* అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శీతలపానీయం కోకా కోలా ప్రియుడు. ఆయన రోజుకు 12 డైట్ కోక్‌లను అలవోకగా తాగేసేవారట. ఈవిషయాన్ని గతంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. రెండోసారి ఆయన అమెరికా పగ్గాలను స్వీకరించనున్న వేళ కోకా కోలా ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను ఇచ్చింది. ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఓ డైట్ కోక్ బాటిల్‌ను డిజైన్ చేసింది. ఆ కంపెనీ ఛైర్మన్, సీఈవో జేమ్స్ క్విన్సీ స్వయంగా దానిని తీసుకెళ్లి ట్రంప్‌నకు అందజేశారు. ఈవిషయాన్ని ట్రంప్ కమ్యూనికేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ మార్గో మార్టిన్ ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ బాటిల్ గ్రే, బ్లూ, రెడ్ లేబుల్‌పై ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ ప్రమాణస్వీకారం’ అని రాసి ఉంది. 20 జనవరి 2025 అని తేదీ వేసి ఉంది. దీనిని ట్రంప్ గౌరవార్థం ఎరుపు రంగు బాక్స్‌లో పెట్టి ఇచ్చారు. దీంతోపాటు కోకా కోలా కంపెనీ 55 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక కార్యకలాపాల్లో భాగమైందని, అమెరికాలో 8,60,000 ఉద్యోగాలను కల్పించిందన్న సమాచారం ఉన్న కార్డు ఉంది. ‘‘అధ్యక్ష ప్రమాణస్వీకార గౌరవార్థం ప్రత్యేకమైన బాటిల్ విడుదల చేసే దశాబ్ధాల నాటి మా సంప్రదాయం కొనసాగుతోంది’’ అని పేర్కొన్నారు. గతంలో బరాక్ ఒబామా ప్రమాణస్వీకారం సందర్భంగా కూడా ప్రత్యేకమైన సీసాలను సిద్ధం చేసింది. ఆ తర్వాత అవి ఈబేలో ఒక్కోటి అత్యధికంగా 50 డాలర్ల వరకు ధర పలికింది. డొనాల్డ్ ట్రంప్‌నకు డైట్ కోక్ తాగే అలవాటు చాలాకాలం నుంచి ఉంది. తాను అధ్యక్షుడిగా 2016లో బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్వేతసౌధంలో ప్రత్యేక బటన్ ఏర్పాటుచేశారు. ఆయనకు అవసరమైనప్పుడు దానిని నొక్కితే డైట్ కోక్ తెచ్చి ఇచ్చేవారు. ‘నేను దానిని నొక్కిన ప్రతిసారీ అందరూ కొంచెం భయపడతారు’ అని జోక్ చేశారు. వాస్తవానికి ట్రంప్ మంచినీళ్లు తాగడం ఎప్పుడూ చూడలేదని యూఎఫ్‌సీ సీఈవో డానా వైట్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఇటీవల కాలంలో ట్రంప్ రెగ్యులర్ కోక్ కూడా తాగుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
* గత కొన్ని నెలలుగా రూపాయి విలువ గణనీయంగా క్షీణిస్తోంది. దీన్ని నిరోధించేందుకు ప్రభుత్వం రానున్న బడ్జెట్‌లో దిగుమతులపై అధిక సుంకాలను విధించే అవకాశాన్ని పరిశీలించవచ్చని యర్నెస్ట్ అండ్ యంగ్ చీఫ్ పాలసీ అడ్వైజర్ (EY Chief Policy Advisor) డీకే శ్రీవాస్తవ (Srivastava) తెలిపారు. దిగుమతిపై అధిక సుంకాలతో డాలర్ల డిమాండ్‌ను అరికట్టగలదని ఆయన అన్నారు. తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన 15వ ఆర్థికసంఘం సలహామండలి సభ్యుడిగా ఉన్నారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. ప్రధాన షేరల్లో కొనుగోళ్ల మద్దతుతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. రోజంతా అదే బాటలో పయనించాయి. రిలయన్స్, జొమాటో, ఎన్టీపీసీ షేర్లలో కొనుగోళ్ల సూచీలకు కలిసొచ్చాయి. దీంతో సెన్సెక్స్ 224 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 23,200 ఎగువన ముగిసింది.
* ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో (Zomato), ఫైనాన్షియల్ సేవల సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (Jio Financial Services)లు త్వరలో బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 50 (Nifty 50)లో చేరే అవకాశం ఉందని దేశీయ బ్రోకరేజ్ జెఎమ్ ఫైనాన్షియల్ తెలిపింది. దీనికి సంబంధించి ప్రకటన ఫిబ్రవరిలో వెల్లడయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మార్చి 31 నాటికి ఈ రెండు సంస్థలు ఇండెక్స్‌లో చేరనున్నాయని తెలిపింది. ఎఫ్‌ఎంసీజీ విభాగానికి చెందిన బ్రిటానియా ఇండస్ట్రీస్, ఆయిల్ మార్కెటింగ్‌లో ప్రధాన సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఇండెక్స్ నిఫ్టీ 50 నుంచి వైదొలగనున్నాయి. వీటి స్థానాల్లో జొమాటో, జియో ఫైనాన్స్ వచ్చి చేరనున్నాయి. ఇదిలా ఉండగా.. 2024 డిసెంబర్‌లో జొమాటో సెన్సెక్స్ 30 ( SENSEX 30) స్టాక్స్‌లో వచ్చి చేరింది. ఈ సూచీలో ఇంతకుముందున్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను ఇది రీప్లేస్ చేసింది. ఇండెక్స్‌లో చేరడంతో జొమాటోలోకి 513 మిలియన్ డాలర్లు వచ్చి చేరాయి. కంపెనీ షేర్లు 2024లో దాదాపు 125 శాతం పెరిగాయి.
* దేశీయ చిరుతిళ్ల ఉత్పత్తి సంస్థ హల్దీరామ్ (Haldiram) లో వాటా కొనుగోలు రేసులో ప్రముఖ శీతల పానీయాల సంస్థ పెప్సీకో (PepsiCo) వచ్చి చేరింది. అగర్వాల్ కుటుంబం నిర్వహిస్తున్న హల్దీరామ్‌లో మైనారిటీ వాటా కోసం పెప్సికో చర్చలు ప్రారంభించిందని తెలుస్తోంది. ఈవిషయంతో సంబంధమున్న వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. ఇప్పటికే ప్రపంచ పెట్టుబడి సంస్థలైన టెమాసెక్, ఆల్ఫావేస్ గ్లోబల్ ఈ రేసులో ఉన్నాయి. తాజాగా పెప్సికో ఇందులోకి ఎంట్రీ ఇచ్చింది. హల్దీరామ్ కంపెనీలో 10-15 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతూ టమాసెక్, ఆల్ఫా వేవ్ గ్లోబల్ గత నెలలోనే బైండింగ్ ఆఫర్లు సమర్పించాయి. తాజాగా పెప్సికో హల్దీరామ్‌లో పెద్దఎత్తున వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతుందని తెలుస్తోంది. దీనికోసం చర్చల్ని ప్రారంభించింది. కానీ అవి ఇంకా ప్రారంభదశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అగర్వాల్ కుటుంబం హల్దీరామ్ విలువను రూ.85,000-90,000 కోట్లు లెక్కగట్టినట్లు తెలుస్తోంది. చర్చల అనంతరం తుది ఆఫర్ వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z