* మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ సతీమణి తారక్క మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉన్న తారక్క అలియాస్ విమల సీదం సీఎం ఎదుట లొంగిపోయారు. తారక్క భర్త మల్లోజుల వేణుగోపాల్.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీకి ఆమె సమీప బంధువు. 1983లో మావోయిస్టు దళంలో చేరిన తారక్కపై నాలుగు రాష్ట్రాల్లో 170కి పైగా కేసులు నమోదయ్యాయి. ఆమెపై రూ.కోటికిపైగా రివార్డు ఉంది.
* దేశంలో తీవ్ర స్థాయిలో అవినీతి వ్యాపించి ఉందని శ్రీలంక (Sri Lanka) అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే (Anura Kumara Dissanayake) వ్యాఖ్యానించారు. అది చివరికి క్యాన్సర్‌గా మారిందని అన్నారు. అవినీతిని నిర్మూలించాలంటే సమష్టి కృషి అవసరమంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వ యంత్రాగం, రాజకీయా సంస్థలు, సమాజంలో ఇలా అన్ని చోట్ల అవినీతి వ్యాపించింది. అసమర్థత, అధికార దుర్వినియోగం సహా ఇతర సమస్యలతో దేశం బాధపడుతోంది. దేశమంతటా వ్యాపించిన ఉన్న అవినీతి క్యాన్సర్‌లా మారింది. దాన్ని నిర్మూలించాలంటే సమష్టి కృష్టి ఎంతో అవసరం’’ అని పిలుపునిచ్చారు. నిజాయతీ, శ్రద్ధతో తమ విధులను నిర్వర్తించాలని అధికారులకు సూచించారు.
* భారత్, పాకిస్థాన్ (India-Pakistan) తమ దేశాల్లోని అణు స్థావరాల జాబితాను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా పాటించాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒకరి దేశంలోని అణు కేంద్రాలపై మరో దేశం దాడి చేయకూడదనే ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ జాబితాను అందజేసుకున్నాయి. ఇరుదేశాలు ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ‘‘దౌత్యమార్గాల ద్వారా భారత్, పాకిస్థాన్ తమ అణు స్థావరాల జాబితాను పంచుకున్నాయి. ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. కశ్మీర్ సమస్యతో పాటు సీమాంతర ఉగ్రవాదంపై కూడా రెండు దేశాల మధ్య జాబితా మార్పిడి జరిగింది. ఈ జాబితాను ఇలా ఇచ్చిపుచ్చుకోవడం ఇది వరుసగా 34వ సారి’’ ఓ ప్రకటనలో పేర్కొంది.
* సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్లాలనుకొనేవారికి గుడ్‌న్యూస్. పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. కాచిగూడ -కాకినాడ టౌన్; హైదరాబాద్- కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9, 10, 11, 12 తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లకు టికెట్ రిజర్వేషన్ల బుకింగ్ సదుపాయం జనవరి 2వ తేదీ ఉదయం 8గంటల నుంచి అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని పేర్కొన్నారు.
* రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ జిల్లాలో మూడేళ్ల బాలిక ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. బాలికను కాపాడేందుకు సుదీర్ఘ ఆపరేషన్ చేపట్టిన అధికారులు.. 10రోజుల తర్వాత ఎట్టకేలకు చిన్నారిని వెలికితీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. అయితే, చిన్నారి ప్రస్తుత పరిస్థితిపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కోఠ్‌పుత్లీ జిల్లాలోని కిరాట్‌పుర గ్రామానికి చెందిన మూడేళ్ల చేతన డిసెంబరు 23న తన తండ్రితో కలిసి పొలానికి వెళ్లింది. అక్కడ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అధికారులను ఆశ్రయించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి భారీ ఆపరేషన్ చేపట్టారు.
