* గత ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) విమర్శించారు. ఖైరతాబాద్‌లో ఏఎంవీఐలకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ బాట పట్టారని గుర్తుచేశారు. సొంత రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు వస్తాయని వారు ఆశించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 50 వేల ఉద్యోగ నియామకపత్రాలు అందించామన్నారు. నియామకాల ప్రక్రియ త్వరగా చేపట్టేలా పర్యవేక్షించామని వివరించారు.
* ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly) ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) రాష్ట్ర బడ్జెట్ (AP Budget)ను ప్రవేశపెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,94,427.25 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2,35,916.99 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ. 32,712.84 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ. 34,743.38 కోట్లు, ద్రవ్య లోటు రూ. 68,742.65 కోట్లుగా పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగం ద్వారా వెల్లడించారు. బడ్జెట్‌లో వివిధ కీలక రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు.
* వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, నారా లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ తెదేపా మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఛైర్మన్ నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 20న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. టీజీపీఎస్సీ ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 3తో ముగియనుంది.
* తాను తల్లిని కావాలన్న కోరిక ఎప్పుడూ ఉందని, అది ఇప్పటికీ సజీవమేనని సినీ నటి సమంత (Samantha) అన్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సామ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘సిటడెల్: హనీ బన్నీ’ (citadel: honey bunny). ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోవేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్ యాక్షన్ ప్రియులను (Citadel: Honey Bunny Review) అలరిస్తోంది. ఇందులో సమంత తల్లి పాత్ర పోషిస్తూనే స్పై ఏజెంట్‌గా యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టారు. ఈ క్రమంలో ఓ ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
* వికారాబాద్‌లో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి ఇదే నిదర్శనమన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఏకంగా కలెక్టర్‌పై రైతులు తిరగబడ్డారని అన్నారు. ‘‘సీఎం మూర్ఖత్వం వల్ల అధికారులు దెబ్బలు తింటున్నారు. రేవంత్‌రెడ్డి దురాశ, అవగాహన రాహిత్యం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. ఫార్మాసిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న భూములను రద్దు చేశారు. పదిచోట్ల ఫార్మాక్లస్టర్లు పెట్టాలనే ఆలోచన వల్లే ఇంత అలజడి రేగింది. సేకరించిన భూములను అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకున్నారు.
* ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు యావత్మాల్‌కు రాగా అధికారులు తన బ్యాగ్ తనిఖీ చేశారని శివసేన (యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర సీనియర్ నేతల బ్యాగులనూ ఎన్నికల అధికారులు చెక్ చేయాలన్నారు. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని యావత్మాల్‌లోని వనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో షేర్ చేసుకున్నారు. హెలికాప్టర్‌లో వనీకి చేరుకోగా.. కొందరు ఎన్నికల అధికారులు వచ్చి తన బ్యాగ్‌ను తనిఖీ చేశారని ఉద్ధవ్ తెలిపారు. బ్యాగ్‌ను తనిఖీ చేయడంపై మండిపడిన ఆయన.. అధికారుల జేబులు, గుర్తింపు కార్డుల్ని తమ పార్టీ కార్యకర్తలు, ఓటర్లూ తనిఖీ చేయాలన్నారు.
* అసభ్యకర పోస్టుల కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డితోపాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సీకేదిన్నె నుంచి ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి కడప కోర్టులో ప్రవేశపెట్టారు. వర్రా రవీందర్ రెడ్డి అరెస్టు విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కోర్టులో ప్రక్రియ ముగిసిన తర్వాత వర్రా రవీందర్‌రెడ్డితోపాటు సుబ్బారెడ్డి, ఉదయ్‌లను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత తదితరులపై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో రవీంద్ర ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మరికాసేపట్లో డీఐజీ, ఎస్పీ మీడియాకు వెల్లడించనున్నారు.
* వైకాపా ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్ (YS Jagan) అసెంబ్లీకి (AP Assembly) రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyannapatrudu) వ్యాఖ్యానించారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు సీరియస్‌గా జరుగుతాయని అయ్యన్న స్పష్టం చేశారు. మంగళవారం బడ్జెట్ (AP Budget)పై అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు రెండు పూటలా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
* ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాననడం వైకాపా అధ్యక్షుడు జగన్ (YS Jagan) అవివేకం, అజ్ఞానానికి నిదర్శనమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) విమర్శించారు. ఆయన తీరు అత్త మీద కోపం దుత్తపై చూపినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు జగన్‌ను ఉద్దేశిస్తూ షర్మిల ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రజలు ఓట్లేసింది.. అసెంబ్లీ మీద అలగడానికో, మైకు ఇస్తేనే వెళ్తానని మారాం చేయడానికో కాదు. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు. మీ స్వయం కృతాపరాధం ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే.. ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాననడం మీ అవివేకం, అజ్ఞానానికి నిదర్శనం. అసెంబ్లీ ప్రజాస్వామ్య దేవాలయం. ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశం. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుకయ్యే అవకాశం వైకాపాకు ప్రజలు ఇస్తే.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామనడం సిగ్గు చేటు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలనే ఇంగితం కూడా లేకపోవడం బాధాకరం.
