* జోరు వానలకు తిరుగిరులు సరికొత్త శోభను సంతరించుకొన్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో.. శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఒకటో కనుమరహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది. ఏడుకొండల్లో పరచుకొన్న పచ్చదనం, ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్న జలపాతం భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. కపిలతీర్థం వద్ద జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. పుష్కరణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు.
* తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శనభాగ్యం కల్పించేందుకు తితిదే (TTD) ఏర్పాట్లు చేసింది. డిసెంబరు 3 నుంచి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి డిసెంబరు 2న తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు ఉచితంగా జారీ చేస్తారు. మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో 500 టోకెన్లు ఉదయం 3 నుంచి 5గంటల మధ్య జారీ చేయనున్నారు.
* విభజన అంశాలపై ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ సోమవారం మధ్యాహ్నం మంగళగిరిలోని ఏపీఏసీ కార్యాలయంలో భేటీ కానుంది. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు. ఏపీ, తెలంగాణ సీఎస్‌ల నేతృత్వంలో అధికారులు భేటీ కానున్నారు.
* ఇజ్రాయెల్ దాడులతో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న గాజావాసులు.. తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఈ పరిస్థితులు మరింత క్షీణించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గాజాలోకి పంపించే ప్రధాన మార్గం ద్వారా సహాయ సామగ్రి పంపిణీని నిలిపివేస్తున్నట్లు ఐరాసలోని పాలస్తీనా శరణార్థుల విభాగం ప్రకటించింది. ఆహార సామగ్రిని తరలించే ట్రక్కుపై సాయుధ దుండగులు దాడులు చేస్తూ, లూటీలకు పాల్పడుతుండడంతో అక్కడ పరిస్థితులు ప్రమాదకరంగా మారాయని తెలిపింది.
* ఎయిడ్స్ నివారణ దినోత్సవంలో భాగంగా ‘బ్రేకింగ్ ది సైలెన్స్’ నినాదంతో 2030 నాటికి ఎయిడ్స్ అంతం లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 3.25లక్షల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారన్నారు. యువతలో అత్యధికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి 50 కి.మీ లోపు లింక్ ఆర్ట్ కేంద్రాలతో అవగాహనతో పాటు, అందుబాటులో ఉన్న చికిత్స ఎంతో ముఖ్యమని చెప్పారు. కళంకం లేని ప్రపంచం కోసం మన నిబద్ధతను పునరుద్ధరిద్దామని.. అందరికీ ఆరోగ్యం, గౌరవానికి భరోసా ఇద్దామని పిలుపునిచ్చారు.
* మరికొన్ని రోజుల్లో మహారాష్ట్రలో (Maharashtra) కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోనున్నారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) స్పందించారు. ‘‘ప్రజలు ఆశించిన విధంగా మా ప్రభుత్వం పాలన అందించేందుకు మరోసారి సిద్ధంగా ఉంది. ప్రజా నిర్ణయంతో మాకు మరింత బాధ్యత పెరిగింది. అయితే.. మహారాష్ట్ర సీఎంగా ఎవరు ఉండాలనేది భాజపా నిర్ణయం తీసుకుంటుంది. అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి చర్చలు జరుపుతోంది. ఈ విషయంలో మా కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. భాజపా, శివసేన, ఎన్సీపీ కలిసి ఏకాభిప్రాయానికి రానున్నాయి’’ అని విలేకరుల సమావేశంలో శిందే పేర్కొన్నారు.
* ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రైతులకు శుభవార్త చెప్పారు. ఈ ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. ‘మారీచుల మాయమాటల నమ్మొద్దు.. సోనియాగాంధీ గ్యారంటీగా నేను చెబుతున్నా’ అని రైతులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మీడియాతో మాట్లాడారు. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశామని, అసెంబ్లీలో చర్చించి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామని సీఎం తెలిపారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ ఎలా పూర్తి చేశామో.. రైతు భరోసా కూడా అదేవిధంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
* రాజ్యసభ మాజీ డిప్యూటీ ఛైర్‌పర్సన్, ప్రముఖ రాజకీయ నాయకురాలు నజ్మా హెప్తుల్లా (Najma Heptulla) స్వీయ జీవితచరిత్ర ‘‘ఇన్ పర్స్యూట్ ఆఫ్ డెమోక్రసీ: బియాండ్ పార్టీ లైన్స్’’(In Pursuit of Democracy: Beyond Party Lines) అనే పుస్తకం తాజాగా విడుదలైంది. ఇందులో ఆమె కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi)కి, తనకు మధ్య జరిగిన ఓ సంఘటన గురించి పంచుకున్న విషయాలు బయటకు వచ్చాయి. 1999లో తాను ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యానని ఆ విషయం తెలియజేయడానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫోన్ చేశానని నజ్మా హెప్తుల్లా పేర్కొన్నారు. అయితే ఆమె సిబ్బంది ఒకరు తనతో మాట్లాడి ‘‘మేడం బిజీగా ఉన్నారు..లైన్‌లో ఉండండి’’ అని చెప్పారని, తాను గంటపాటు ఫోన్ లైన్‌లో ఉన్నా సోనియా గాంధీ తనతో మాట్లాడలేదని తెలిపారు. ఈ ఘటనతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని..మళ్లీ ఆ విషయం గురించి సోనియాతో ప్రస్తావించలేదని పేర్కొన్నారు. అయితే అంతకు ముందు ఐపీయూ ప్రెసిడెంట్ పదవికి తన పేరును సిఫార్సు చేసే ముందు ఆమె తనను అభినందనలు తెలిపారని గుర్తు చేసుకున్నారు.
