* ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (Bharati Airtel) యూజర్లను ఆకట్టుకోవడంలో భాగంగా కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంతో.. ఆ తరహా సేవల్ని అందించేలా కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. తాజాగా ప్రీపెయిడ్ యూజర్ల కోసం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో మరో ప్లాన్ పరిచయం చేసింది. ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన కొత్త ప్లాన్ ధర రూ.398. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు పొందొచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఈ ప్లాన్ వస్తోంది. వ్యాలిడిటీ 28 రోజులు. దీంతో పాటు వింక్ మ్యూజిక్ సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతం రోజుకు 2జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ.379కి ఎయిర్‌టెల్ అందిస్తోంది. 1.5జీబీ డేటా కలిగిన మరో ప్లాన్‌ను 28 రోజులకు రూ.349కి ఇస్తోంది.
* దేశంలో నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (Retail inflation) కాస్త తగ్గుముఖం పట్టింది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఈ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 6.21 శాతంగా నమోదై ఆందోళన గురిచేయగా.. నవంబర్‌లో మాత్రం 5.48 శాతానికి తగ్గింది. ఆర్‌బీఐ లక్షిత స్థాయిలోపే (6 శాతం) నమోదు కావడం గమనార్హం. ఆహార పదార్థాల ధరలు తగ్గడం, మరీ ముఖ్యంగా కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడంతోనే రిటైల్ ధరలు దిగి వచ్చాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు గురువారం కేంద్ర గణాంక కార్యాలయం డేటాను విడుదల చేసింది. ఎన్‌ఎస్‌ఓ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం నవంబర్‌లో 9.04 శాతానికి తగ్గింది. అక్టోబర్‌లో ఇది 10.87 శాతంగా ఉంది. గతేడాది ఇదే నెలలో 8.70 శాతంగా నమోదైంది. ముఖ్యంగా కూరగాయలు, పప్పులు, పంచదార, పండ్లు, కోడిగుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు తదితరాల ధరల్లో తగ్గుదల నమోదైందని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. మరోవైపు జులై- ఆగస్టు మధ్య సగటున 3.6 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కాగా.. సెప్టెంబర్ ఇది 5.5 శాతానికి, అక్టోబర్‌లో ఏకంగా 6.2 శాతానికి చేరడం ఆందోళన కలిగించింది. 2023 సెప్టెంబర్ తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ ఈ స్థాయికి చేరడం గమనార్హం. దీంతో ఇటీవల ఆర్‌బీఐ తన పరపతి విధాన సమీక్షలో ద్రవ్యోల్బణ అంచనాలను పూర్తి సంవత్సరానికి 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంచింది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నా.. మన మార్కెట్లు మాత్రం ఒడుదొడుకులకు లోనై తర్వాత నష్టాల్లో స్థిరపడ్డాయి. ఐటీ స్టాక్స్ రాణించినప్పటికీ.. మిగిలిన రంగాల షేర్లలో మాత్రం స్తబ్ధత నెలకొంది. నవంబర్ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నేటి సాయంత్రం వెలువడనున్న వేళ మదుపర్లు అప్రమత్తత పాటించడం గమనార్హం. సెన్సెక్స్ ఈ ఉదయం 81,476.76 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,526.14) నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ.. కాసేపు లాభాల్లో కదలాడింది. తర్వాత నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 81,211.64 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ. చివరికి 236.18 పాయింట్ల నష్టంతో 81,289.96 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93.10 పాయింట్ల నష్టంతో 24,548.70 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.87గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.68 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2747 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
* ఆదాయ పన్ను చెల్లించేవారు ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనలు తెలుసుకోవడం మాత్రమే కాదు, దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే డిసెంబర్ 15 వచ్చేస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరం మూడో విడత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుకు ఇదే చివరి గడువు. డిసెంబర్ 15లోపు మూడో విడత పన్ను చెల్లించాలి. లేకుంటే భారీ ఫెనాల్టీ చెల్లించడం మాత్రమే కాకుండా.. చట్ట పరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందస్తుగా పన్నులు చెల్లించడం వల్ల జరిమానాలను నివారించవచ్చు. రూ.10,000 కంటే ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లించాల్సిన వారు.. జూన్ 15, సెప్టెంబరు 15, డిసెంబర్ 15, మార్చి 15 తేదీలలో నాలుగు వాయిదాలలో ముందస్తు పన్ను చెల్లించాలి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను. మూడవ ముందస్తు పన్ను వాయిదా డిసెంబర్ 15, 2024న ముగుస్తుంది. ఆ రోజు ఆదివారం కాబట్టి.. చెల్లింపుదారులు ఎలాంటి జరిమానాలు లేకుండా సోమవారం (డిసెంబర్ 16) చెల్లించవచ్చు. ఈ సౌలభ్యం 1994లో జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో వెల్లడించారు. అప్పటి నుంచి ఈ నియమంలో ఎలాంటి మార్పు చేయలేదు. కాబట్టి ట్యాక్స్ చెల్లించడానికి ఆఖరు రోజు సెలవు దినం అయితే.. ఆ మరుసటి పనిదినంలో చెల్లించవచ్చు.
