Business

భారీ లాభాల్లో భారత మార్కెట్-BusinessNews-Jan 02 2025

భారీ లాభాల్లో భారత మార్కెట్-BusinessNews-Jan 02 2025

* దేశంలో ఉపాధి శాతం గణనీయంగా పుంజుకుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ (Mansukh Mandaviya) తెలిపారు. యూపీఏ (UPA) హయాంతో పోలిస్తే పదేళ్లలో ఎన్డీయే సర్కారు ఐదు రెట్లు ఎక్కువ ఉద్యోగాలు కల్పించిందని వెల్లడించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI), ఎంప్లాయి ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) గణాంకాలను ఉటంకిస్తూ ఆయన ఉపాధి కల్పనకు సంబంధించిన గణాంకాలను వెల్లడించారు. 2014-15లో 47.15 కోట్ల మంది ఉద్యోగులు ఉండగా.. 2023-24 నాటికి 36 శాతం పెరుగుదల నమోదై 64.33 కోట్లకు చేరుకుందని కార్మిక మంత్రి తెలిపారు. 2004 నుంచి 2014 దశాబ్ద కాలంలో ఉపాధి కల్పన కేవలం 7 శాతం మాత్రమే పెరిగిందని తెలిపారు. 2004-14 మధ్యకాలంలో యూపీఏ ప్రభుత్వం 2.9 కోట్ల ఉద్యోగాలు సృష్టించగా.. గడిచిన పదేళ్లలో ఎన్డీయే సర్కారు మొత్తం 17.19 కోట్ల ఉద్యోగాలు కల్పించిందన్నారు. ఒక్క 2023- 24 ఆర్థిక సంవత్సరంలోనే 4.6 కోట్ల మందికి ఉపాధి లభించిందని పేర్కొన్నారు.

* ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ‘అశోక్‌ లేలాండ్‌’కు సంబంధించిన 2024 డిసెంబర్‌ మొత్తం అమ్మకాలు 5 శాతం పెరిగి 16,957 యూనిట్లకు చేరుకున్నాయి. 2023 డిసెంబర్‌లో ఈ అమ్మకాలు 16,154గా నమోదయ్యాయి. దేశీయ విక్రయాలు డిసెంబర్‌లో 4 శాతం పెరిగి 15,713 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ విక్రయాలు 2023 డిసెంబర్‌లో 15,153గా నమోదయ్యాయని అశోక్‌ లేలాండ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దేశీయ విపణిలో మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాల విక్రయాలు 6 శాతం వృద్ధితో 10,488 యూనిట్లుగా నమోదయ్యాయి. 2023 డిసెంబర్‌లో ఈ విక్రయాలు 9,932గా ఉన్నాయి. గడిచిన నెలలో దేశీయ మార్కెట్‌లో తేలిక వాణిజ్య వాహనాల(LCV) అమ్మకాలు 5,225 యూనిట్ల వద్ద స్థిరంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది.

* ప్రైవేటురంగ వొడాఫోన్‌ ఐడియా ఎట్టకేలకు 5జీ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది మార్చిలో 5జీ సేవల్ని తీసుకొస్తున్నట్లు వొడాఫోన్‌ ఐడియా ప్రతినిధి ఒకరు తెలిపారు. తద్వారా దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ సేవల్ని అందిస్తున్న రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel)కు పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మెరుగైన నెట్‌వర్క్‌ అనుభవంతో, తక్కువ ధరలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని సమాచారం.

* నిరుద్యోగ యువత, గృహిణులు, విద్యార్థులు, పేదలను లక్ష్యంగా చేసుకొని ‘పిగ్‌ బుచరింగ్‌ స్కామ్‌’ (Pig Butchering Scam) లేదా ‘ఇన్వెస్ట్‌మెంట్‌ స్కామ్‌’గా (Investment Scam) పిలిచే సైబర్‌ మోసాలు భారీగా పెరిగాయని కేంద్ర హోంశాఖ తాజా నివేదిక వెల్లడించింది. వీటి ద్వారా నిత్యం ప్రజలు భారీ స్థాయిలో నష్టపోతున్నారని తెలిపింది. ఈ మోసాల (Cyber Fraud) కోసం సైబర్‌ నేరగాళ్లు గూగుల్‌ వేదికలను విస్తృతంగా వాడుకొంటున్నారని పేర్కొంది. ‘‘విదేశాల నుంచి లక్షిత ప్రకటనలు ఇచ్చేందుకు గూగుల్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ సౌలభ్యంగా ఉంటోంది. పిగ్‌ బుచరింగ్‌ స్కామ్‌ లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ స్కామ్‌గా పిలిచే ఈ తరహా మోసాలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. భారీ స్థాయిలో మనీలాండరింగ్‌తోపాటు సైబర్‌ బానిసత్వం ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి’’ అని తాజా నివేదిక పేర్కొంది.

* చాలా రోజుల తర్వాత దలాల్‌ స్ట్రీట్‌ కళకళలాడింది. అయితే నష్టాలు.. లేదంటే ఓ మోస్తరు లాభాలకే పరిమితమైన సూచీలు.. చాలా రోజుల తర్వాత భారీ లాభాలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్‌, ఆటో, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. సెన్సెక్స్‌ ఓ దశలో 1500 పాయింట్ల మేర పెరగ్గా.. నిఫ్టీ దాదాపు 450 పాయింట్లు రాణించి 24,200 మార్కుకు చేరువైంది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒకేరోజు రూ.6 లక్షల కోట్లు పెరిగి రూ.450 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 78,657.52 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 78,507.41) లాభాల్లో ప్రారంభమైంది. ఉదయం కాసేపు ఓ మోస్తరు లాభాల్లో ట్రేడయిన సూచీ.. తర్వాత భారీ లాభాల్లోకి వెళ్లింది. ఇంట్రాడేలో 80,032.87 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 1,436.30 పాయిట్ల లాభంతో 79,943.71 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 445.75 పాయింట్ల లాభంతో 24,188.65 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మాత్రం మరో 10 పైసలు క్షీణించి 85.74కి చేరింది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఒక్క సన్‌ఫార్మా మినహా మిగిలిన అన్ని సూచీలూ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టైటాన్‌ షేర్లు రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 75 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2649 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z