ఒక డాలరుకు వెయ్యి రూపాయిల విలువ కలిగిన ₹30కోట్ల ($3.6మిలియన్) ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్ సేవా సంపదను దొంగిలించి సంస్థ ప్రతిష్ఠను నిట్టనిలువునా చీల్చిన ఘరానా ఘనాపాటి పోలవరపు శ్రీకాంత్ చేసిన మోసాన్ని మరవకముందే “తానా” మెడకు భారీ తాఖీదుల(Subpoena) ఉచ్చు పడింది. FBI, IRS (Internal Revenue Service-ఆదాయపు పన్ను శాఖ), DOJ (Dept. of Justice)లు మూడు సంస్థలు సంయుక్తంగా తానాకు తాఖీదులు జారీ చేశాయని అధికారిక వర్గాల నుండి విశ్వసనీయ సమాచారం.
ఇంటికి కన్నాలేసి..సమాజహిత కార్యక్రమాల కోసం దాచిన సొమ్మును దిగమింగిన ఘనులతో సతమతమవుతున్న తానాకు ఈ తాఖీదుల రూపేణా మరో కొత్త తలనొప్పి తయారైనట్లు సమాచారం. కానీ ఈ విషయాన్ని తానా సభ్యులకు గానీ, బోర్డు సభ్యులకు గానీ, ఇతర కార్యవర్గ సభ్యులకు గానీ తెలియజేయకుండా గుట్టుగా ఉంచుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బోర్డు సభ్యుడు ఒకరు తానా బోర్డుకు సదరు విషయంపై స్పష్టతను ఇవ్వాలని కోరుతూ పంపిన వినతికి స్పందిస్తూ తాఖీదులు అందిన విషయం నిజమని తానా అధ్యక్షుడు ఒప్పుకున్నారని సమాచారం. ఇదే విషయం గురించి TNI తానా అధ్యక్షుడు నిరంజన్‌ను సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అందుబాటులో లేరు.
*** లోగుట్టు పెరుమాళ్లకెరుక!
2019 జనవరి నుండి 2024 డిసెంబరు వరకు తానా సభ్యుల వివరాలు, నిధుల సేకరణ, బ్యాంకు లావాదేవీలు, ఖాతాలు, కార్యవర్గ సభ్యుల వివరాలు, సకలం-సర్వం-సమస్తం తమకు సమర్పించాలని సదరు ఏజెన్సీలు “తానా పెద్ద తలకాయలకు” తాఖీదులు పంపినట్లు సారాంశం. డిసెంబరు 16న ఆయా వివరాలతో కోర్టుకు హాజరు కావాలని కోరారని, కానీ నోటీసులు అందుకున్న వారు దీన్ని గుట్టుగా ఉంచుతూ నెలరోజుల సమయాన్ని కోరుతూ పిటీషన్ దాఖలు చేశారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. సంస్థ సభ్యులకు బహిర్గతం చేయాల్సిన అవసరం లేనప్పటికీ అంతర్గతంగా అధికారిక బోర్డు సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు కూడా సమాచారం చెప్పలేనంత గుట్టు ఇందులో ఏముందనే ప్రశ్నలు తానా ప్రతినిధుల నుండి వినిపిస్తోంది. 2024లో అమెరికాలో జాతీయ స్థాయి తెలుగు సంఘాలను కుదిపేసిన మ్యాచింగ్ గ్రాంట్స్ పథకం ద్వారా సేకరించిన నిధులే ఇప్పుడు తానాకు తాఖీదులు రావడానికి కూడా కారణమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై బోర్డు గానీ, తానా నాయకత్వం గానీ స్పందిస్తారేమో వేచి చూడాలి.
*** శ్రీకాంత్‌పై అంత ప్రేమ ఎందుకు?
తానా ఫౌండేషన్ నిధులను సొంత ఐటీ కన్సల్టింగ్ సంస్థకు బదలాయించుకున్న శ్రీకాంత్ గురించి అప్పటికప్పుడు సభ్యులందరికీ ఈమెయిల్ పెట్టిన తానా అధినాయకత్వం, అదే ఈమెయిల్‌లో పేర్కొన్నట్లు ఇప్పటివరకు ఆయన మీద FBI కేసు పెట్టలేదనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. తానా బోర్డు మీటింగులో సైతం సభ్యులు అతని మీద పెట్టిన కేసు వివరాలు తెలియజేయాలని కోరినప్పటికీ లాయర్లతో చర్చిస్తున్నామని మాట దాటవేస్తున్నారనే తప్ప అసలు కేసు పెట్టారా? పెడతారా? అనే అంశంపై స్పష్టత లేదని కార్యవర్గ సభ్యులే TNIతో వాపోతున్నారు.
“గుడ్డిలో మెల్ల” మాదిరి అత్యవసర బోర్డు మీటింగుకు వచ్చి అంతా తానే చేశానని ఒప్పుకుని ఆ రోజున లక్ష డాలర్లు కట్టిన శ్రీకాంత్, ఇప్పటివరకు $5,00,000 (అర మిలియన్ – ₹4.25కోట్లు) కట్టాడని బోర్డు ఛైర్మన్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ సభ్యులకు అధికారికంగా తెలియజేశారు. ఇంకా $3.2మిలియన్లు తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. అయితే శ్రీకాంత్ డబ్బులు కడుతున్నాడు కాబట్టి కేసు పెట్టట్లేదా? లేదా తెరవెనుక తానా జిమ్మిక్కుల కారణంగా దీన్ని జాప్యం చేస్తున్నారా? అనేదానిపై స్పష్టత రావాలి. ఇదే విషయంపై తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్‌ను TNI సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అమెరికాకు వచ్చే ప్రయాణంలో ఉండటంతో వీలుపడలేదు.
*** దూసుకెళ్తున్న నాట్స్!
మరోవైపు తానా నుండి విడిపోయిన నాట్స్ “ఇంతింతై వటుడింతై” అన్నట్లు సేవా కార్యక్రమాల్లో, సంస్థ బలోపేతంలో దూసుకెళ్తోంది. తెలుగువారు కాదు భారతీయులే సరిగ్గా ఉంటారో లేదో అనే రాష్ట్రాల్లో సైతం నాట్స్ విభాగాలు శరవేగంగా ప్రారంభిస్తున్నారు. నాట్స్ బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మదన్ పాములపాటిలు నెలకి రెండు వారాంతాల్లో అమెరికాలోని మారుమూల రాష్ట్రాల్లో సైతం నాట్స్ విభాగాలను శరవేగంగా ప్రారంభించి స్థానిక తెలుగువారిని ప్రోత్సహిస్తున్నారు.
—సుందరసుందరి(sundarasundari@aol.com)
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z