Sports

తెలంగాణ రైతుకు బేడీలు. ప్రపంచ ఛాంపియన్‌గా గుకేష్-NewsRoundup-Dec 12 2024

తెలంగాణ రైతుకు బేడీలు. ప్రపంచ ఛాంపియన్‌గా గుకేష్-NewsRoundup-Dec 12 2024

* యువ కెరటం దొమ్మరాజు గుకేశ్‌ (Gukesh) సంచలనం సృష్టించాడు. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ను (World Chess Championship) సొంతం చేసుకున్నాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డింగ్ లిరెన్‌ (చైనా)తో జరిగిన తుది పోరులో విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన 14వ రౌండ్‌లో నువ్వా? నేనా? అన్నట్లుగా సాగిన గేమ్‌లో చివరికి విజయం గుకేశ్‌నే వరించింది. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు.

* దేశవ్యాప్తంగా పలుచోట్ల వివిధ ప్రార్థనా స్థలాల్లో నిర్వహిస్తున్న సర్వేలు (Surveys Of Places Of Worship) ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్న తరుణంలో అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏ కోర్టులోనూ ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించిన పిటిషన్లు తీసుకోరాదని స్పష్టం చేసింది. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించి భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఆయనతోపాటు వివిధ పార్టీల నాయకులు జితేంద్ర అహ్వాద్‌, శరద్‌పవార్‌, మనోజ్‌ కుమార్‌ ఝా తదితరులు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిపై నాలుగు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

* ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు పడింది. రుణసాయం ఒప్పందానికి ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ) ఆమోద ముద్రవేసింది. మనీలాలో జరిగిన సమావేశంలో ఈమేరకు ఆమోదం తెలిపినట్టు సమాచారం. రాజధాని నిర్మాణం కోసం ఏడీబీ నుంచి రూ.8వేల కోట్ల రుణం అందనుంది. ఇటీవల దిల్లీలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు, కేంద్ర ఆర్థికశాఖ, సీఆర్‌డీఏ, అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ) అధికారుల మధ్య కీలక చర్చలు జరిగాయి. వచ్చే నెల 19న ప్రపంచబ్యాంకు బోర్డు సమావేశం జరగనుంది. వాటిలో ఆ ఒప్పందంపై బ్యాంకు ప్రతినిధులు సంతకాలు చేయడంతో ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబరు ఆఖరులోగా సుమారు 25 శాతం నిధులు విడుదలవుతాయి.

* భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ (Grandhi Srinivas) వైకాపాకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వైకాపా ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు ఆయన గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు ఇవ్వకపోగా జగన్‌కు సన్నిహితంగా ఉండే పలువురు నేతలు చులకనగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.

* ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌లో (Whatsapp) మరో అద్భుతమైన ఫీచర్‌ రాబోతోంది. ఇతర భాషల్లో వచ్చే సందేశాలను చాట్‌ బాక్స్‌లోనే మీకు నచ్చిన భాషలో తర్జుమా చేసుకొనే సదుపాయం రానుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 2.24.26.9లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు వాట్సప్‌నకు సంబంధించిన అప్‌డేట్స్‌ అందించే వాబీటా ఇన్ఫో వెల్లడించింది. చాట్స్‌తో పాటు, వాట్సప్‌ ఛానెల్‌లోనూ ఈ సదుపాయం రాబోతోంది. వేర్వేరు వాట్సప్‌ గ్రూపుల్లో ఉండేటప్పుడు వివిధ భాషల్లో కొందరు చాట్ చేస్తుంటారు. కొన్నిసార్లు వేరే భాషల్లో ఉండే సుదీర్ఘ పోస్టులు వచ్చి పడుతుంటాయి. ఆ భాష రానివారు దాన్ని అర్థం చేసుకోవడానికి తెగ కష్టపడుతుంటారు. టెక్ట్స్‌ను కాపీ చేసి.. వేరే ట్రాన్సలేషన్‌ టూల్‌లో వేస్తుంటారు. ఆ విషయంపై అవగాహన వచ్చాక రిప్లయ్‌ ఇస్తుంటారు. ఇన్ని తంటాలు పడకుండా సులువుగా చాట్‌ను ట్రాన్స్‌లేట్‌ చేసుకునే సదుపాయం వాట్సప్‌లో రానుందన్నమాట.

