* సరూర్‌నగర్ పరిధిలోని అలకనంద ఆస్పత్రి కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎనిమిది మంది దళారులను పోలీసులు గుర్తించారు. గత ఆరు నెలలుగా అలకనంద ఆస్పత్రిలో ఈ తతంగం నడుస్తున్నట్లు గుర్తించారు. బెంగళూరుకు చెందిన వైద్యుడు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వైద్యుడితోపాటు మరికొంత మంది ప్రమేయం ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆస్పత్రి నిర్వాహకుడు సుమంత్‌తోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
* ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ను ఎక్కాలంటే చెల్లించాల్సిన రాయల్టీ ఫీజు.. పదేళ్ల తర్వాత పెరిగింది. రద్దీ ఎక్కువగా ఉండే సీజన్‌లో ఎవరెస్ట్ అధిరోహణకు విదేశీ పర్వతారోహకులు 15 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.13 లక్షలు. నేపాల్‌కు చెందిన పర్వతారోహకులకు కూడా గతంలో ఉన్న రాయల్టీ ఫీజును రెట్టింపు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
* ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు (Ram Gopal Varma) ముంబయి కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు వర్మపై నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి రూ.3.7లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అలా చేయని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధిస్తామని కోర్టు స్పష్టం చేసింది. 2018లో మహేశ్ చంద్ర అనే వ్యక్తి వర్మపై ఈ చెక్ బౌన్స్ కేసును వేశారు.
* జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) కోసం 10.71లక్షల దరఖాస్తులు వచ్చాయని గృహనిర్మాణశాఖ అధికారులు తెలిపారు. గురువారం వరకు 7.50 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని పేర్కొన్నారు. వారం రోజుల్లో మిగతా 3.21లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేస్తామని వెల్లడించారు. సర్వే పూర్తయిన తర్వాతే జీహెచ్‌ఎంసీలో వార్డు సభలు నిర్వహిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2,249 మంది సిబ్బంది దరఖాస్తుల పరిశీలనలో పాల్గొంటున్నారని తెలిపారు.
* తమ పార్టీ శివసేన (Shiv Sena), అధికార కూటమి మహాయుతిపై విమర్శలు చేస్తున్న శివసేన (యూబీటీ)పై (Shiv Sena (UBT)) మహారాష్ట్ర (Maharashtra) డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) మండిపడ్డారు. విమర్శలు మానుకోకపోతే.. 20 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరే మిగులుతారని వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మొదటి నుంచి కూడా నన్ను, మహాయుతిని శివసేన (యూబీటీ) విమర్శిస్తూనే ఉంది. కానీ, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయింది. గతేడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వారికి తమ స్థాయి ఏంటో తెలియజెప్పారు. ఓటమి పట్ల వారంతా ఆత్మపరిశీలన చేసుకోవాలి. విమర్శలను ఇలాగే కొనసాగిస్తే.. ప్రస్తుతం 20 మంది ఎమ్మెల్యేల నుంచి ఇద్దరే మిగులుతారు’’ అంటూ హెచ్చరించారు.
* జమ్మూకశ్మీర్ (Jammu and kashmir) రాజౌరీలోని బధాల్ గ్రామంలో మిస్టరీ మరణాలు (Mysterious deaths) ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. దీనికి వెనక కారణం ఏంటో సరిగా తెలియడం లేదు. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దాదాపు 200 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. బాధిత కుటుంబాలతో తరచూ కలుస్తుండే వారితో పాటు అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని.. ముందు జాగ్రత చర్యలో భాగంగా క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత, సౌకర్యాలతో వీరిని అందులో ఉంచారు. కంటైన్‌మెంట్ జోన్ 1.. మరణాలు సంభవించిన అన్ని కుటుంబాలను కవర్ చేస్తుంది. బాధిత కుటుంబాల నివాసాలు సీల్ చేస్తారు. కంటైన్‌మెంట్ జోన్ 2లో.. బాధిత కుటుంబాల సన్నిహితులుగా గుర్తించిన అన్ని కుటుంబాలకు చెందిన వ్యక్తుల నివాసాలు దీని కిందకు వస్తాయి. వీరి ఆరోగ్య పరిస్థితులను వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. కంటైన్‌మెంట్ జోన్ 3.. గ్రామంలో మిగిలిన అన్ని నివాసాలు దీని పరిధిలోకి వస్తాయి. ఇక్కడి ప్రజలు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు. సామూహిక భోజనాలు నిషేధం. లాగ్ బుక్‌ల నిర్వహణ వంటి అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.
* ముంబయిలోని వాంఖడే క్రికెట్ స్టేడియం (Wankhede Stadium) 50ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ముంబయి క్రికెట్ అసోసియేషన్ (MCA) సంబరాలు నిర్వహిస్తోంది. ఈ ఐకానిక్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగి నేటికి సరిగ్గా 50ఏళ్లు. 1975లో జనవరి 23-29 మధ్య భారత్, వెస్టిండీస్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో దివంగత ఏక్‌నాథ్ సోల్కర్ సెంచరీ చేశాడు. దీన్ని పురస్కరించుకుని బుధవారం వాంఖడే స్టేడియంలో ఎంసీఏ క్రికెట్ బంతులతో అతిపెద్ద వాక్యాన్ని రూపొందించి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. 14,505 ఎరుపు, తెలుపు బంతులను ఉపయోగించి ‘ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖడే స్టేడియం’ అనే వాక్యాన్ని రాశారు. ఈ వరల్డ్ రికార్డు కోసం ఉపయోగించి బంతులను ముంబయి నగరంలోని పాఠశాలలు, క్లబ్స్, ఎన్జీవోల్లోని యువ క్రికెటర్లకు ఇవ్వనున్నారు.
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల కేటాయింపు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఫిబ్రవరిలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. కృష్ణా ట్రైబ్యునల్ నీటి పంపకాల విషయంలో ఇవాళ సర్వోన్నత న్యాయస్థానంలో ఏపీ ప్రభుత్వం మెన్షన్ చేయడంతో.. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.
* వైఎస్ జగన్ పాలనలో ( Power deal ) అదానీతో (Adani ) జరిగిన విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు మాటలు ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) అభివర్ణించారు. అన్ని ఆధారాలు కళ్ళముందు కనిపిస్తుంటే, ఇంకా కచ్చిత సమాచారం కావాలని అడగటం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నట్లేనని ట్విటర్‌లో (Twitter) ఆరోపించారు. చంద్రబాబు (Chandra babu) ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్ళారు ? అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారని ప్రశ్నించారు. అదానీ పవర్ ఎక్కువ రేటు పెట్టి కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు భారం పడిందని , తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచి పెడుతున్నారని ఎందుకు ఆరోపణలు చేశారని విమర్శించారు.
* కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ముస్తఫాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ నిర్వహించాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా వైద్యుల సూచన మేరకు ఈ ప్రచార సభ రద్దైందని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాదిపూర్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని చెప్పారు. భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించే అవకాశం ఉందని అన్నారు. కాగా, సదర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్ సమీపంలో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీకి రాహుల్ గాంధీ హాజరుకాలేదు. ఆయన పాల్గోవాల్సిన మూడు ప్రచార సభల్లో రెండు రద్దయ్యాయి. దీంతో ముస్లిం ఓటర్ల విభజనకు కారణం కాకుండా రాహుల్ గాంధీ ఆప్‌కు సహకరిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z