Devotional

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్త అరెస్ట్-NewsRoundup-Nov 30 2024

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్త అరెస్ట్-NewsRoundup-Nov 30 2024

* వక్ఫ్‌ బోర్డు విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వక్ఫ్‌ బోర్డు ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంది. వైకాపా హయాంలో నియమించిన వక్ఫ్‌ బోర్డును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బోర్డులో సుపరిపాలన, ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

* తెలంగాణలో అరకొర రుణమాఫీ చేసి మొత్తం పూర్తి చేశామని కాంగ్రెస్‌(congress) నేతలు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (kishanreddy) మండిపడ్డారు. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్లు రాలేదని, గత ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలనే వీళ్లు భర్తీ చేస్తున్నారని విమర్శించారు.

* త్వరలో హైడ్రా పోలీస్‌స్టేషన్‌ రాబోతోందని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. బేగంపేటలోని ఓ హోటల్‌లో జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ, ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ లోకల్‌ ఎన్విరాన్మెంటల్‌ ఇనిషియేటివ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సుకు రంగనాథ్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

* తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, యువతకు ఉద్యోగాల కోసమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భారాస ప్రభుత్వం పదేళ్లలో రైతుల కోసం చేసిందేమీ లేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టినవేనని చెప్పారు.

* ఇస్కాన్‌ (ISKCON)కు చెందిన ప్రచారకర్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ (Chinmoy Krishnadas) బంగ్లాదేశ్‌ (Bangladesh)లో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఇస్కాన్‌కు చెందిన మరో సభ్యుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఇస్కాన్‌ కోల్‌కతా ప్రతినిధి రాధారమణ్‌ దాస్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో వెల్లడించారు.

* ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా వైకాపా అధినేత జగన్‌(ysjagan) కు బుద్ధి రాలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (satyakumar yadav) మండిపడ్డారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్‌ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై జగన్ తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి విమర్శించారు.

* అణగారిన వర్గాలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా నేమకల్లులో పింఛన్ల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభలో సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలో 64లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. ‘‘దేశంలో పింఛను ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదే. పింఛన్ల కింద ఐదు నెలల్లో రూ.18వేల కోట్లు ఇచ్చాం. పెంచిన పింఛన్లు ఏప్రిల్‌ నుంచి ఇచ్చాం. పింఛను 3 నెలలకోసారి తీసుకునే సౌకర్యం కల్పించాం. లబ్ధిదారుల్లో కూలీలు, కార్మికులు ఉన్నారనే ఇలా ఏర్పాటు చేశాం. ప్రజల్లో ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నా. అనంతపురం జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం. రాయదుర్గం వెనుకబడిన ప్రాంతం. ఈ నియోజకవర్గం ఏడారిగా మారకుండా చర్యలు తీసుకున్నాం. రాయదుర్గం ప్రజల్లో వెలుగులు నింపే బాధ్యత తీసుకుంటాం. హంద్రీనీవాపై రూ.4,500 కోట్లు ఖర్చు చేశాం. రాయలసీమలోని ప్రాజెక్టులకు రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఇక్కడున్న నేమకల్లు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చా’’ అని చంద్రబాబు అన్నారు.

* కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia)పై తేనెటీగలు దాడి చేశాయి. అప్రమత్తమైన భద్రత సిబ్బంది, కార్యకర్తలు రక్షణ వలయంగా ఏర్పడి ఆయన్ని అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. మధ్యప్రదేశ్‌లోని (Madhyapradesh) శివపురిలో ఓ కార్యక్రమానికి సింధియా హాజరయ్యారు. సభావేదిక మాధవ్‌ నేషనల్ పార్క్‌ సమీపంలో ఉంది. కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా వీడియో చిత్రీకరించడానికి డ్రోన్లను వినియోగించారు. ఈ క్రమంలో తేనెతుట్టె కదిలింది. వెంటనే తెనేటీగలు అక్కడున్న వారిపై దాడి చేశాయి. కేంద్ర మంత్రి భద్రత సిబ్బంది వలయంగా ఏర్పడి.. సింధియాను అక్కడి నుంచి తీసుకెళ్లారు. కొత్వాలీ పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి.

* జీవో 317కు సంబంధించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతి కుమారి మార్గదర్శకాలతో కూడిన 243, 244, 245 ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు కేటగిరీలకు సంబంధించి విడివిడిగా మార్గదర్శకాలు జారీ చేశారు. ఖాళీలకు లోబడి స్థానిక కేడర్‌లో మార్పు, బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియలో ప్రస్తుతం ఆయా స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.

* ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో (World Chess Championship) వరుసగా మరో గేమ్ డ్రాగా ముగిసింది. భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌ (Gukesh), డిఫెండింగ్ ఛాంపియన్‌ డింగ్ లిరెన్ మధ్య శనివారం జరిగిన ఐదో గేమ్ డ్రా అయింది. ఈ గేమ్‌లో గుకేశ్‌ తెల్లపావులతో ఆడాడు. నిన్న (శుక్రవారం) జరిగిన నాలుగో గేమ్‌ కూడా డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచ టైటిల్‌ మ్యాచ్‌లో ఇప్పటివరకు ఐదు గేమ్‌లు జరగ్గా మూడు డ్రాగా ముగిశాయి. ఐదు రౌండ్‌లు పూర్తయ్యేసరికి గుకేశ్, లిరెన్‌ 2.5 – 2.5 పాయింట్లతో సమానంగా ఉన్నారు. ఈ పోటీలో ఇంకా 9 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఈ ప్రపంచ టైటిల్‌ మ్యాచ్‌లో 14 రౌండ్లు ఉంటాయి. మొదట 7.5 పాయింట్లకు చేరుకున్న ఆటగాడు విజేతగా నిలుస్తాడు. ఒక గేమ్‌లో విజయం సాధిస్తే ఒక పాయింట్ ఇస్తారు. గేమ్ డ్రా అయితే ఇద్దరు ఆటగాళ్లు పాయింట్‌ను పంచుకుంటారు.

* మహారాష్ట్ర (Maharashtra) సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్‌ 5న సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని భాజపా (BJP) వెల్లడించింది. ముంబయిలోని (Mumbai) ఆజాద్‌ మైదానంలో సీఎంతోపాటు పలువురు మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ‘‘ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమం డిసెంబర్‌ 5న జరగనుంది’’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

* ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్‌ కుమార్‌ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 6గంటల నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిఖేశ్‌ బంధువులతో పాటు సన్నిహితుల ఇళ్లలో కలిపి మొత్తం 30 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో ఫాంహౌస్‌లతో పాటు భారీగా వ్యవసాయ భూములు, భవనాలు ఉన్నట్టు గుర్తించారు. కేజీల కొద్దీ బంగారం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు గుర్తించిన ఏఈఈ ఆస్తులు మార్కెట్‌ విలువ ప్రకారం… దాదాపు రూ.150 కోట్లకుపైనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సోదాల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z