* జమిలి ఎన్నికల (One Nation One Election)కు సంబంధించి మరో ముందడుగు పడింది. వీటికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే (Winter session) జమిలి ఎన్నికల ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. దీంతో కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 13, 14 తేదీల్లో తప్పనిసరిగా సభకు (Parliament) హాజరు కావాలని తమ ఎంపీలకు భాజపా, కాంగ్రెస్‌లు విప్‌ జారీ చేశాయి. జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న వేళ.. దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (JPC)కి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతోనూ సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

* వైకాపా(YRSCP)కు మరో షాక్‌ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ (Avanthi Srinivas) ఆ పార్టీకి రాజీనామా చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను వైకాపా అధ్యక్షుడు జగన్‌, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డికి పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌పై అవంతి పలు విమర్శలు చేశారు. ‘‘ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్‌ గౌరవించాలి. ఐదేళ్లు పాలించాలని కూటమికి ప్రజలు తీర్పు ఇచ్చారు. కనీసం ఐదు నెలల కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా? వైకాపాలో కార్యకర్తలు నలిగిపోయారు. పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. ఐదేళ్లు కార్యకర్తలందరూ ఇబ్బంది పడ్డారు. తాడేపల్లిలో కూర్చుని ఆయన (జగన్‌ను ఉద్దేశించి) ఆదేశాలిస్తారు.. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు’’ అని అవంతి శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు.

* రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా పరంగా ప్రగతి కనిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. విద్య, మౌలిక వసతులపై ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి జిల్లాలు, మండలాల వారీగా అకెడమిక్స్, మౌలిక సదుపాయాల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ ఇవ్వనున్నట్లు లోకేశ్‌ తెలిపారు.

* లగచర్ల దాడి కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రైతు హీర్యానాయక్‌కు సంగారెడ్డి జైలులో వైద్య పరీక్షల సమయంలో ఛాతీనొప్పి వచ్చింది. జైలు నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా రైతు హీర్యానాయక్‌కు బేడీలు వేసి తీసుకెళ్లిన ఘటనపై సీఎం రేవంత్‌ తీవ్రంగా స్పందించారు. రైతుకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడిన సీఎం.. ఘటనపై ఆరా తీశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు. హీర్యా నాయక్‌కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. ఛాతీనొప్పి రావడంతో రైతు హీర్యానాయక్‌కు మొదట సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం హీర్యానాయక్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని సంగారెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు. హార్ట్‌ బీట్‌ కొంచెం తక్కువగా ఉందని, గతంలో కూడా గుండె నొప్పి వచ్చిందని చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం పంజాగుట్ట నిమ్స్‌కు రిఫర్‌ చేశామని చెప్పారు. నిమ్స్‌ ఎమర్జెన్సీ విభాగంలో రైతుకు చికిత్స అందిస్తున్నారు.

* తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై హైకమాండే నిర్ణయం తీసుకుంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వం పాలనపై 50 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. దిల్లీలో మీడియాతో ఆయన చిట్‌చాట్‌ నిర్వహించారు.

* దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా రోడ్డు ప్రమాదాల సంఖ్య (Road Accidents) పెరిగిపోతోందని, వాటిని నియంత్రించాలంటే ప్రజల ప్రవర్తనలో మార్పు రావాలని అన్నారు.

* పశ్చిమాసియా దేశం సిరియాలో (Syria) పరిస్థితులు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. తిరుబాటుదారుల దాడులతో దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ (Bashar al Assad) దేశం విడిచి పారిపోవడంతో నాయకత్వ ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. సిరియాలో ఉన్న 75 మంది ఇండియన్లను తొలుత లెబనాన్ పంపించి.. అక్కడి నుంచి వివిధ విమానాల్లో భారత్‌కు తరలించింది.

* కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి (Telangana Thalli) విగ్రహాన్ని చూస్తే తన తల్లి గుర్తొచ్చిందని ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Tej) అన్నారు. గత ప్రభుత్వంలో కొలువుదీరిన విగ్రహాన్ని తానేమీ తప్పు పట్టడం లేదన్నారు. గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన కవులు, కళాకారులను కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్తించడం అభినందనీయమన్నారు.

* మాంజియోన్‌ (Luigi Mangione) అరెస్టు అయిన దగ్గరి నుంచి పలువురు వ్యక్తులు, నెటిజన్ల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. ‘సీఈఓ హంటర్‌’ పేరుతో ఆన్‌లైన్‌లో టోపీలు విక్రయిస్తున్నారు. మాంజియోన్‌ చిరునవ్వు, సిక్స్‌ప్యాక్‌తో కూడిన చిత్రాలను నెటిజన్లు పోస్టు చేస్తున్నారు. అలాగే సీఈవోను కించపరుస్తూ న్యూయార్క్‌లో పోస్టర్లు కూడా వెలిశాయి. తమ ఆరోగ్యబీమా పాలసీలు ఎక్కువగా తిరస్కరణకు గురి అవుతుండటంతోనే నెటిజన్లు ఇలా నిందితుడికి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కల్పించడాన్ని తిరస్కరించడం హత్యతో సమానం. కానీ దీనిలో ఎవరికీ శిక్ష పడదు’’ అంటూ ఓ దాత ఈ నేరాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బుధవారం నాటికి రూ.20 లక్షలకు పైగా విరాళాలు అందాయి. ఇన్సూరెన్స్ విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల కారణంగా పలువురు నిందితుడి చర్యకు మద్దతు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