* ఆస్ట్రేలియా పేరెంట్ వీసా కోసం సుదీర్ఘ కాలం వేచిచూడాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. కాంట్రిబ్యూటరీ పేరెంట్ వీసా కోసం 14ఏళ్లు నిరీక్షించాల్సి వస్తుండగా.. జనరల్ పేరెంట్ వీసా కోసం 31ఏళ్లు ఆగాల్సి వస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఇలా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో గడిచిన మూడేళ్లలో 2300 మంది చనిపోయినట్లు ఆస్ట్రేలియా హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆస్ట్రేలియా పేరెంట్ వీసాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా వీటి సంఖ్యను ఏడాదికి 4500 నుంచి 8500కు పెంచారు. అదే సమయంలో వీటి కోసం దరఖాస్తులు మాత్రం 2023 నాటికి 1.5లక్షలకు పెరిగినట్లు అంచనా.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం జనవరి 20 నుంచి నాలుగు రోజుల పాటు దావోస్‌లో పర్యటించనుంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నాలుగు రోజుల పాటు జరుగనున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2025’ సదస్సుకు సీఎం నేతృత్వంలోని ఏపీ బృందం హాజరు కానుంది. ఈ మేరకు ఏపీ నుంచి సదస్సుకు ప్రతినిధుల బృందం హాజరయ్యేందుకు అవసరమైన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
* టాలీవుడ్ నిర్మాత నాగవంశీ (Naga Vamsi)పై బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ గుప్తా ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా పేరుపొందిన బోనీకపూర్‌తో నాగవంశీ మాట్లాడిన తీరును ఆయన తప్పుపట్టారు. అగ్ర నిర్మాతతో ఈవిధంగా మాట్లాడటం సరికాదన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్స్‌తోనూ ఇలాగే ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించారు. ‘‘బోనీకపూర్ లాంటి సీనియర్ నిర్మాత పక్కన కూర్చొని తన వ్యాఖ్యలతో ఆయన్ని ఎగతాళి చేస్తున్న ఈ వ్యక్తి ఎవరు? అతడి వైఖరి ఏమీ బాలేదు. నాలుగు హిట్స్ అందుకున్నంత మాత్రాన అతడు బాలీవుడ్‌కు రాజు కాలేడు. టాలీవుడ్‌కు చెందిన సీనియర్ నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్‌బాబు వంటి వారితోనూ ఇదేవిధంగా మాట్లాడగలడా? విజయం అందుకోవడం మాత్రమే కాదు.. గౌరవం ఇవ్వడం కూడా నేర్చుకోవాలి’’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
* మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajmouli) దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త రానే వచ్చింది. జనవరి 2వ తేదీన ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు టాలీవుడ్ టాక్. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమం గురువారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతిస్తారా? లేదా? అన్న దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
* రాష్ట్ర ప్రభుత్వం నగర వాసులకు తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ ఉత్తర భాగం నగరవాసుల మెట్రో రైల్ (Hyderabad Metro Rail) కల నెరవేరబోతోంది. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanthreddy).. ప్యారడైజ్- మేడ్చల్ (23 కిలోమీటర్లు), జేబీఎస్-శామీర్‌పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్ల డీపీఆర్‌ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే డీపీఆర్‌లను సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేజ్-2 ‘బి’లో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని హెచ్ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హెచ్ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ రెండు కారిడార్ల డీపీఆర్ తయారీ విషయంపై చర్చించి ఈ మేరకు సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.
* పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసులు నోటీసులిచ్చారు. న్యూ ఇయర్ నాడు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మధ్యాహ్నం రెండు గంటల్లోగా విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బందరు తాలుకా పీఎస్‌కు పేర్ని నాని సతీమణి జయసుధ విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి పేర్ని జయసుధ పీఎస్‌కు వెళ్లారు. ఆమెను సుమారు రెండు గంటల పాటు విచారించారు.
* శాండల్‌వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇటీవల విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. వైద్య చికిత్స కోసం ఆయన అమెరికా చేరుకున్నారు. అక్కడికి వెళ్లేముందు అభిమానులకు సందేశం ఇచ్చారు. త్వరలోనే తిరిగి వస్తానన ఫ్యాన్స్‌తో చెప్పారు. ఇటీవల నాన్నకు క్యాన్సర్‌కు సంబంధించిన సర్జరీ పూర్తయిందని ఆయన కూతురు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. శివరాజ్ కుమార్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది. త్వరలోనే అభిమానులతో నాన్న మాట్లాడతారని పేర్కొంది. కాగా.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీ క్యాన్సర్ ఆస్పత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు. తాజాగా శివరాజ్ కుమార్ ఓ వీడియోను విడుదల చేశారు. తన భార్యతో కలిసి ఆయన మాట్లాడారు. తాను క్యాన్సర్ నుంచి కోలుకున్నట్లు వెల్లడించారు. మీ అందరి అభిమానం వెలకట్టలేనిదని శివరాజ్ కుమార్ అన్నారు. న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా అందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z