Politics

ముఖ్యమంత్రులు ఎవరైనా…ఆయనే పవర్‌ఫుల్ నెంబర్2-NewsRoundup-Dec 04 2024

ముఖ్యమంత్రులు ఎవరైనా…ఆయనే పవర్‌ఫుల్ నెంబర్2-NewsRoundup-Dec 04 2024

* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ (Retirement age) వయసులో మార్పు అంశంపై ఊహాగానాలు వస్తున్న వేళ ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చింది. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును మార్చే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. లోక్‌సభ (Lok Sabha)లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం 60 ఏళ్లు నిండిన తర్వాత పదవీ విరమణ చేస్తున్న విషయం తెలిసిందే.

* మహారాష్ట్రలో ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి భాజపా సీనియర్‌ దేవేంద్ర ఫడణవీస్‌ పేరు ఖాయమైంది. సీఎంగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్‌ టీచర్‌ ఒకరు ఫడణవీస్‌ (Devendra Fadnavis)తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. స్కూల్‌లో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉండేవారన్నదానిపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ చాలా మర్యాదపూర్వకంగా ఉండేవారని, సున్నితమనస్కుడని తెలిపారు. మహారాష్ట్ర (Maharashtra)లోని నాగ్‌పుర్‌ సరస్వతి విద్యాలయంలో ఫడణవీస్‌ 8 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలో సావిత్రి సుబ్రమణియం అనే ఉపాధ్యాయురాలు (Teacher recalls Devendra Fadnavis Schooldays) అక్కడ పనిచేశారు. తాజాగా ఫడణవీస్‌ భాజపా (BJP) శాసనసభాపక్ష నేతగా ఎన్నికవడంతో ఆమెను మీడియా పలకరించింది. దీంతో కాబోయే సీఎంతో తనకున్న అనుబంధాన్ని ఆమె పంచుకున్నారు. ‘‘ఫడణవీస్‌ చదువులో పెద్దగా అసాధారణ ప్రతిభ గల విద్యార్థేం కాదు. యావరేజ్‌ స్టూడెంటే కానీ బాగానే చదివేవాడు. పొడుగ్గా ఉండటంతో ఎప్పుడూ లాస్ట్‌ బెంచ్‌లోనే కూర్చునేవాడు. అతడు చాలా సున్నిత మనస్కుడు. తన చుట్టూ ఉన్నవారికి సాయం చేసేందుకు ముందుండేవాడు’’ అని గుర్తుచేసుకున్నారు.

* విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు మోహన్‌బాబు (Mohan Babu). తన సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలను ఆయన పోషించారు. అందులో మరింత ప్రత్యేకమైంది ‘రాయలసీమ రామన్న చౌదరి’ (Rayalaseema Ramanna Chowdary) ఒకటి. సురేశ్‌కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రామన్న చౌదరిగా మోహన్‌బాబు నటన, శ్వాగ్‌ పూర్తి భిన్నంగా ఉంటుంది. యాభయ్యేళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని తాను నటించిన చిత్రాల్లోని ఆసక్తికర సన్నివేశాలను మోహన్‌బాబు పంచుకుంటున్నారు. తాజాగా ‘రాయలసీమ రామన్న చౌదరి’లో దేవుడు.. స్నేహం.. గురించి చెప్పే అద్భుతమైన సన్నివేశానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ కథను నా స్నేహితుడు రజనీకాంత్‌ రాశారు. నా కెరీర్‌లో ‘రాయలసీమ రామన్న చౌదరి’ ల్యాండ్‌ మార్క్‌ మూవీ. అంతేకాదు, నటుడిగా నాకు 500వ చిత్రం. తెలుగులో సూపర్‌హిట్‌ అయింది. సురేశ్‌కృష్ణ అద్భుత దర్శకత్వంలో ఒక శక్తిమంతమైన పాత్రలో నటించాను. నా సినీ ప్రయాణంలో ఇదొక అద్భుమైన మైలురాయి – మోహన్‌బాబు

