Business

పాకిస్థాన్ హోటల్‌కు ₹1860కోట్ల చెల్లింపులా?-BusinessNews-Dec 01 2024

పాకిస్థాన్ హోటల్‌కు ₹1860కోట్ల చెల్లింపులా?-BusinessNews-Dec 01 2024

* అక్రమ వలసదారులకు (Illegal Migrants) వసతి కల్పించేందుకు న్యూయార్క్‌లోని పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వ హోటల్‌కు $220 మిలియన్లు (రూ.1860.40 కోట్లు) చెల్లించడాన్ని రిపబ్లికన్‌ పార్టీ నేత వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) తప్పుపట్టారు. అక్రమ వలసదారుల కోసం పన్ను చెల్లింపుదారుల నిధులతో విడిది ఏర్పాట్లు చేయడాన్ని ప్రశ్నించారు. అమెరికాలో వారికి ఆశ్రయం కల్పించడానికి న్యూయార్క్‌ నగర (NYC) పాలక సంస్థ పాక్‌ ప్రభుత్వానికి చెందిన రూజ్‌వెల్ట్‌ హోటల్‌కు సొమ్ము చెల్లిస్తోందని తెలియడంతో ఈ విధంగా స్పందించారు.

* హిమాలయ పర్వతాలు, ప్రకృతి అందాలతో ఆకట్టుకొనే నేపాల్‌కు విదేశీ పర్యాటకులు భారీగా పోటెత్తుతున్నారు. ఈ ఏడాది నవంబర్‌ వరకు 10లక్షల మందికి పైగా విదేశీ పర్యాటకులు విమానాల్లో తరలివచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో భారత్‌ నుంచి వచ్చిన వారే అధికమని పేర్కొన్నారు. జనవరి నుంచి నవంబర్‌ వరకు 10,55,533 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని నేపాల్‌ టూరిజం బోర్డు (NTB) తెలిపింది.

* దేశంలో వస్తు,సేవల పన్ను వసూళ్లు (GST collections) మరోసారి గణనీయ స్థాయిలో నమోదయ్యాయి. నవంబర్‌ మాసంలో రూ.1.82లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ రూపంలో రూ.34,141 కోట్లు, ఎస్‌జీస్టీ రూపంలో రూ.42,047 కోట్లు, ఐజీఎస్టీ రూపంలో రూ.91,828 కోట్లు సమకూరాయి. సెస్సుల రూపంలో మరో రూ.13,253కోట్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. దేశీయ లావాదేవీలతో అధిక మొత్తంలో రెవెన్యూ సమకూరినట్లు పేర్కొంది. గతేడాది నవంబర్‌తో (రూ.1.68 లక్షల కోట్లు) పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 8.5శాతం పెరగడం గమనార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఏడోసారి. ఈ ఏడాది అక్టోబర్‌లో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లు 9శాతం వార్షిక వృద్ధితో రెండో అత్యుత్తమ వసూళ్లు కాగా.. 2024 ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.2.10 లక్షల కోట్లు వసూళ్లు వచ్చాయి.

* ఇలాన్ మస్క్ ప్రముఖ జనరేటివ్‌ ఏఐ టూల్‌ ఓపెన్‌ఏఐతో తన న్యాయ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాడు. ఓపెన్‌ఏఐ పూర్తి లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమేరకు కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశాడు. ఓపెన్‌ఏఐ సహవ్యవస్థాపకుల్లో ఇలాన్‌మస్క్‌ ఒకరు. 2015 నుంచి 2018 వరకు తాను ఈ సంస్థలో ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని వీడారు. ఓపెన్ ఏఐ పూర్తిగా లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించడానికి మస్క్ ఇటీవల కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశారు. ఓపెన్‌ఏఐ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అందులో పేర్కొన్నారు. దానివల్ల తన సొంత ఏఐ కంపెనీ ‘ఎక్స్‌ఏఐ’ నిధులు కోల్పోతుందని ఆరోపించారు. ఈ వ్యాజ్యంలో ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్, మైక్రోసాఫ్ట్, పలువురు బోర్డు సభ్యులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏఐ సెర్చ్‌ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఓపెన్‌ఏఐను స్థాపించామని, కానీ అందుకు విరుద్ధంగా ఈ సంస్థ వ్యాపార ధోరణిను అవలంభిస్తున్నట్లు చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z