Business

రికార్డులు దాటుకుంటూ దూసుకెళ్తున్న డాలరుvsరూపాయి-BusinessNews-Dec 10 2024

రికార్డులు దాటుకుంటూ దూసుకెళ్తున్న డాలరుvsరూపాయి-BusinessNews-Dec 10 2024

* వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ప్రముఖ ఫుడ్‌ డెలివరీ అగ్రిగేటర్‌ జొమాటో (Zomato) ప్లాట్‌ఫామ్‌ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ఫై ఫీడ్‌బ్యాక్‌, రేటింగ్‌ ఇచ్చే అవకాశముంది. అయితే, ఫలానా ఫుడ్‌ను మన స్నేహితులకు రికమండ్‌ చేసే అవకాశం లేదు. ఈ లోటును తీర్చేందుకు జొమాటో తాజాగా ‘రికమండేషన్స్‌ ఫ్రమ్‌ ఫ్రెండ్స్‌’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వారం క్రితమే ఈ ఫీచర్‌ను తీసుకొచ్చామని, లేటెస్ట్‌ వెర్షన్‌ యాప్‌లో ఇది అందుబాటులో ఉంటుందని జొమాటో యాజమాన్యం తాజాగా వెల్లడించింది. తాజా ఫీచర్‌తో ఫ్రెండ్స్‌ రికమండ్‌ చేసిన రెస్టరంట్‌లు, ఆహారపదార్థాలు మన జాబితాలో కనిపిస్తాయి. అందులో ఆసక్తి ఉన్నవాటిని బుక్‌ చేసుకునేందుకు వీలుంటుంది. ‘‘ తాజా ఫీచర్‌.. మా కస్టమర్లు వారి స్నేహితుల ద్వారా సిఫారసు చేసిన ఆహారపదార్థాలను ఎంచుకునేందుకు వీలుకల్పిస్తుంది. వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది’’ అని జొమాటో ఫుడ్‌ డెలివరీ సీఈవో రాకేశ్‌ రంజన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం లాభాల్లో కదలాడిన సూచీల్లో తర్వాత స్తబ్ధత నెలకొంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు సూచీలపై ఒత్తిడి పెంచగా.. ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఉదయం 81,575.96 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,508.46) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు మోస్తరు లాభాల్లో కదలాడింది. ఇంట్రాడేలో 81,182- 81,726 మధ్య చలించింది. చివరి 1.59 పాయింట్ల లాభంతో 81,510.05 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 8.95 పాయింట్ల నష్టంతో 24,610 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.85గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 71 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2687 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

* ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ మోటోరొలా (Motorola) ‘జీ’ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటో జీ35 5జీ (Moto G35 5G) పేరిట దీన్ని తీసుకొచ్చింది. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 5,000mAh బ్యాటరీతో ఈ మొబైల్‌ను తీసుకొచ్చింది. మోటో జీ35 5జీ కేవలం ఒక వేరియంట్‌లోనే లభిస్తుంది. 4జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది. రెడ్‌, లీఫ్‌ గ్రీన్‌, మిడ్‌నైట్‌ బ్లూ రంగుల్లో లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటోరొలా రిటైల్‌ దుకాణాల్లో కొనుగోలు చేయొచ్చు. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. 6.72 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో 120Hz రిఫ్రెష్‌ రేటు, 240Hz టచ్‌ సాంప్లింగ్‌ రేటు ఇచ్చారు. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌తో వస్తోంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6ఎస్‌ జనరేషన్‌ 3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

* రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) చీఫ్‌గా తన చివరిరోజున విలేకరుల సమావేశంలో శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) మాట్లాడారు. ఆర్‌బీఐ ముందున్న సవాళ్ల గురించి మాట్లాడిన ఆయన కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న సంజయ్‌ మల్హోత్రా (Sanjay Malhotra) గురించి ప్రస్తావించారు. ఈసందర్భంగా ‘ఎక్స్‌’ వేదికగా ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అపారమైన అనుభవం ఉన్న మల్హోత్రా సీబీడీసీ (CBDC), యూఎల్‌ఐ (ULI).. వంటి ఆర్‌బీఐ కార్యక్రమాలను సమర్థంగా నడిపించగలరని దాస్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. సైబర్ సెక్యూరిటీ అనేది సవాలుగా మారుతోందన్నారు. సైబర్‌ బెదిరింపులను సమర్థంగా ఎదుర్కొనేందుకు కొత్త సాంకేతికతలను ఉపయోగించడంపై దృష్టిసారించాలన్నారు. ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య సమతుల్యతను పునరుద్ధరించడం అత్యంత ముఖ్యమైన అంశమన్నారు. దాదాపు నాలుగేళ్లలో అత్యంత వేగంగా కూరగాయల ధరలు పెరగడంతో అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం 14నెలల గరిష్ఠ స్థాయి 6.21శాతానికి పెరిగిందన్నారు.

* టెక్‌ దిగ్గజం గూగుల్‌ (Google) క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో గణనీయమైన పురోగతి సాధించింది. సరికొత్త క్వాంటమ్‌ చిప్‌ను ఆవిష్కరించింది. సంప్రదాయ కంప్యూటర్ల కంటే మెరుపు వేగంతో పనిచేసే ‘విల్లో’ క్వాంటమ్‌ చిప్‌ను తీసుకొచ్చింది. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని కంపెనీ క్వాంటమ్‌ ల్యాబ్‌లో దీన్ని అభివృద్ధి చేసినట్లు గూగుల్‌ ప్రకటించింది. ఈవిషయాన్ని గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో పంచుకుంది. గూగుల్‌ తీసుకొచ్చిన విల్లో చిప్‌ ఎంతటి క్లిష్టతరమైన గణాంక సమస్యలనైనా కేవలం ఐదు నిమిషాల్లోనే పరిష్కరించగలదని కంపెనీ తెలిపింది. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్‌లు ఈ పనిని చేయాలంటే 10 సెప్టిలియన్‌ (ఒకటి తర్వాత 25 సున్నాలు ఉండే సంఖ్య) సంవత్సరాలు పడుతుంది. అంటే విశ్వం ఆవిర్భావం కంటే ఎక్కువ సమయం పడుతుందని గూగుల్‌ తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z