Editorials

UPSC 2025 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల-NewsRoundup-Jan 22 2025

UPSC 2025 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల-NewsRoundup-Jan 22 2025

* పలువురు సినీ ప్రముఖుల ఇళ్లపై జరుగుతున్న ఆదాయ పన్నుశాఖ (ఐటీ) దాడులపై నిర్మాత, తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ (టీజీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌ దిల్‌రాజు (Dil Raju) స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదని అన్నారు. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాకు అభివాదం చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు. రెండో రోజు కూడా సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దిల్‌ రాజు నివాసాలు, కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి.

* దుండగుడి దాడిలో తీవ్ర గాయాలపాలైన బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు (Saif Ali Khan). తాను ఆస్పత్రికి వెళ్లడంలో సాయం చేసిన ఆటోడ్రైవర్‌ భజన్‌ సింగ్‌ రాణాను ఆయన కలిశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడానికి ముందు అతడిని కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. క్లిష్ట సమయంలో తనకు సాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటో తాజాగా బయటకు వచ్చింది. డ్రైవర్‌ను గుర్తు పెట్టుకుని అతడికి ధన్యవాదాలు చెప్పడాన్ని నెటిజన్లు హర్షిస్తున్నారు. మరోవైపు, సైఫ్‌ తల్లి షర్మిలా ఠాగూర్‌ సైతం డ్రైవర్‌ సాయాన్ని మెచ్చుకున్నారు. ధన్యవాదాలు చెప్పారు.

* చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్‌ సక్సెస్‌ రేటు తగ్గడంపై బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటీటీ వల్లే సినిమాలు థియేటర్లలో ఆడటం లేదని ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘ఈ మధ్యకాలంలో నేను చాలామందితో సినిమాల గురించి మాట్లాడాను. ఏదైనా సరే తాము ఓటీటీలో చూస్తామని వారు అన్నారు. బాక్సాఫీస్‌ వద్ద సినిమాలు సరిగ్గా ఆడకపోవడానికి ప్రధాన కారణం అదే. కొవిడ్‌ సమయంలో ప్రజలందరూ ఓటీటీ వేదికగా ఇంట్లో కూర్చొని సినిమాలు చూశారు. ఆ తర్వాత పరిస్థితులు ఎంతో మారినప్పటికీ వారు మాత్రం ఓటీటీకే మొగ్గు చూపిస్తున్నారు. అది వాళ్లకు ఒక అలవాటుగా మారింది’’ అని అక్షయ్‌ అన్నారు.

* ఖైరతాబాద్‌ చింతల్‌బస్తీలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియా, ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా ఖైరతాబాద్‌ షాదన్‌ కాలేజీ ఎదురుగా ఫుట్‌పాత్‌పై ఆక్రమణల కూల్చివేతలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నాగేందర్‌.. అక్కడికి చేరుకొని కూల్చివేతలు ఆపాలని అధికారులను కోరారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న పేదవారిపై దౌర్జన్యం చేయడంపై మండిపడ్డారు. దావోస్‌ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలన్నారు. కూల్చివేతలు ఆపకపోతే అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

* యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE) 2025 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. UPSC CSE 2025 పరీక్షకు జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరగనుంది. మరోవైపు, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో మరో 150 పోస్టులకు విడిగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్షకు సైతం ఫిబ్రవరి 11వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

* విచారణలో భాగంగా మంగళవారం పోలీసులు క్రైమ్‌ సీన్‌ రీక్రియేట్‌ చేసినట్లు సమాచారం. బాంద్రాలోని సైఫ్‌ ఇంటికి నిందితుడిని తీసుకువెళ్లి.. దాడి ఎలా చేశాడనే విషయాలు తెలుసుకున్నారు. ‘‘అర్ధరాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డులు నిద్రిస్తున్నట్లు గుర్తించిన నిందితుడు.. బిల్డింగ్‌ కాంపౌండ్‌ వాల్‌ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం వెనుక మెట్లు ఎక్కి ఎయిర్‌ కండిషనింగ్‌ డక్ట్‌ సాయంతో నటుడి ఇంట్లోకి వచ్చాడు. చప్పుడు కాకుండా ఉండేందుకు చెప్పులు తీసేసి బ్యాగ్‌లో దాచి.. సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాడు’’ అని పోలీసు అధికారులు చెప్పినట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. దాడి తర్వాత సైఫ్‌ తనని బాత్రూమ్‌లో బంధించాడని.. ఎయిర్‌ కండిషనింగ్‌ డక్ట్‌ సాయంతో ఆ గది నుంచి బయటపడ్డానని అతడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దాడి తర్వాత పోలీసులు గాలిస్తున్నారని గ్రహించిన అతడు కోల్‌కత్తాలోని హావ్‌డా వెళ్లి అక్కడి నుంచి బంగ్లాదేశ్‌ పారిపోవాలని భావించాడు.