* ఏపీలో కూటమి ప్రభుత్వం పింఛన్‌దారులకు ( Pensioners ) షాక్‌ ఇవ్వనుంది. అనర్హుల నుంచి తీసుకున్న పింఛన్‌ డబ్బులను రికవరీ ( Recovery ) చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహిస్తున్న సదస్సులో రెండో రోజు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఇందులో భాగంగా సామాజిక పింఛన్లలలో సుమారు 6 లక్షల మంది రాష్ట్రవ్యాప్తంగా అనర్హులున్నారని స్వయాన సంబంధిత మంత్రి నాదెండ్ల మనోహర్‌ ( Minister Manohar ) వెల్లడించడంతో ప్రభుత్వం షాక్‌కు గురయింది. రాష్ట్రంలో మొత్తం 64 లక్షల మంది అన్ని రకాల పింఛన్‌దారులుండగా దివ్యాంగుల కోటాలో అత్యధికంగా అనర్హులున్నారంటూ సదస్సులో వివరించారు.

* మంచు ఫ్యామిలీలో జ‌రుగుతున్న గొడ‌వ‌ల నేప‌థ్యంలో సినీ న‌టుడు మంచు మోహ‌న్ బాబు జ‌ర్న‌లిస్ట్‌పై దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఈ దాడి ఘ‌ట‌న‌లో జ‌ర్న‌లిస్ట్‌కు తీవ్ర‌గాయాలు కాగా.. మోహ‌న్ బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి అంటూ జ‌ర్నలిస్ట్ సంఘాలు అన్నీ ధ‌ర్నా చేయ‌డం మొద‌లు పెట్టాయి. అయితే ఈ క్ర‌మంలోనే నేడు ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహ‌న్ బాబు మ‌రో ఆడియోను వ‌దిలాడు. కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అంటూ మోహ‌న్ బాబు ప్ర‌శ్నించాడు. దీనిపై ప్ర‌జ‌ల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు ఆలోచించాలి. కుటుంబ స‌మ‌స్య‌లు అంద‌రికి ఉంటాయి. మేం న‌టులం కాబ‌ట్టి కొంత‌మంది ఉన్న‌వి లేనివి వార్త‌ల్లో చెబుతుంటారు. ఇలా వార్త‌లు చ‌దివేవారు కూడా ఆలోచించాలి. వారి ఇంట్లో కుటుంబ స‌మ‌స్య‌లు వ‌స్తే ఇలానే బ‌య‌ట‌కు చెబుతున్నారా అని ఆలోచించుకోండి అంటూ మోహ‌న్ బాబు అన్నారు.

* ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly polls) దగ్గరపడుతుండటంతో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) దూకుడు పెంచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక హామీలు ప్రకటిస్తోంది. ఇప్పటికే ఆటో డ్రైవర్లకు ఐదు కీలక హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మహిళలకు (Delhi women) ఆమ్‌ ఆద్మీ పార్టీ గుడ్‌ న్యూస్ చెప్పింది. వచ్చే ఎన్నికల్లో ఆప్‌ను గెలిపిస్తే 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకూ నెలకు రూ.2,100 అందజేస్తామని ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రకటించారు. గురువారం సీఎం అతిశీతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘ప్రతి మహిళకు రూ.1,000 ఇస్తామని గతంలో హామీ ఇచ్చాము. అయితే, కొంతమంది మహిళలు నా వద్దకు వచ్చి ద్రవ్యోల్బణం కారణంగా రూ.1,000 సరిపోవడం లేదని చెప్పారు. అందుకే వారి అభ్యర్థన మేరకు 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలకు రూ.2,100 ఇస్తాం’ అని కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలోకే ఈ మొత్తా్న్ని జమ చేయనున్నుట్లు వెల్లడించారు.

* అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న అగ్రరాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping)కు కూడా ఆహ్వానం పంపినట్లు తెలిసింది. ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాల్సిందిగా జిన్‌పింగ్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. నవంబర్‌లోనే ఆహ్వానం పంపినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. అయితే, ఈ వార్తలపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఇప్పటి వరకూ స్పందించలేదు. ఇదిలా ఉండగా.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్‌ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z