* 2024 ఏడాదికిగానూ ప్రతిష్ఠాత్మక‘స్కోచ్’ అవార్డును ఏపీఎస్‌ఆర్‌టీసీ (APSRTC) దక్కించుకుంది. యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ, బస్సుల్లో డిజిటల్ టికెట్ల జారీ చేస్తున్నందుకు ఈ అవార్డు సొంతం చేసుకుంది. బస్సుల్లో ట్రాకింగ్ వ్యవస్థను సమర్థంగా నిర్వహిస్తున్నందుకు ఆర్టీసీని ఈ అవార్డు వరించింది. ఆర్టీసీ ఈడీ రవివర్మ, ఐటీ చీఫ్ ఇంజినీర్ వి.సుధాకర్ ఈ అవార్డును అందుకున్నారు.
* ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా (Vistara) కథ మరికొన్ని గంటల్లో ముగియనుంది. గడిచిన 10 ఏళ్లుగా సేవలందించిన విస్తారా బ్రాండ్ కనుమరుగు కానుంది. టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియాలో విలీనం అవుతుండడమే దీనికి కారణం. నవంబర్ 12 నుంచి ఈ విలీనం అమల్లోకి రానుంది. సోమవారం రాత్రి ఒక దేశీయ, ఒక అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రయాణంతో విస్తారా ప్రయాణం ఆగిపోనుంది. విస్తారాకు చెందిన యూకే 986 విమానం ముంబయి నుంచి దిల్లీకి సోమవారం రాత్రి 10.50 గంటలకు బయల్దేరనుంది. దీంతోపాటు దిల్లీ ననుంచి సింగపూర్‌కు వెళ్లాల్సిన యూకే 115 విమానం రాత్రి 11.45 గంటలకు బయల్దేరనుంది. మంగళవారం నుంచి విమాన కోడ్ ‘యూకే’ తెరమరుగై.. ఆ స్థానంలో ఏఐ2XXXX పేరుతో కొత్త కోడ్ రానుంది. ఇంకో ఆసక్తికర విషయమేమిటంటే.. 2015 జనవరి 9న ప్రారంభమైన విస్తారా తన విమానం సర్వీసును దిల్లీ- ముంబయి మధ్యే నడవడం గమనార్హం.
* పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని టాటా గ్రూప్, ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మధ్య జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక రంగాలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 20 హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. తాజ్, వివాంటా, గేట్‌వే, సెలెక్యూషన్స్, జింజర్ హోటళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రూ.40వేల కోట్ల పెట్టుబడితో టాటాపవర్ సోలార్, విండ్ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. విశాఖలో కొత్త ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖనగరంలో టీసీఎస్ ద్వారా 10వేల ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు.
* ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్స్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ (హెచ్ఎంఎస్ఐ) భారత్ మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ నెల 27న ఆవిష్కరించనున్నది. ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) తో కూడిన యాక్టివా, డియో వంటి మోడల్ స్కూటర్లదే ఆధిపత్యం. అయితే, ప్రస్తుతం భారత్ మార్కెట్లో ఈవీ సెగ్మెంట్ చాలా ప్రారంభ దశలో ఉంది. అక్టోబర్ నెలలో పండుగల సందర్భంగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ 1,39,159 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలు 20,65,095 యూనిట్లు. మొత్తం టూ వీలర్స్ విక్రయాల్లో ఈవీ స్కూటర్ల విక్రయాలు 6.74 శాతం మాత్రమేనని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) పేర్కొంది. హోండా మోటార్స్ 5,54,249 ఐసీఈ టూ వీలర్స్ విక్రయించింది. మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయంలో 26.84 శాతం. ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో, ఎథేర్ ఎనర్జీ, హీరో మోటో కార్ప్ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. ఎస్1తో ఓలా ఎలక్ట్రిక్, ఐక్యూబ్, ఎక్స్‌తో టీవీఎస్ మోటార్ కంపెనీ, చేతక్ తో బజాజ్ ఆటో, రిజ్టాతో ఎథేర్, విదా వీ1తో హీరో మోటో కార్ప్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ విక్రయిస్తున్నాయి.
* హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో బంగాళా దుంప (ఆలుగడ్డ)ల దిగుబడి 30 శాతం తగ్గిపోయింది. వేసవిలో తీవ్రమైన వేడి, శీతాకాలం ఆలస్యం కావడంతో బంగాళా దుంపల దిగుబడి తగ్గుముఖం పట్టిందని రైతులు చెబుతున్నారు.ఫలితంగా రిటైల్ మార్కెట్లో బంగాళా దుంపల ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. గోధుమలు, మొక్కజొన్న, బంగాళా దుంప పంటల సాగుతో రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. ఉనా జిల్లాలో గోధుమలు, మొక్కజొన్నల తర్వాత రైతులు అత్యధికంగా పండిస్తున్న పంట బంగాళా దుంపలు. 1200 హెక్టార్ల పరిధిలో రైతులు బంగాళా దుంపల పంట సాగు చేస్తున్నారు. ఏటా సుమారు 20 వేల నుంచి 25 వేల టన్నుల దిగుబడి వస్తోంది. క్వింటాల్ బంగాళా దుంపల ధర సాధారణంగా రూ.3,000-3,600 మధ్య పలికితే రైతులకు గిట్టుబాటు అవుతుంది. సెప్టెంబర్ నెల మొదటి వారంలో అధిక ఉష్ణోగ్రత వల్ల దిగుబడి తగ్గుముఖం పట్టింది. కనాల్ పరిధిలో సాధారణంగా ఏడెనిమిది క్వింటాళ్ల బంగాళా దుంపలు దిగుబడి వస్తుండగా, తాజా పరిస్థితులతో ఎకరాకు ఒకటి లేదా రెండు క్వింటాళ్ల దిగుబడి తగ్గుతుంది. వాతావరణంలో మార్పులతో పంట దిగుబడిపై ప్రభావం పడింది. వేసవిలో అతి తీవ్రత, అకాల వర్షాలు కూడా పంటపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఉనా జిల్లాలో 35 వేల హెక్టార్ల భూమి పరిధిలో గోధుమల సాగు చేస్తారు. నవంబర్ నెల ప్రారంభం నుంచి గోధుమ విత్తనాలు విత్తుతారు. కానీ, 45 రోజులుగా భూమిలో తేమశాతం తక్కువగా ఉండటంతో గోధుమ విత్తనాలు విత్తడానికి రైతులు వెనుకంజ వేస్తున్నారు. ఇక జిల్లాలోని మరో 28 వేల హెక్టార్ల భూమికి సాగునీటి వసతులు లేవు. సకాలంలో వర్షాలు కురిస్తే తప్ప పంటల సాగు ఉండదు.
* దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.450 తగ్గి రూ.79,550లకు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బలహీనతలు దేశీయ బులియన్ మార్కెట్లోనూ కొనసాగుతున్నాయి. శుక్రవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.80 వేల మార్క్ వద్ద స్థిర పడింది. మరోవైపు కిలో వెండి ధర సైతం రూ.600 తగ్గి రూ.94,000 వద్ద నిలిచింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.94,600 వద్ద స్థిర పడింది. ఆభరణాల తయారీలో వినియోగించే 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం రూ.450 తగ్గి రూ.79,150 వద్ద నిలిచింది. శుక్రవారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.79,600 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు దిగి వస్తు్న్నాయి. ఔన్స్ బంగారం ధర 2685 డాలర్లు పలికింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డాలర్లు, యూఎస్ బాండ్ల ధరలు పెరుగుతూ వచ్చాయి. దీంతో బంగారానికి గిరాకీ కాసింత తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2700 డాలర్లు దాటింది. కామెక్స్ ఫ్యూచర్ లో ఔన్స్ బంగారం ధర రెండు శాతం తగ్గి రూ. 2,694.30 పలికింది. కామెక్స్ సిల్వర్ ప్యూచర్ ధర 31.52 డాలర్లకు చేరుకున్నది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z