ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సేవా విభాగమైన ఫౌండేషన్ బ్యాంకు ఖాతా నుండి అనధికారికంగా ₹30కోట్లను ($3.6 మిలియన్ డాలర్లు) సొంత ఐటీ సంస్థలకు బదలాయించుకున్న డల్లాస్‌కు చెందిన పోలవరపు శ్రీకాంత్ ఫౌండేషన్ ట్రస్టీ పదవికి రాజీనామా చేశాడు. సోమవారం నాడు నిర్వహించిన తానా బోర్డు అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని ఈ నిధుల గోల్‌మాల్‌కు పూర్తి బాధ్యత తనదేనని, ఇతరుల ప్రమేయం లేదని త్వరలోనే నిధులను వాపసు చేస్తానని పేర్కొన్నారు. ఈ సమవేశంలో ₹84లక్షలు ($లక్ష డాలర్లు) తిరిగి చెల్లించిన ఆయన, తాను తీసుకున్న మొత్తం సొమ్మును త్వరలోనే తిరిగి చెల్లిస్తానని హామీనిచ్చారు.
తానా సొమ్ములు తిరిగి రాబట్టేందుకు న్యాయపరంగా ముందుకు వెళ్తామని, FBI వంటి దర్యాప్తు సంస్థల సహకారం తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని తానా ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికాలో తెలుగు సంఘాల్లో సంస్థ నిధులు మింగేసిన చెదపురుగులు చాలామంది ఉన్నప్పటికీ, ₹30కోట్ల సేవా కార్యక్రమాల నిధులను ఇంత భారీస్థాయిలో సిగ్గువిడిచి దోచుకోవడం మాత్రం ప్రప్రథమం. ఇలాంటి చర్యల వలన తెలుగు సంఘాల పట్ల ప్రవాసులు గౌరవాన్ని కోల్పోతున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z