* తెలుగు రాష్ట్రాల్లో 55 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంత తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయని ఎన్‌జీఆర్‌ఐ విశ్రాంత శాస్త్రవేత్త నగేశ్ తెలిపారు. ములుగు జిల్లాలో ఏర్పడిన భూకంపాన్ని టెక్టోనిక్‌ ఎర్త్‌ క్వేక్‌గా పరిగణించొచ్చన్నారు. దీని ఫలితంగా ఆఫ్టర్‌ షాక్స్‌ (చిన్న చిన్న ప్రకంపనలు) వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. కానీ, వాటి తీవ్రత ప్రస్తుత ప్రకంపనల కంటే తక్కువగా ఉంటుందని చెప్పారు. సెసిమిక్‌ జోన్‌ మ్యాప్‌నకు అనుగుణంగా కట్టడాలు నిర్మిస్తే 6 తీవ్రతతో భూకంపం సంభవించినా నిర్మాణాలు కూలిపోయే అవకాశం ఉండదన్నారు. ప్రస్తుతం సంభవించిన భూకంపం ఒక రిమైండర్‌ అని ఆయన పేర్కొన్నారు. సెసిమిక్‌ జోన్‌ మ్యాప్‌నకు అనుగుణంగా నిర్మాణాలు ఉంటేనే మున్సిపల్‌ అధికారులు అనుమతులివ్వాలని సూచించారు.

* ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో వీరికి ఈవెంట్లను నిర్వహించారు. రన్నింగ్, జంపింగ్ ఇతర పరీక్షలు నిర్వహించారు. అర్హత సాధించిన వారికి ప్రత్యేకంగా ట్రాఫిక్‌ నిబంధనల అమలుపై శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకోనున్నారు. రాష్ట్రంలో 3 వేల మందికి పైగా ట్రాన్స్ జెండర్లుంటే.. వారిలో నగరంలోనే వెయ్యి మంది ఉన్నట్టు అంచనా. ఆసక్తిగల వారిని గుర్తించి నియమించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను గతంలో సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో పోలీసులు, హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్లను కూడా వాలంటీర్లుగా నియమించనున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి పది రోజులపాటు ట్రాఫిక్ విధులపై శిక్షణ అందిస్తారు. వీరికి ప్రత్యేక యూనిఫాంతోపాటు ప్రతి నెల నిర్దేశిత స్టైపెండ్ ఇవ్వనున్నారు.

* మహిళా న్యాయాధికారులను విధుల నుంచి తొలగింపునకు సంబంధించిన అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) తీవ్రంగా పరిగణించింది. గర్భస్రావం కారణంగా ఓ మహిళా న్యాయమూర్తి అనుభవించిన మానసిక, శారీరక క్షోభను మధ్యప్రదేశ్‌ హైకోర్టు (MP High Court) విస్మరించిందని పేర్కొంది. పురుషులకు నెలసరి వస్తే వారి పరిస్థితి తెలిసేది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సుప్రీం ధర్మాసనం.. సివిల్ జడ్జీల తొలగింపు విధివిధానాలపై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టును ఆదేశించింది.

* ఈ నెల 7,8,9 తేదీల్లో ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్టు సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. ముగింపు వేడుకల నిర్వహణపై ఉన్నతాధికారులతో సీఎస్‌ సమీక్షించారు. ఈనెల 7 నుంచి 9 వరకు పీవీ మార్గ్‌లో ప్రముఖ హోటళ్లు, డ్వాక్రా సంఘాలకు చెందిన 120 ఫుడ్‌, హస్తకళల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

* బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) సిరీస్‌లో ఇకపై టీమ్‌ఇండియా (Team India) ఆటగాళ్ల ప్రాక్టీస్‌ సెషన్స్‌ సమయంలో అభిమానులను అనుమతించరు. అడిలైడ్‌లో ఆసీస్‌తో రెండో టెస్టు కోసం భారత టెస్టు ప్రాక్టీస్ చేస్తోంది. అయితే, మంగళవారం భారత ఆటగాళ్లు సాధన చేస్తుండగా వందలాది ప్రేక్షకులు స్టేడియానికి వచ్చారు. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో టీమ్ఇండియా ప్లేయర్లను చాలా దగ్గరి నుంచి చూశారు. ఈ క్రమంలో కొంతమంది ఆసీస్ అభిమానులు భారత ఆటగాళ్లను ఎగతాళి చేస్తూ మాట్లాడారు.

* మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. డిసెంబరు 16న పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రజాభవన్‌ ఎదుట బారికేడ్లను ఢీకొట్టిన ఘటనలో సాహిల్‌పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాహిల్ దుబాయ్‌లో ఉంటున్నారు. తాజాగా ఈ కేసుపై విచారణ చేసిన న్యాయస్థానం… పోలీసు విచారణకు సహకరించాలని సాహిల్‌ను ఆదేశించింది.

* భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే హెచ్‌-1బీ వీసాలకు సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వీసాల కోసం తగినన్ని పిటిషన్లు వచ్చినట్లు అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్‌ సేవల (USCIS) విభాగం వెల్లడించింది. హెచ్‌-1బీకి ఎంపిక కాని వారికి మరికొన్ని రోజుల్లో ఆన్‌లైన్‌లో సమాచారం అందిస్తామని తెలిపింది. వీటిని పంపడం పూర్తైన తర్వాత.. ఎంపిక కాని వారికి స్టేటస్‌ మెసేజ్‌ను ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. హెచ్‌-1బీ వీసా పిటిషన్‌ దాఖలు ప్రక్రియ జూన్‌ 30, 2024తోనే ముగిసింది. అయితే, 30వ తేదీ ఆదివారం కావడంతో జులై 1న దాఖలైన పిటిషన్లను కూడా గడువులోగా దరఖాస్తు చేసినట్లుగానే పరిగణిస్తామని యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది. అయితే, వీసా పరిమితి నుంచి మినహాయింపు కలిగిన పిటిషన్ల స్వీకరణ, పరిశీలన కొనసాగుతుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా హెచ్‌-1బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న నిపుణుల ఉద్యోగ నిబంధనలు, సంస్థ మార్పు వంటి తదితర కారణాలతో దాఖలు చేసే పిటిషన్ల స్వీకరణ కొనసాగుతుందని పేర్కొంది. వివిధ దేశాలకు చెందిన వృత్తి నిపుణుల సేవలు వినియోగించుకోవాలని భావించే అమెరికా సంస్థలు వీసాలను స్పాన్సర్‌ చేస్తుంటాయి. ఇందుకోసం ప్రతి ఏడాది 85 వేల హెచ్‌-1బీ వీసాలను అమెరికా జారీ చేస్తుంది. ఇందులో 65వేల వీసాలు రెగ్యులర్‌ క్యాప్‌ కింద కాగా.. మరో 20 వేల వీసాలను తమ దేశంలో అడ్వాన్స్‌ డిగ్రీలు చేసిన వారికి మాత్రమే ఇస్తుంది. అయితే, గూగుల్‌, ఇన్ఫోసిస్‌, అమెజాన్‌, ఐబీఎం వంటి సంస్థలు దిగ్గజ అమెరికన్‌ సంస్థలు ఈ వీసాల సంఖ్యను ఇటీవల తగ్గించుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

* దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) నిబద్ధత, సమర్థత వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా ఆవిష్కృతమైందని సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అన్నారు. రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పాటైందని గుర్తుచేశారు. రోశయ్య మూడో వర్ధంతి సందర్భంగా నగరంలోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడారు. ‘‘నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రోశయ్య నన్ను తన ఛాంబర్‌కు పిలిపించుకుని విలువైన సూచనలు చేశారు. బాగా మాట్లాడుతున్నావు.. మరింత అధ్యయనం చేసి సభకు రావాలని చెప్పారు. ప్రతిపక్షం తప్పక ప్రశ్నించాలి.. పాలకపక్షం ఆ సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజలకు మేలు కలిగేలా అధికార పక్షాన్ని నిలదీయాలని చెప్పారు. రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా ఎలాంటి వివాదాలు లేకుండా పనిచేశారు. ఆయన పట్టుదల, మాటల్లో చతురత ఎంతో ముఖ్యమైనవి. పాలకపక్షంలో ఉంటే ప్రతిపక్షాలను.. ప్రతిపక్షంలో ఉంటే సీఎంగా ఉన్న వ్యక్తిని ఇరుకున పెట్టే విధానాన్ని ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరముంది. కాంగ్రెస్‌ పార్టీలో ఎంతోమంది సీఎంలుగా పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, భవనం వెంకట్రామ్‌, అంజయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.. ఇలాంటి వారంతా ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపించేందుకు కారణం రోశయ్య. సమస్యలను పరిష్కరించేందుకు వారికి కుడి భుజంలా ఆయన వ్యవహరించేవారు. అందుకే అప్పట్లో ఎవరు ముఖ్యమంత్రులగా ఉన్నా నంబర్‌ 2 పొజిషన్‌ పర్మినెంట్‌. నంబర్‌ 1 పొజిషన్‌ మాత్రమే మారుతుండేది. ఎవరు సీఎం అయినా.. నంబర్‌ 2లో రోశయ్యే ఉండాలని కోరుకునేవారు. తెలంగాణ శాసనసభలో ఆయనలా వ్యూహాత్మకంగా సమస్యలను పరిష్కరించే నేత లేకపోవడం లోటుగా కనిపిస్తోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z