Business

రాబిన్‌హుడ్ గోల్డ్ మెటల్ కార్డు-BusinessNews-Dec 11 2024

రాబిన్‌హుడ్ గోల్డ్ మెటల్ కార్డు-BusinessNews-Dec 11 2024

* ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) కొత్త టెలికాం ప్లాన్‌ను తీసుకొచ్చింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ‘న్యూ ఇయర్‌ వెలకమ్‌ ఆఫర్‌ ప్లాన్‌ 2025’ని (Reliance Jio welcome plan) కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. రూ.2025 రీఛార్జిపై లాంగ్‌టర్మ్‌ వ్యాలిడిటీతో పాటు రూ.2,150 విలువైన కూపన్‌ ప్రయోజనాలనూ అందిస్తోంది. రిలయన్స్‌ జియో తీసుకొచ్చిన రూ.2025 ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో రీఛార్జి చేసుకుంటే..200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమితి 5జీ డేటా ఇస్తోంది. రోజుకు 2.5 జీబీ చొప్పున మొత్తం 500 జీబీ డేటా లభిస్తుంది. దీంతోపాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, ఎస్సెమ్మెస్‌లు కూడా పొందొచ్చు. ఇవే ప్రయోజనాలతో వస్తున్న జియో నెలవారీ ప్లాన్‌తో పోలిస్తే ఈ ప్లాన్‌ ద్వారా రూ.468 ఆదా చేసుకోవచ్చని జియో చెబుతోంది. ప్రస్తుతం రూ.349 ప్లాన్‌తో ఇవే ప్రయోజనాలు లభిస్తున్నాయి. 200 రోజులకు ఈ విలువ రూ.2,493 అవుతుందని జియో చెబుతోంది.

* ఫిన్‌టెక్‌ సంస్థ మొబిక్విక్‌ పబ్లిక్‌ ఇష్యూకు (MobiKwik IPO) ఇన్వెస్టర్ల నుంచి ఎనలేని ఆదరణ ఏర్పడింది. ఐపీఓకు వచ్చిన తొలి రోజే 7.3 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన కారణంగా బుధవారం ఒక్క రోజే భారీగా బిడ్లు అందుకుంది. ఇంకా సబ్‌స్క్రిప్షన్‌ ముగియడానికి రెండ్రోజులు గడువు ఉండడంతో మరిన్ని బిడ్లు దాఖలయ్యే సూచనలు కనిపిస్తున్నాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 2021లోనే ఐపీఓకు రావాలని ప్రయత్నించి పరిస్థితులు అనుకూలించక వెనక్కి వెళ్లిన మొబిక్విక్‌.. రెండో ప్రయత్నంలో ఐపీఓకు రావడంతో పాటు అనూహ్య ఆదరణ సంపాదించుకుంది. తొలి గంటలోనే పూర్తి సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. ఐపీఓలో భాగంగా మొత్తం 1.18 కోట్ల షేర్లు (1,18,71,696) అందుబాటులోకి ఉంచగా.. తొలిరోజుకు 8.68 కోట్ల బిడ్లను అందుకుంది. ఇందులో రిటైల్‌ ఇన్వెస్టర్ల పోర్షన్‌ అత్యధికంగా 26.71 రెట్లు, నాన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ కేటగిరీ 8.97 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అవ్వగా.. క్యూఐబీ కోటా మాత్రం కేవలం 2 రెండు శాతమే సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. రూ.572 కోట్ల ఐపీఓలో భాగంగా ధరల శ్రేణిని కంపెనీ రూ.265-279గా నిర్ణయించింది.

