Business

సబ్బుల ధరలకు రెక్కలొచ్చాయి-BusinessNews-Nov 30 2024

సబ్బుల ధరలకు రెక్కలొచ్చాయి-BusinessNews-Nov 30 2024

* ఈపీఎఫ్‌ (EPF) సెటిల్‌మెంట్‌ సమయంలో చేసే వడ్డీ చెల్లింపులకు సంబంధించి ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ (CBT) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ తేదీ వరకు చందాదారుడికి వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. సెటిల్‌మెంట్‌ సమయంలో ఆ నెల 24వ తేదీ వరకు మాత్రమే వడ్డీ లెక్కించే విధానం ఉంది. ఇకపై సెటిల్‌మెంట్‌ తేదీ వరకు వడ్డీ చెల్లించనున్నారు. దీనివల్ల ఆర్థికంగా చందాదారుడికి ప్రయోజనం కలగడంతో పాటు ఫిర్యాదులు తగ్గతాయని సీబీటీ అభిప్రాయపడింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నేతృత్వంలో దిల్లీలో జరిగిన 236 సీబీటీ సమావేశంలో ఈ నిర్ణయం వెలువడింది. దీంతో పాటు మరిన్ని నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది.

* భారత బిలియనీర్ ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఆదాయం.. లాభాలు.. ఆ సంస్థకు ఉన్న మార్కెట్ విలువ గురించి తెలియిన వారుండరు. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్.. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థ. పెట్రోలియం ఉత్పత్తుల శుద్ధి మొదలు టెలికం.. రిటైల్.. సహా పలు రంగాల్లో సేవలందిస్తున్న సంస్థ రిలయన్స్ నిత్యం వార్తల్లో ఉంటుంది. ఈ ఏడాది కాలంలో న్యూస్ స్కోర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిందని వీజీకీ (Wizikey) నివేదిక పేర్కొంది. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ కంపెనీల కంటే ఎక్కువగా వార్తల్లో రిలయన్స్ నిలిచిందని తెలిపింది.

* ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) వద్ద కేంద్ర ప్రభుత్వం 98 మిలియన్ డాలర్ల రుణం తీసుకున్నది. హార్టికల్చర్ పంటల దిగుబడి పెంపు కోసం కేంద్రం ఈ రుణం తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం ప్రకటించింది. హార్టికల్చర్ పంటల దిగుబడి పెంపునకు.. ఆయా పంటలకు చీడ పీడల నివారణకు ఈ రుణం ఉపయోగిస్తామని ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘బిల్డింగ్ ఇండియా’స్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్’ అనే అంశంపై జరిగిన ఒప్పందం మీద ఆర్థిక శాఖ ఆర్థిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శి జుహీ ముఖర్జీ, ఏడీబీ ఇండియా ప్రతినిధి కైవై యేయో సంతకాలు చేశారు. ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత జూహీ ముఖర్జీ స్పందిస్తూ.. ‘రైతులకు ఆరోగ్యకరమైన పంటల దిగుబడి పెంచడానికి ఏడీబీ నిధులను వినియోగిస్తాం’ అని పేర్కొన్నారు. భారత్ ఆత్మ నిర్బర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ (సీపీపీ) కింద ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు ఏడీబీ ప్రతినిధి కైవే యేయో తెలిపారు.

* ప్రతి ఒక్కరికీ కుటుంబ అవసరాల రీత్యా అత్యవసర పరిస్థితులు వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు గానీ, సొంతిల్లు కొనుక్కోవాలని గానీ, పిల్లల విద్యావసరాలకు సరిపడా డబ్బు అందుబాటులో లేని పరిస్థితి తలెత్తవచ్చు. అటువంటి పరిస్థితుల్లో బంగారంపై రుణాలు గానీ, పర్సనల్ లోన్లు గానీ తీసుకోవాల్సి వస్తుంది. పర్సనల్ లోన్లతో పోలిస్తే బంగారంపై రుణాలు తేలిగ్గా మంజూరు కావడంతోపాటు వడ్డీ రేట్ల భారం ఎక్కువగా ఉంటుంది. బంగారం తాకట్టుపై కేవైసీ పత్రాలు సమర్పిస్తే చాలు.. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణాలిచ్చేస్తాయి. గతంతో పోలిస్తే బంగారం తాకట్టు రుణాలు పెరిగిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో బ్యాంకుల్లో బంగారం తాకట్టు రుణాలు 50.4 శాతం వృద్ధి చెందాయి. ఇతర పర్సనల్ లోన్ల సెగ్మెంట్‌లో కేవలం సింగిల్ డిజిట్ వృద్ధిరేటు నమోదు కావడం ఆసక్తి కర పరిణామం. గత మార్చి నెలాఖరు నాటికి గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,02,562 కోట్ల బంగారం రుణాలు మంజూరు అయ్యాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 18 నాటికి రూ.1,54,282 కోట్ల విలువైన బంగారం రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. 2023-24లో ఏప్రిల్- అక్టోబర్ మధ్య బంగారం రుణాలతో పోలిస్తే 13 శాతం, వార్షిక ప్రాతిపదికన 56 శాతం వృద్ధిరేటు నమోదైంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ).. అన్ సెక్యూర్డ్ రుణాల కంటే సెక్యూర్డ్ రుణాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో రుణ గ్రహీతలు బంగారం రుణాల వైపు మొగ్గు చూపారు. ఇదిలా ఉంటే గత ఏడు నెలల్లో ఎన్బీఎఫ్సీలకు బ్యాంకుల రుణాలు 0.7 శాతం తగ్గి రూ.1.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

* సబ్బుల ధరలకు రెక్కలొచ్చాయి. దేశంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ సంస్థలు అన్ని రకాల సబ్బుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. పామాయిల్‌ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం వల్లనే వీటి ధరలను 7 శాతం నుంచి 8 శాతం వరకు పెంచాల్సి వచ్చిందని హెచ్‌యూఎల్‌, విప్రో సంస్థలు ప్రకటించాయి. సబ్బుల తయారీలో కీలక ముడి సరుకైన పామాయిల్‌ ధర అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమన్నది. దీంతో పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి సబ్బుల ధరలు పెంచకతప్పలేదని సంస్థలు పేర్కొన్నాయి. మార్జిన్లు తగ్గుముఖం పట్టడంతో వీటి ధరలను ప్రస్తుత త్రైమాసికంలో పెంచాల్సి ఉంటుందని గత త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు సందర్భంగా ప్రకటించాయి కూడా. సబ్బుల తయారీలో కీలక ముడిసరుకైన పామాయిల్‌ ధరలు గడిచిన ఏడాదికాలంలో 30 శాతం వరకు పెరిగాయని విప్రో కన్జ్యూమర్‌ కేర్‌ సీఈవో నీరజ్‌ ఖత్రియా తెలిపారు. మిగతా సంస్థలు కూడా తమ సబ్బుల ధరలను 7-8 శాతం వరకు పెంచుతాయని అనుకుంటున్నట్లు చెప్పారు. గడిచిన మూడు నెలల్లోనే పామాయిల్‌ ధరలు 35 శాతం నుంచి 40 శాతం వరకు పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతోపాటు దిగుమతి సుంకం పెరగడం ఇందుకు కారణం. ప్రస్తుతం పది కిలోల పామాయిల్‌ ధర రూ.1,370గా ఉన్నది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z