* ఫెయింజల్ తుపాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షం ఆదివారం మధ్యాహ్నానికి తగ్గుముఖం పట్టింది. వర్షం కారణంగా తిరుగిరుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం సంతరించుకుంది. దట్టమైన పొగమంచు ఏర్పడటంతో భక్తులు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. పొగమంచుతోపాటు చిరుజల్లులు కురుస్తుండటంతో చలితీవ్రత ఎక్కువైంది. పొగ మంచు కారణంగా ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులను విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో 15 కిలోమీటరు వద్ద స్వల్పంగా కొండచరియలు విరిగిపడ్డాయి.
* కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం నుంచి తీర్థయాత్ర స్థలాల పునరుజ్జీవనం-ఆధ్యాత్మిక వృద్ధి లక్ష్యంగా నిర్దేశించిన ‘ప్రసాద్ పథకం’ కింద నిధులు ఏ విధంగా పొందాలనే అంశంపై దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎంపీ కేశినేని చిన్ని, దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, దేవస్థానం ఈవో కేఎస్ రామారావు ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
* ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టు ముంగిట ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత్ (Team India) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గులాబీ బంతితో జరిగిన ఈ మ్యాచ్‌ను 50 ఓవర్ల చొప్పున నిర్వహించాలనుకున్నారు. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వరుణుడు అంతరాయం కలిగించడంతో 46 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్ 43.2 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ సామ్ కాన్స్‌టస్ (107; 97 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) శతకం బాదాడు. 241 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇది ప్రాక్టీస్ మ్యాచ్ కాబట్టి మిగిలిన 3.1 ఓవర్లలో కూడా భారత్ బ్యాటింగ్ చేసింది. 46 ఓవర్లలో భారత్ 257/5 స్కోరు చేసింది.
* సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోడీ అదరగొట్టింది. ఫైనల్‌లో 21-18, 21-11 తేడాతో బావో లి జింగ్, లీ కియాన్ (చైనా) ద్వయంపై వరుస గేమ్‌ల విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. గాయత్రి-ట్రీసా జోడీకిది తొలి సూపర్ 300 టైటిల్ కావడం విశేషం. ఈ టోర్నీలో టైటిల్‌ను గెలిచిన తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా రికార్డు సృష్టించింది. ఈ జోడీ 2022 ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచింది. మహిళల సింగిల్స్ పీవీ సింధు (PV Sindhu) ఘన విజయం సాధించింది. చైనాకు చెందిన వు లు యుపై 21-14, 21-16తో గెలుపొందింది. 2017, 2022 తర్వాత సింధు మూడోసారి ఈ టైటిల్ గెలుపొందడం విశేషం. మరోవైపుపురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ కూడా ఫైనల్‌లో గెలుపొందాడు. సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ జేసన్ తేపై 21-6, 21-7తో విజయం సాధించాడు.
* ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జై షా నేడు బాధ్యతలు స్వీకరించారు. భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐదో వ్యక్తి జైషా కావడం విశేషం. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా జై షా(36) గుర్తింపు దక్కించుకున్నారు. చివరగా భారత్ నుంచి శశాంక్ మనోహర్ 2015-20 మధ్య ఈ పదవిలో ఉన్నారు.
* సుపరిపాలన అని చెప్పాల్సింది సీఎం కాదు, ప్రజలని తెలంగాణ మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. భారాస ప్రభుత్వం మంచి ఆర్థికవృద్ధితో రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు అప్పగించిందని, కానీ ఇప్పటి ప్రభుత్వానికి ఆదాయం పెంచే సత్తా లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదన్నారు. ‘‘రూ.7లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ నేతలు ఏడాదికాలంగా చెబుతు న్నారు. ప్రభుత్వ అప్పులన్నీ బహిరంగ రహస్యమే. ఏటా అసెంబ్లీలో కాగ్ ప్రవేశపెట్టే నివేదికల్లో ఉంటాయి. నాడు సీఎల్పీగా ఉన్న భట్టి విక్రమార్కకు రాష్ట్ర అప్పుల గురించి తెలియదా? గత ఎన్నికలకు ముందే రైతుబంధు వేసేందుకు మేం సిద్ధమయ్యాం. కానీ, కాంగ్రెస్ అడ్డుకుంది’’ అని హరీశ్‌రావు అన్నారు. సంపూర్ణ రుణమాఫీతోపాటు వరంగల్ డిక్లరేషన్ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z