* ఒకప్పుడు క్రెడిట్‌కార్డులు స్టేటస్‌కి సింబల్‌గా ఉండేవి. తర్వాతి కాలంలో అందరికీ అందుబాటులోకి వచ్చాయి. కాలక్రమేణా క్రెడిట్‌ కార్డులు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మెటల్‌ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాకు చెందిన ఫిన్‌టెక్‌ సంస్థ రాబిన్‌ హుడ్‌ కూడా ఓ గోల్డ్‌ మెటల్‌ కార్డును తీసుకొచ్చింది. దీని డిజైన్‌కు ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ ఫిదా అయ్యారు. అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. కొన్ని నెలల క్రితం రాబిన్‌ హుడ్‌ సంస్థ తనకు ఈ గోల్డ్‌ క్రెడిట్‌ కార్డును పంపించిందని ఆల్ట్‌మన్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు. అప్పట్లో ఇదో మార్కెటింగ్‌ స్ట్రాటజీ అంటూ విస్మరించానని చెప్పారు. ఇప్పుడు నా మనసు మార్చుకున్నానని, డిజైన్‌ తనను ఎంతగానో ఆకట్టుకుందంటూ పోస్ట్‌ చేశారు. దీనికి రాబిన్‌ హుడ్‌ సీఈవో వ్లాడ్‌ టెనెవ్‌ ధన్యవాదాలు తెలిపారు. శామ్‌ ఆల్ట్‌మన్‌ అభిప్రాయంతో ఏకీభవిస్తూ కామెంట్లు పెట్టగా.. ఆల్ట్‌మన్‌ ఏదీ ఊరికే చేయడంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

* ఉద్యోగ భవిష్యనిధి సొమ్ము ఉపసంహరణ మరింత తేలిక కానుంది. ఈపీఎఫ్‌ఓ చందాదారులు నేరుగా ఏటీఎంల ద్వారా తమ పీఎఫ్‌ను విత్‌ డ్రా చేసుకునే అవకాశం త్వరలోనే కల్పించనున్నట్లు కార్మికశాఖ కార్యదర్శి సుమిత దావ్రా వెల్లడించారు. కార్మికులకు మెరుగైన సేవల కోసం కార్మిక మంత్రిత్వ శాఖ తన ఐటీ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తోందన్నారు. క్లెయిమ్‌లు వేగంగా పరిష్కరిస్తున్నామన్న ఆమె.. ఏటీఎంల ద్వారా చందాదారులు, లబ్ధిదారులు ఈ నగదును సులభంగా పొందవచ్చన్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు వరుసగా రెండో రోజూ ఫ్లాట్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్‌లు రోజంతా తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐలో విక్రయాలు స్టాక్‌ మార్కెట్ సూచీలపై ఒత్తిడి తెచ్చాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్‌ ఉదయం 81,568 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. తర్వాత స్వల్ప నష్టాల్లోకి జారుకుని, అనంతరం లాభాల్లోకి వచ్చింది. ఇంట్రాడేలో 81,742 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 16 పాయింట్ల లాభంతో 81,526 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.75 పాయింట్ల లాభంతో 24,641 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.84 గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్ మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌లు లాభపడ్డాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్‌ మహీంద్రా షేర్స్‌ నష్టాలు మూటగట్టుకున్నాయి.

* గత నవంబర్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి నెలవారీ ప్రాతిపదికన 14 శాతం పతనమై.. రూ.35,943 కోట్లకు చేరుకుంది. పలు ఆర్థికపరమైన అంశాలకు తోడుగా.. వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కారణంగా ఏర్పడిన అస్థిరత కారణంగా పెట్టుబడులు తగ్గినట్లుగా అంచనా. అయినా కూడా ఈక్విటీ ఆధారిత ఫండ్స్‌లో నికర పెట్టబడులు పెరగడం గమనార్హం. నికర పెట్టబడులు నవంబర్‌లో వరుసగా 45వ సారి పెరిగాయి. ఇది పెట్టుబడిదారుల్లో మ్యూచువల్ ఫండ్స్‌పై పెరుగుతున్న ఆకర్షణకు సూచన అని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడులు స్థిరంగా కొనసాగుతున్నాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (Amfi ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత నెలలో సిప్‌లో రూ.25,320 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు నెల అక్టోబర్‌లో రూ.25,323 కోట్లుగా ఉన్నాయి. డేటా ప్రకారం.. గత నెలలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మొత్తం రూ.60,295 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో రూ.2.4 లక్షల కోట్లతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 75 శాతం తక్కువ. డెట్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ భారీగా తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. అక్టోబర్‌లో రూ.1.57 లక్షల కోట్లతో పోలిస్తే నవంబర్‌లో కేవలం రూ.12,915 కోట్లు మాత్రమే డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. పెట్టుబడులు తగ్గినప్పటికీ, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నిర్వహణలో ఉన్న నికర ఆస్తులు (AUM) అక్టోబర్‌లో రూ.67.25 లక్షల కోట్ల నుంచి రూ.68.08 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z