈక్విటీ ఆధారంగా స్థిరమైన న్యాయశాస్త్రాన్ని కూడా అభివృద్ధి చేశాయని సీజేఐ చెప్పారు. ఇంటర్-జనరేషన్ ఈక్విటీ అనేది అమ్మమ్మలు, తాతలు మనకు నేర్పించిన విషయాలు అన్నారు. ప్రకృతి గురించి పొందిన జ్ఞానాన్ని తరతరాలకు అందించడం, మనం గతంలోని పాఠాలను భవిష్యత్‌ తరాలకు అందించాలన్నారు.

* ఏపీలోని నంద్యాల జిల్లాలో శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు ప్రాజెక్టులోని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక(Karnataka) నుంచి వస్తున్న వరదతో శ్రీశైలానికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో నాలుగు గేట్లను ఎత్తి నాగార్జున సాగర్‌ (Nagarjunasagar) డ్యాంకు నీటిని విడుదల చేస్తున్నారు. గత మూడు రోజులుగా వస్తున్న వరద ప్రవాహంతో మొదటగా ఒక గేటును ఎత్తిన అధికారులు ప్రవాహం పెరగడంతో శనివారం మరో మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మరో వైపు పులిచింతల ప్రాజెక్టుకు లక్షా 18 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా లక్షా 36 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

* ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో ఉన్న బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధుకు ఆన్‌ డ్యూటీ సదుపాయాన్ని మరో ఏడాది పొడిగించింది. ఆసియా, కామన్‌వెల్త్‌ క్రీడలతో పాటు 2025-26లో వివిధ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ నిమిత్తం పీవీ సింధుకు ఆన్‌ డ్యూటీ సదుపాయాన్ని పొడిగించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ఓడీని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు 2016 ఒలింపిక్స్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించారు. దీంతో అప్పటి తెలుగు ప్రభుత్వాలు పీవీ సింధును ఘనంగా సన్మానించడంతో పాటు నజరానా ప్రకటించాయి. గ్రూప్‌-1 హోదాతో ప్రభుత్వ ఉద్యోగం కూడా ఆఫర్‌ చేశాయి. అయితే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగం చేసేందుకు పీవీ సింధు సుముఖత వ్యక్తం చేశారు. తొలుత విజయవాడ గొల్లపూడిలోని ఏపీ భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలో పీవీ సింధు విధుల్లో చేరారు. డిప్యూటీ కలెక్టర్‌ విధులు, బాధ్యతలపై శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న లేక్‌వ్యూ అతిథిగృహంలో ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్నారు.

* ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండటం లేదని విమర్శించారు. చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే అని ఎద్దేవా చేశారు. ఇసుక, మద్యం జోలికి వెళ్లొద్దని చంద్రబాబు చెబుతారని.. కానీ టీడీపీ నేతలు మాత్రం వాటినే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని అన్నారు. ఇసుక, మద్యం విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డి విమర్శించారు. సూపర్‌ సిక్స్‌లో ఒక్క హామీ చేయలేక.. ఇప్పుడు ఇసుకపై కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక, మద్యానికి సంబంధించి ఎన్నో దౌర్జన్యాలు జరిగాయని.. కానీ ఎవరి మీద చర్యలు తీసుకోలేదని తెలిపారు. లాటరీలో మద్యం షాపుల లైసెన్సులు పొందిన వారిని కిడ్నాప్‌ చేశారని, ఇసుక టెండర్లు పొందిన వారిని మంత్రులు భయపెడుతున్నారని అన్నారు.

* తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. అందుకు జీవో నంబర్‌ 29 ఓ సంకేతమన్నారు బండి సంజయ్‌. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ..‘ తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోంది. సోనియా జన్మదినం… నిరుద్యోగుల బలిదినం కాబోతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. గ్రూప్ 1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాల్సిందే. నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా?, నిరుద్యోగ ర్యాలీలో విధ్వంసం చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర, కేటీఆర్ ఓ యూజ్ లెస్ ఫెలో. నేను పేపర్ లీకేజీ చేసినట్లు ప్యామిలీతో కలిసి ప్రమాణం చేసే దమ్ముందా?. డ్రగ్స్ తీసుకుని చీకటి దందాలు సాగించిన బతుకు నీది. నా జోలికొస్తే… నీ చీకటి బతుకులను బయటపెడతా. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు బిడ్డా. కాంగ్రెస్‌తో కుమ్కక్కు రాజకీయాలు చేస్తోంది మీరు కాదా?, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, కాళేశ్వరం కేసులు రాకుండా చీకటి రాజకీయాలు చేస్తోంది మీరే. కాంగ్రెస్ తో పగలు ఫైటింగ్… రాత్రిళ్లు లవ్వింగ్ బతుకు మీది. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయింది. జేసీబీ పెట్టి లేపినా బీఆర్ఎస్ లేచే పరిస్థితి లేదు. 2028లో తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. సికింద్రాబాద్ లో భజరంగ్ దళ్ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్ ను ఖండిస్తున్నా. ప్రశాంతంగా జరుగుతున్న ప్రదర్శనను అడ్డుకుని హింసను సృష్టించడం దారుణం.. పోలీసుల తీరు దుర్మార్గం’ అని ధ్వజమెత్తారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z