* అగ్రరాజ్యానికి రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనలో దూకుడు పెంచారు. ఇప్పటికే గత అధ్యక్షుడు జో బైడెన్‌ ఇచ్చిన 78 ఆదేశాలను రద్దు చేస్తూ డజన్ల కొద్దీ కార్యనిర్వాహక ఆదేశాలను (ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు) జారీ చేశారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్‌ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ సిబ్బంది అందరికీ లేఆఫ్‌ (LayOff)లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వారందరినీ సెలవులో ఉంచాలని ఆదేశిస్తూ ట్రంప్‌ (Donald Trump) కార్యవర్గం ఓ మెమో జారీ చేసింది. అమెరికా (USA) ఫెడరల్‌ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఇన్‌క్లూజన్‌ ప్రోగ్రామ్‌లను నిర్వీర్యం చేస్తూ ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ నేపథ్యంలోనే సిబ్బంది నిర్వహణ కార్యాలయం మెమో విడుదల చేసింది. దాని ప్రకారం.. డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ (డీఈఐ) సిబ్బంది అందరినీ బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా (అమెరికా కాలమానం ప్రకారం) వేతనంతో కూడిన సెలవుపై పంపించాలని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలు అందాయి. ఈ విభాగాలకు చెందిన అన్ని వెబ్‌ పేజీలను కూడా ఈ గడువులోగా తొలగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

* ఏపీ సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఈవో బిల్‌గేట్స్‌తో చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ భేటీ అయ్యారు. శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ, సహకారాలు అందించాలని సీఎం కోరారు. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వాములు కావాలని కోరారు. గేట్స్‌ ఫౌండేషన్‌ కార్యకలాపాలకు ఏపీని గేట్‌వేగా నిలపాలని విజ్ఞప్తి చేశారు.

* రవాణా రంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరం, సీఐఐ, హీరో మోటార్‌ కార్ప్‌ నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలన్నారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు సహకరించాలని పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు. రాష్ట్ర ప్రజలు తక్కువ ఖర్చుతో.. వేగంగా ప్రయాణించాలనేది ప్రభుత్వ ఆకాంక్ష అని వివరించిన సీఎం.. అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. విద్యుత్ వాహనాలపై రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రద్దు చేసినట్లు వివరించారు.

* అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను ఉపేక్షించడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు (AP High court) స్పష్టం చేసింది. తిరుమలలోని శారదాపీఠం భవన నిర్మాణం విషయంలో ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ భవనం కూల్చివేతకు ఆదేశాలు ఇస్తామని తెలిపింది. తిరుమలలో ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రశ్నించింది. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిపితే ఏం జరుగుతుందో ఈ కేసు ఒక ఉదాహరణ కావాలని పేర్కొంది. విశాఖ శారదాపీఠం తిరుమలలో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నప్పటికీ తితిదే ఎలాంటి చర్యలు తీసుకోలేదని తిరుమల క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు, న్యాయవాది తుమ్మా ఓంకార్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. గతంలో ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. ఈ పిల్‌పై బుధవారం మరోసారి విచారణ జరిగింది. శారదాపీఠం భవనాన్ని సీజ్‌ చేస్తూ తితిదే బోర్డు తీర్మానం చేసిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. బిల్డింగ్‌ ప్లాన్‌ అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలిస్తామని పేర్కొంది. కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని శారదాపీఠం తరఫు న్యాయవాది అభ్యర్థించగా.. అందుకు అనుమతిస్తూ తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

* హెజ్‌బొల్లా సీనియర్‌ కమాండర్ (Hezbollah commander) షేక్‌ ముహమ్మద్‌ అలీ హమాదీ (Sheikh Muhammad Ali Hammadi) దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపారు. తూర్పు లెబనాన్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. ముహమ్మద్‌ అలీ హెజ్‌బొల్లా అల్‌-బఖా రీజియన్‌కు కమాండర్‌గా వ్యవహరించాడు. తన నివాసం బయటే ఉన్న ఆయనపై రెండు వాహనాల్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే కన్నుమూసినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే.. కొన్నేళ్లుగా కొనసాగుతున్న కుటుంబ కలహాల కారణంగానే ఆయనపై ఈ దాడి జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహారాష్ట్రలోని జల్‌గావ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం (Train Accident) చోటుచేసుకుంది. పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ (Pushpak Express) రైలు ప్రయాణికుల మీద నుంచి మరో రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాదాపు 40మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని పలు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

* విశాఖ వ్యాలీ వద్ద ఉన్న జువైనల్ హోమ్‌ బాలికలు బుధవారం ఆందోళనకు దిగారు. జువైనల్‌ హోమ్‌ ప్రహరీ గోడపైకెక్కి నిరసన తెలిపారు. సిబ్బంది తమను వేధిస్తున్నారని ఆరోపించారు. స్పందించిన పొలీసులు.. ఆందోళనకు దిగిన బాలికలను హోమ్‌లోపలికి పంపించారు. బాలికలు ఆందోళనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత స్పందించారు. ఆరోపణలపై విశాఖ సీపీ, కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మహిళా పోలీసు, తహసీల్దార్‌ నేతృత్వంలో బాలికలతో మాట్లాడాలని అనిత ఆదేశించారు. తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఆరోపణలు వాస్తవమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z