* ఖలిస్థానీ వేర్పాటువాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) మరోసారి రెచ్చిపోయాడు. హిందూ ఆలయాలే లక్ష్యంగా బెదిరింపులకు దిగాడు. అయోధ్య ఆలయంతో (Ram Mandir) పాటు ఇతర దేవాలయాలపైనా దాడులు చేస్తామంటూ బెదిరింపులకు దిగాడు. ఇందుకు సంబంధించి నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ సంస్థ ఓ వీడియోను విడుదల చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
* ఒక కేంద్రమంత్రిపై రాష్ట్ర మంత్రి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు కర్ణాటక (Karnataka)లో రాజకీయ వివాదానికి కారణమయ్యాయి. కాంగ్రెస్ నేత కామెంట్లను భాజపా, జేడీఎస్ తీవ్రంగా ఖండించాయి. కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ (BZ Zameer Ahmed Khan) ఈ వివాదానికి కారణమయ్యారు. భాజపా నుంచి తిరిగి కాంగ్రెస్‌లో చేరిన సీపీ యోగీశ్వర అనే నేతను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘పార్టీలో అభిప్రాయభేదాల కారణంగా ఆయన స్వతంత్రుడిగా ఎన్నికల్లో పోటీపడ్డారు. తర్వాత వేరే దారిలేకపోవడంతో భాజపాలోచేరారు. భాజపా కంటే కుమారస్వామి (HD Kumaraswamy) ప్రమాదకరం కావడంతో జేడీఎస్‌కు వెళ్లలేకపోయారు. చివరకు సొంతపార్టీ కాంగ్రెస్‌కు తిరిగివచ్చారు’’ అని మంత్రి అన్నారు. అప్పుడే కుమారస్వామి రంగును ఉద్దేశించి (Racist Comment Against HD Kumaraswamy) మాట్లాడారు. చన్నపట్న ఉపఎన్నికలో కుమారస్వామి తనయుడు నిఖిల్ బరిలో ఉన్నారు. భాజపా-జేడీఎస్ కూటమి తరఫున ఆయనకు ఆ టికెట్ దక్కింది. ఈ నియోజకవర్గం నుంచే యోగీశ్వర పోటీలో ఉన్నారు.
* ఝార్ఖండ్ (Jharkhand)లో ఎన్నికల ప్రచారం వాడీవేడీగా జరుగుతోంది. తాము అధికారంలోకి వస్తే.. చొరబాటుదారులను గుర్తించి, తరిమేస్తామని భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) వెల్లడించారు. వారు లాక్కున్న భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదివాసీ మహిళలను పెళ్లి చేసుకున్న చొరబాటుదారుల పేరుమీదకు భూమి బదలాయింపును నిరోధించేలా చట్టాన్ని తీసుకువస్తామన్నారు. ‘‘ఝార్ఖండ్‌లో ఆదివాసీ జనాభా తగ్గిపోతోంది. మన అమ్మాయిలను పెళ్లి చేసుకొని, చొరబాటుదారులు భూములను లాక్కుంటున్నారు. దానిని నిరోధించేలా చట్టాన్ని తీసుకువస్తాం. అలాగే వారిని గుర్తించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం’’ అని అమిత్ షా (Amit shah) వెల్లడించారు. ఈ చొరబాటుదారుల అంశాన్ని లేవనెత్తినందుకు మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్‌ను అవమానించారని, ఒత్తిడి తీసుకువచ్చి సీఎం పదవికి రాజీనామా చేయించారని విమర్శించారు. అధికార కూటమి జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల నేతలు తమ వ్యక్తిగత పురోగతి కోసమే పనిచేస్తూ, అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే అలాంటి అవినీతిపరులను జైలుకు పంపుతామని హెచ్చరించారు.
* యువతకు నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ (PM Internship Scheme)కు దరఖాస్తుల గడువును పొడిగించారు. నవంబర్ 10తో గడువు ముగియడంతో తాజాగా నవంబర్ 15వరకు పొడిగిస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. దీంతో అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://pminternship.mca.gov.in/login/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ పేర్లను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకొని, దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z