* తెలంగాణ భవన్‌లో భారాస డైరీని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నేతలు హాజరయ్యారు. అనంతరం పార్టీ నేతలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు.
* మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు, విశ్రాంత ఏఎస్పీ విజయ్‌పాల్‌ను పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నారు.
* వాతావరణ సమాచార సేకరణ (weather data) అంశంపై కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక రచిస్తోంది. ఇకపై స్వదేశీ విమానాల సాయంతో వాతావరణ పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని స్వీకరించేలా యోచిస్తోంది. విమానాలు ఆ డేటాను భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ)తో తప్పనిసరిగా పంచుకునేలా చర్యలు చేపట్టబోతోంది.
* అనూహ్యంగా పదవి కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందుతోన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)పై స్వదేశంలో ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆమెను తమకు అప్పగించాలని ఆ దేశ (Bangladesh) తాత్కాలిక ప్రభుత్వం ఇప్పటికే న్యూదిల్లీకి సందేశం పంపింది.
* భద్రాచలంలోని (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు స్వామివారు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రధాన ఆలయంలోని ఉత్సవమూర్తులను బేడా మండపం వద్దకు తీసుకువచ్చి శ్రీకృష్ణావతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
* ఇళ్లు, పరిసరప్రాంతాల్లో నీరు నిల్వడం, పారిశుద్ధ్యం లోపించడం వంటి కారణాలతో దోమలు (Mosquitoes) వృద్ధి చెంది పలు వ్యాధులు వ్యాప్తి చెందుతుంటాయి. కొన్నిసార్లు ఆ అనారోగ్యం ప్రాణాంతకంగా మారుతుంది. వ్యాధులు సోకడానికి ప్రధాన కారణమైన ఆడ దోమలకు చెక్ పెట్టేలా శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగంతో ముందుకు వచ్చారు. ఉష్ణమండల ప్రాంతాల్లో దోమకాటు వల్ల విజృంభిస్తోన్న డెంగీ, మలేరియా వంటి వ్యాధుల కట్టడి కోసం ఆస్ట్రేలియాలోని మాక్వేరీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సరికొత్త ప్రయోగం చేశారు. మనుషులను కుట్టే ఆడ దోమలతో సంభోగం జరిపే మగ దోమల వీర్యాన్ని విషపూరితం చేయాలని యోచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పురుగు మందుల్లా ఇతర ప్రయోజనకర జాతులకు నష్టం జరగకుండానే దోమల బెడదను నివారించొచ్చని వారు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఈగల్లో జరిపిన ప్రయోగంలో.. ఆడ ఈగల జీవితకాలం గణనీయంగా తగ్గిపోయినట్లు గుర్తించారు. అయితే దీనివల్ల మనుషులు, ఇతర జాతులకు ఎలాంటి హానిలేదని నిర్ధరించుకున్న తర్వాతే, ఆ ప్రయోగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా ముందుకు వెళ్తామని వెల్లడించారు.
* మోహన్‌బాబు యూనివర్సిటీలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు నటుడు మోహన్‌బాబు (Mohanbabu). విద్యార్థులతో కలిసి పలు కార్యక్రమాల్లో సరదాగా పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కన్నప్ప (Kannappa) సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆ సినిమా కోసం తాము ఎంతో కష్టపడుతున్నామని అన్నారు. అనుకున్న దానికంటే భారీగానే ఖర్చుపెట్టినట్లు చెప్పారు. ‘‘రాయలసీమ రామన్న చౌదరి’లో నేనొక డైలాగ్ చెప్పా. నిన్న జరిగింది మర్చిపోను. నేడు జరగాల్సింది వాయిదా వేయను. రేపటి గురించి ఆలోచించను. కానీ గతం గతః. నిన్న జరిగింది మర్చిపోవాలి. నేడు ఏం చేయాలా? అనుకోవాలి. రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలి అని ఆలోచించుకోవాలి. మన సినిమా విజయం సాధిస్తే మనకు నిజమైన పండుగ. ఎందుకంటే ఇది మన వృత్తి. సంక్రాంతి అంటే రైతు. రైతు బాగుంటేనే మనంందరం బాగుంటాం. ఇది మనందరి పండుగ. అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా’’ అని మోహన్‌బాబు తెలిపారు.
* ఈతరం సినిమాల్లోని హీరో పాత్రలను ఉద్దేశించి ఇటీవల తన సినిమా కార్యక్రమంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన తన వ్యాఖ్యలపై తాజాగా ఆయన స్పందించారు. తన మాటలను వక్రీకరించారని ‘షష్టిపూర్తి’ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ‘‘పుష్ప 2 చిత్రంలో హీరో పాత్రపై నా వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వక్రీకరించారు. ఇటీవల అల్లు అర్జున్‌ను కలిసినప్పుడు ఇదే విషయంపై మాట్లాడుకున్నాం. ఆన్‌లైన్‌లో వచ్చిన పోస్టులు చూసి నవ్వుకున్నాం. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని నెగెటివ్ కోణంలో చూడకూడదు. సమాజంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలనే తెరపై ప్రతిబింబిస్తున్నాం. ‘లేడీస్ టైలర్’, ‘అప్పుల అప్పారావు’ లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ’’ అని చెప్పారు.
* ఐరోపా దేశాల సరిహద్దుల సార్వభౌమత్వాన్ని ఎవరు ఉల్లంఘించినా ఊరుకోమని ఫ్రాన్స్ హెచ్చరించింది. తాజాగా గ్రీన్ ల్యాండ్ విలీనంపై ట్రంప్ వ్యాఖ్యానించడం ఐరోపా సమాఖ్యలో కలకలం సృష్టించింది. ‘‘ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఐరోపా సమాఖ్య సరిహద్దులపై దాడి చేస్తే.. చూస్తూ ఊరుకొనే ప్రశ్నే లేదు. మాది బలమైన ఖండం. డెన్మార్క్‌లో దాదాపు 600 ఏళ్ల నాటి నుంచి భాగమైన గ్రీన్‌ల్యాండ్‌ను.. అలానే పనామా కాల్వను అమెరికా ఆక్రమించుకొంటుందంటే నేను నమ్మను. పరిస్థితులకు తగ్గట్లు మార్పులు చేసుకొనే వారు మాత్రమే తట్టుకోగలిగే యుగంలో ఉన్నామా అంటే.. అవును అనే చెబుతాను. ఐరోపా సమాఖ్య అతిగా ఆందోళన చెందడంకానీ బెదరడం కానీ చేయకూడదు. మేల్కొని బలోపేతం కావాలి’’ అని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జియోన్ నోయల్ బార్రోట్ పేర్కొన్నారు. ఆయన ఫ్రాన్స్ ఇంటర్ రేడియో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
* సోషల్‌మీడియా వేదికగా తాను వేధింపులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు మలయాళ నటి హనీరోజ్ (Honey Rose). ఈమేరకు ఆమె పోలీసులను ఆశ్రయించారు. నటి ఫిర్యాదుతో దాదాపు 27 మందిపై ఎర్నాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కీలకమైన వ్యక్తిగా భావించిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరును సిట్ అధికారులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అతడిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వయనాడ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. దీనిపై ఆమె స్పందించారు. ‘‘ఇప్పుడు నాకెంతో ప్రశాంతంగా ఉంది. ఈ కేసు విషయం గురించి ఇప్పటికే ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృష్టికి తీసుకువెళ్లాను. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని నాకు మాటిచ్చారు’’ అని తెలిపారు.
* దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections)హ్యాట్రిక్ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఫిబ్రవరి 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు ప్రకటించినట్లు ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘థాంక్యూ దీదీ’ అంటూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z