* నకిలీ చెక్కులు, ఫోర్జరీ సంతకాలతో ఓ ఎన్నారైని బ్యాంకు అధికారులు నిండా ముంచేశారు. ఖాతాదారుడికి తెలియకుండానే రూ.6.5కోట్లు కొట్టేశారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆస్ట్రేలియా న్యూసౌత్ వేల్స్, సిడ్నీ క్వాకర్స్ హిల్, లవర్ గ్రోవ్‌డ్రైవ్‌లో నివాసముండే పరితోష్ ఉపాధ్యాయ్‌కు యాక్సిస్ బ్యాంక్ బేగంపేట బ్రాంచ్‌లో 2017 నుంచి ఖాతా ఉన్నది. బ్యాంకు సీనియర్ పార్టనర్ వెంకటరమణ, ఉద్యోగులు సురేఖ, హరి విజయ్, శ్రీదేవి, రఘుతో కలిసి ఆయన ఖాతాలోని డబ్బులను కాజేసేందుకు పథకం రచించారు. నకిలీ చెక్కులు తయారు చేసి, దానిపై సంతకాలు ఫోర్జరీ చేసి ఖాతాదారుడికి తెలియకుండానే రూ.6.5కోట్లు డ్రా చేసుకున్నారు. This article is updated on Dec 13 2024 with the below official statement from Axis Bank
Appended is the official media statement by Axis Bank official spokesperson “We have come across some media reports stating that officials of Axis Bank have been charged with impersonation and criminal breach of trust basis complaints made by one Mr. Paritosh Upadhyay. As per information available till date, the alleged transactions were entered into with the full knowledge of Mr. Paritosh Upadhyay and the allegations made against existing officials of Axis Bank have been found baseless. Axis Bank will continue to act in the best interest of its customers and is extending full cooperation to the authorities to resolve the matter at the earliest. The Bank reserves all its rights and remedies as available under applicable law, including initiating legal proceedings for any false and defamatory statements against the Bank or its officials.”
“Mr. పరితోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు యాక్సిస్ బ్యాంక్ అధికారులపై వంచన (impersonation) మరియు క్రిమినల్ విశ్వాస ఉల్లంఘన (breach of trust) అభియోగాలు నమోదైనట్లుగా మీడియాలో కొన్ని వార్తలు మా దృష్టికి వచ్చాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు సదరు లావాదేవీలన్నీ Mr. పరితోష్‌కి పూర్తిగా తెలిసే నిర్వహించబడ్డాయి మరియు యాక్సిస్ బ్యాంక్ అధికారులపై ఆయన ఆరోపణలు నిరాధారమైనవి. యాక్సిస్ బ్యాంక్ ఎల్లప్పుడూ తమ కస్టమర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడాన్ని కొనసాగిస్తుంది. ఈ విషయం సాధ్యమైనంత త్వరగా పరిష్కారమవడంలో విచారణకు సంబంధించి అధికారులకు పూర్తి సహకారం అందిస్తుంది. బ్యాంకుపై గానీ అధికారులపై గానీ తప్పుడు లేదా ప్రతిష్టకు భంగం కలిగించే ప్రకటనలు మొదలైనవాటికి సంబంధించి చట్టపరంగా తగు చర్యలు తీసుకునేందుకు బ్యాంకునకు పూర్తి హక్కులు ఉంటాయి.“
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z